Share News

ఏడేళ్లయినా ఏమీ తేల్చరా!

ABN , Publish Date - Aug 09 , 2026 | 04:52 AM

వైఎస్‌ వివేకానందరెడ్డి దారుణ హత్యకు సంబంధించి ‘అసలు హంతకులను’ గుర్తించాలని, తమకు న్యాయం చేయాలని కోరుతూ వివేకా కుమార్తె డాక్టర్‌ నర్రెడ్డి సునీత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఆరు పేజీల లేఖ రాశారు.

ఏడేళ్లయినా ఏమీ తేల్చరా!

  • వివేకా ‘అసలు’ హంతకుల్ని గుర్తించాలి

  • జగన్‌కు మరణ వార్త ముందే ఎలా తెలిసింది?

  • అత్యంత కీలకమైన దీనిని వెలికి తీయాల్సి ఉంది

  • కేసు దర్యాప్తులో ఎన్నో అస్పష్టతలు ఉన్నాయి

  • కిరణ్‌-అర్జున్‌రెడ్డి మెసేజ్‌లపై మొక్కుబడి విచారణ

  • కేసుకు సంబంధించి ఆరుగురు చనిపోయారు

  • వీరంతా ఒకే తరహాలో మృతి చెందారు.. అనుమానం ఉంది

  • మీరే న్యాయం చేయండి.. రాష్ట్రపతికి వివేకా కుమార్తె సునీత లేఖ

ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ, మంత్రిగా పనిచేసిన నాయకుడి హత్య కేసులో నిజాలు బయటికి రావడం మా కుటుంబానికేకాదు.. న్యాయ వ్యవస్థలు, దర్యాప్తు సంస్థలపై విశ్వాసం ఉన్న ప్రజలకు కూడా అవసరం. భయం, పక్షపాతం, ఒత్తిడి లేకుండా ఓర్పుతో నిజాన్ని వెలికి తీసేలా సమగ్ర దర్యాప్తు కోరుతున్నా.

- సునీత

‘‘నా తండ్రి వివేకా దారుణ హత్యపై ప్రతి దశలోనూ నా ఆందోళనలను న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లా. హత్యకు ఉపయోగించిన ఆయుధాన్ని సీబీఐ గుర్తించలేదు. నగదు ఎలా సమకూరిందీ తేల్చలేదు. నిందితుల పరస్పర సంబంధాలు, వారి కదలికలు.. ఏ సమయంలో ఎవరు ఎక్కడున్నారనే సమాచారం గుర్తించలేదు. హత్య వెనుక ఉన్న విస్తృత కుట్రను ఛేదించలేదు. హత్య విషయం జగన్‌కు ముందుగానే ఎలా తెలిసిందనే విషయంపైనా లోతైన దర్యాప్తు చేయలేదు. ఆయా కీలక విషయాలను స్పష్టంగా వెలికి తీయాల్సి ఉంది.’’

- రాష్ట్రపతికి రాసిన లేఖలో సునీత.

అమరావతి/పులివెందుల, ఆగస్టు 8(ఆంధ్రజ్యోతి): వైఎస్‌ వివేకానందరెడ్డి దారుణ హత్యకు సంబంధించి ‘అసలు హంతకులను’ గుర్తించాలని, తమకు న్యాయం చేయాలని కోరుతూ వివేకా కుమార్తె డాక్టర్‌ నర్రెడ్డి సునీత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఆరు పేజీల లేఖ రాశారు. ‘మా నాన్న దారుణ హత్యకు గురై ఏడేళ్లయింది. ఇప్పటికైనా న్యాయం చేయండి.’’ అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ లేఖను రాష్ట్రపతితో పాటు ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోం శాఖ, తెలంగాణ హైకోర్టు, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, దర్యాప్తు సంస్థలకు ఆమె పంపించారు. ‘‘మా నాన్న దారుణ హత్యకు గురై ఏడేళ్లు దాటుతున్నా నిజాలు తేలలేదు.


హత్యకు వినియోగించిన ఆయుధం లభించలేదు. డబ్బులు ఎక్కడ నుంచి సమకూరాయో తేల్చలేదు. విస్తృత కుట్ర కోణం వెలుగులోకి రాలేదు. వివేకా మరణ వార్త బాహ్య ప్రపంచానికి తెలియకముందే జగన్‌కు ఎలా తెలిసింది?. స్పష్టంగా తేలని అనేక విషయాలపైనా పూర్తిగా దర్యాప్తు జరగలేదు. ఇప్పటికైనా న్యాయం చేయండి.’’ అని ఆమె లేఖలో విజ్ఞప్తి చేశారు. తన తండ్రి వివేకాను దారుణంగా హత్య చేసిన, చేయించిన అసలు వ్యక్తుల్ని శిక్షించాలంటూ 2019 నుంచి న్యాయపోరాటం చేస్తున్నట్టు సునీత పేర్కొన్నారు. వివేకా హత్య సమాచారం ఎవరెవరికి ఏ సమయంలో ఎలా చేరిందన్న అంశం పూర్తిగా వెలికితీసేలా సీబీఐని ఆదేశించాలని రాష్ట్రపతిని అభ్యర్థించారు.

చార్జిషీట్‌లో చెప్పినా.. విచారణేదీ?

‘‘వివేకా హత్యకు సంబంధించి కొన్ని అంశాలపై దర్యాప్తు అవసరమని సీబీఐ స్వయంగా కోర్టుకు చెప్పింది. మరోవైపు, స్పష్టత లేని కొన్ని విషయాలపై(గ్రే ఏరియా) పూర్తిగా దర్యాప్తు చేయలేదని ట్రయల్‌ కోర్టు పేర్కొంది. వివేకా మరణ వార్త 2019, మార్చి 15 తెల్లవారు జామునే వై.ఎస్‌. జగన్మోహన్‌రెడ్డికి చేరిన అంశాన్ని సీబీఐ తన అదనపు చార్జిషీట్‌లో ప్రస్తావించింది. కానీ, వివేకా చనిపోయారని బహిరంగం కాక ముందే జగన్‌కు ఎలా తెలుసిందో సీబీఐ స్పష్టంగా తేల్చలేదు. దర్యాప్తు సంస్థపై నేను ఎలాంటి ఆరోపణలు చేయడం లేదు. కానీ, సీబీఐ స్వయంగా ప్రస్తావించిన ఇంతటి కీలక అంశాన్ని పూర్తి తేల్చాలని, దారుణ హత్యకు గురైన ఒక మాజీ మంత్రి కుమార్తెగా నేను విన్నవిస్తున్నా. న్యాయస్థానాల్లో పెండింగ్‌లో ఉన్న అంశాలపై జోక్యం చేసుకోవాలన్న ఉద్దేశం నాకు లేదు. రాజ్యాంగ సంస్థపై పూర్తి గౌరవంతో నా తండ్రి హత్య వెనుక దాగిన కుట్రలు పూర్తిగా బయట పడాలన్న ఉద్దేశంతోనే న్యాయం కోరుతున్నా.’’ అని రాష్ట్రపతికి సునీత విన్నవించారు.


ఏడేళ్లుగా నాన్న ఆత్మ క్షోభిస్తోంది!

పులివెందులలోని నివాసంలో వివేకానంద రెడ్డి అనుమానాస్పద రీతిలో ప్రాణాలు కోల్పోతే మొదట హత్య కేసుగా పరిగణించలేదని సునీత తన లేఖలో పేర్కొన్నారు. అనంతరం ఈ కేసును నేరపూరిత కుట్రకు సంబంధించినదిగా మార్చారని వివరించారు. ఏపీ ప్రభుత్వం మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినా దర్యాప్తు పురోగతిపై అనుమానం నెలకొందని, దీంతో తాను సీబీఐ విచారణ కోరుతూ హైకోర్టును ఆశ్రయించినట్లు పేర్కొన్నారు. 2020, జూలై 9న కేసు నమోదు చేసి.. 2021, అక్టోబరు 26న ప్రాథమిక అభియోగ పత్రం, 2022, ఫిబ్రవరి 3న మొదటి అనుబంధ, 2023, జూన్‌ 30న మరో చార్జిషీటు దాఖలు చేసినట్లు వివరించారు. నిష్పక్షపాత విచారణకు సంబంధించి తన ఆందోళనను పరిగణనలోకి తీసుకున్న సుప్రీం కోర్టు ఏపీ వెలుపల విచారణకు ఆదేశించడంతో హైదరాబాద్‌లోని సీబీఐ కోర్టులో విచారణ జరుగుతోందని తెలిపారు. తన పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకున్న కోర్టు ఏ-2 కిరణ్‌ యాదవ్‌, ఎస్‌. అర్జున్‌ రెడ్డి మధ్య జరిగిన సందేశాల మార్పిడిపై మరింత లోతుగా దర్యాప్తునకు ఆదేశించినా సీబీఐ మాత్రం నలుగురు సాక్షుల్ని విచారించి, కొత్త ఆధారాలు ఏవీ లభించలేదని మూడో చార్జిషీట్‌లో కోర్టుకు తెలిపిందని సునీత పేర్కొన్నారు. ‘‘కేసు రికార్డుల్లో ఉన్న సాక్షుల వాంగ్మూలాల మధ్య కొన్ని వైరుధ్యాలు ఉన్నాయని కోర్టు పేర్కొంది. కొన్ని గ్రే ఏరియాలు పూర్తిస్థాయిలో దర్యాప్తు కాలేదనీ తెలిపింది. ఈ మేరకు గత నెల జూలై 24న కోర్టు స్పష్టం చేసింది. నా తండ్రి ఆత్మ ఏడేళ్లుగా క్షోభిస్తోంది. అంతిమంగా న్యాయం జరగాలనే నేను పోరాటం చేస్తున్నా.’’ అని సునీత తన లేఖలో పేర్కొన్నారు.


మరిన్ని విషయాలు కోర్టుకు చెప్పాం!

‘‘నా తండ్రి వివేకానందరెడ్డి హత్య కేసులో న్యాయం జరిగే వరకు పోరాడుతూనే ఉంటా.’’ అని ఆయన కుమార్తె సునీత పునరుద్ఘాటించారు. శనివారం వివేకా 75వ జయంతిని పురస్కరించుకుని కడప జిల్లా పులివెందులలోని ఆయన సమాధి వద్ద కుటుంబ సభ్యులతో కలిసి ఆమె నివాళులు అర్పించారు. వివేకా సతీమణి సౌభాగ్యమ్మ, అల్లుడు నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డి.. ఇతర కుటుంబ సభ్యులు, వివేకా అభిమానులు పాల్గొన్నారు. అనంతరం సునీత మీడియాతో మాట్లాడారు. వివేకా హత్యపై ఇప్పటికే ఎన్నోమార్లు కోర్టును ఆశ్రయించానన్నారు. ఎనిమిదేళ్లవుతున్నా న్యాయంకోసం పోరాడుతూనే ఉన్నట్టు చెప్పారు. పలు విషయాలపై ఇంకా విచారణ చేయాల్సి ఉందని, ఇటీవల కోర్టును ఆశ్రయించామని తెలిపారు. వివేకా మరణించిన విషయం తెల్లవారు జామున 5:30 గంటలకే జగన్‌కు ఎలా చేరిందనే విషయంపై విచారణ చేయాలని కోరినట్టు పేర్కొన్నారు. ‘‘ఆ వార్త అందరికీ ఉదయం 6.15 గంటలకు తెలిసింది. అంతకంటే ముందే జగన్‌కు ఎలా తెలిసిందనే విషయాన్ని బయటకు తేవాలని కోరాను. అయితే, కుటుంబ సభ్యులు కదా సహజంగానే తెలిసి ఉంటుందని, దీని గురించి ఎందుకు విచారణ చేయాలని సమాధానమిస్తూ కోర్టు జడ్జిమెంట్‌ ఇచ్చింది. కానీ, అందరికీ 6.15కు తెలిసిందని సీబీఐ తన చార్జిషీట్‌లో చెప్పిన విషయాన్ని కోర్టు పరిగణనలోకి తీసుకోలేదు.’’ అని తెలిపారు. కాగా, అర్జున్‌రెడ్డికి కిరణ్‌యాదవ్‌ ‘మిడ్‌నైట్‌’ అని ఎందుకు మెసేజ్‌ పంపించాల్సి వచ్చిందనే దానిపై విచారణ చేయాలని కోర్టు ఆదేశించిందన్నారు. ఈ విచారణలో కూడా అనేక అవకతవకలు జరిగాయన్నారు. ‘లాంగ్వేజ్‌ మిస్‌ కమ్యూనికేషన్‌’ అని చెప్పి వదిలేశారన్నారు. ఆ మిడ్‌నైట్‌ సమయంలో కిరణ్‌యాదవ్‌ బయటతిరుగుతున్నాడని ఆయన తల్లి విచారణలో చెప్పిందన్నారు. ఈ విషయాన్ని కూడా కోర్టు ముందు ఉంచానన్నారు. దర్యాప్తులో లోపాలు ఉన్నాయని, అస్పష్టమైన అంశాలు ఉన్నాయని, కానీ ఒక నిర్దిష్టమైన క్రమంలో దర్యాప్తుచేయాలని సీబీఐకి సూచనలు ఇవ్వలేమని కోర్టు చెప్పిందన్నారు. ఏదేమైనా తమకు న్యాయం జరిగే వరకు పోరాడుతామన్నారు. త్వరలో విచరణ ప్రారంభమవుతుందని తెలిపారు.


జగన్‌కు ముందే ఎలా తెలుసు..

తన తండ్రి హత్య విషయం అందరి కన్నా ముందుగా జగన్‌కు ఎలా తెలిసిందనే అనుమానాన్ని రాష్ట్రపతికి రాసిన లేఖలో సునీత లేవనెత్తారు. ‘‘ఆయన మరణం ఎప్పుడు ఎవరి నుంచి ఎలా బయటికి వెళ్లిందనే విషయం ఏడేళ్లుగా నన్ను కలచి వేస్తోంది. 2023, మే 25న తెలంగాణ హైకోర్టులో సీబీఐ దాఖలు చేసిన అదనపు అఫిడవిట్‌లో వివేకా మరణ వార్త 2019, మార్చి 15 వేకువజామునే జగన్‌కు తెలిసిందనడం వెనుక నిజాలు బయటికి రావాలి. బాహ్య ప్రపంచానికి తెలియక ముందే వైసీపీ అధ్యక్షుడికి ఎలా తెలిసిందో వెలికి తీయాల్సిన అవసరం ఉంది. వివేకా హత్య కేసుకు సంబంధించి 2019-24 మధ్య ఆరుగురు చనిపోయారు. అందరివీ సహజ మరణాలే అంటున్నా ఒకే తరహాలో చనిపోవడం సందేహాలకు తావిస్తోంది. కేసు విచారణ కీలక దశకు చేరుకొంటున్న సమయంలో ప్రధాన సాక్షులు, కేసుతో సంబంధం ఉన్న వ్యక్తులు మరణిస్తుండటంపై అనుమానం వ్యక్తమవుతోంది.’’ అని సునీత తన లేఖలో పేర్కొన్నారు.

Updated Date - Aug 09 , 2026 | 04:54 AM