జగన్ పాత్ర ఏంటో తేల్చాలి!
ABN , Publish Date - Apr 14 , 2026 | 04:32 AM
మాజీ సీఎం జగన్ చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆయన కుమార్తె నర్రెడ్డి సునీతారెడ్డి న్యాయపోరాటం కొనసాగిస్తున్నారు. తన తండ్రి హత్య కేసులో జగన్ సహా ఇతరుల పాత్ర ఏంటో తేల్చాలని...
వివేకా హత్య కేసులో తదుపరి దర్యాప్తునకు ఆదేశించండి.. టీ-హైకోర్టును ఆశ్రయించిన సునీత
మరణ వార్త ఉ.5.30కే జగన్, భారతికి తెలిసిందని అజేయ కల్లం స్టేట్‌మెంట్ ఇచ్చారు
సమాచారం ముందే వారికెలా తెలిసింది?.. భారతికి ఎవరు ఫోన్ చేశారు.. ఏం చెప్పారు?
ఈ కోణాల్లో సీబీఐ విచారించలేదు.. లోతైన విచారణకు ప్రత్యేక కోర్టు అనుమతివ్వలేదు
దాని ఉత్తర్వులు కొట్టివేయండి: వివేకా కుమార్తె.. సీబీఐకి నోటీసులు జారీచేసిన హైకోర్టు
వైఎస్ భాస్కర్‌రెడ్డిని ఏపీలోకి అనుమతించొద్దు.. తెలంగాణ హైకోర్టుకు సీబీఐ, సునీతారెడ్డి వినతి
హైదరాబాద్, ఏప్రిల్ 13 (ఆంధ్రజ్యోతి): మాజీ సీఎం జగన్ చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆయన కుమార్తె నర్రెడ్డి సునీతారెడ్డి న్యాయపోరాటం కొనసాగిస్తున్నారు. తన తండ్రి హత్య కేసులో జగన్ సహా ఇతరుల పాత్ర ఏంటో తేల్చాలని అభ్యర్థిస్తూ ఆమె సోమవారం తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మరిన్ని కోణాల్లో విచారణ జరగాలని.. ఈ మేరకు పూర్తి స్థాయిలో తదుపరి దర్యాప్తు చేపట్టే విధంగా సీబీఐకి ఆదేశాలు జారీచేయాలని కోరారు. మాజీ సీఎస్ అజేయ కల్లం స్టేట్‌మెంట్ ప్రకారం ఉదయం 5.30 గంటలకే వివేకా మరణ వార్త జగన్, భారతిలకు తెలిసిందని.. అధికారికంగా ప్రకటించడానికి ముందే వారికి మరణ వార్త ఎలా తెలిసింది? భారతికి ఎవరు ఫోన్ చేశారు? ఏం చెప్పారనే విషయాలను సీబీఐ పట్టించుకోలేదని.. వాటిపై దర్యాప్తు చేయలేదని సునీతారెడ్డి పేర్కొన్నారు. తదుపరి దర్యాప్తును ఒక కోణానికే పరిమితం చేస్తూ ఇటీవల నాంపల్లి సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పు ఇచ్చింది. హత్య కేసులో నిందితుడు సునీల్ యాదవ్ సోదరుడు కిరణ్‌యాదవ్‌కు వైఎస్ ప్రకాశ్‌రెడ్డి మనవడు అర్జున్‌రెడ్డికి మధ్య జరిగిన సందేశాలపై మాత్రమే దర్యాప్తు చేయాలని సీబీఐని ఆదేశించింది. అయితే వారిద్దరి సంభాషణల్లో ఏమీ లేదని.. కొత్తగా ఎలాంటి ఆధారాలూ లభించలేదని.. దర్యాప్తును మూసేయాలని సీబీఐ ఇటీవల అనుబంధ చార్జిషీటు దాఖలు చేసింది.
తదుపరి దర్యాప్తు అంశాన్ని సీబీఐ కోర్టు ఒకే ఒక్క చిన్న అంశానికి పరిమితం చేయడం.. అందులో ఏమీ లేదని సీబీఐ చార్జిషీటు వేసిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో అన్ని కోణాల్లో దర్యాప్తు చేసేలా సీబీఐకి ఆదేశాలు జారీచేయాలని సునీతారెడ్డి తన తాజా పిటిషన్‌లో కోరారు. హత్య కేసులో జగన్, కె.గంగాధర్‌రెడ్డి, ఎం. ఓబుల్‌రెడ్డి, ఎంవీ కృష్ణారెడ్డి, వైఎస్ మనోహర్‌రెడ్డి, సయ్యద్ మున్నా, కిరణ్‌యాదవ్, అర్జున్‌రెడ్డి, గొర్ల భరత్ యాదవ్, ఏఎస్ఐ రామకృష్ణారెడ్డి, లోవరాజు తదితరుల పాత్ర ఏమిటో తేల్చేందుకు తదుపరి దర్యాప్తు చేయాల్సిందిగా సీబీఐని ఆదేశించాలని విజ్ఞప్తిచేశారు. ఈ పిటిషన్‌పై న్యాయమూర్తి జస్టిస్ కె.సుజన సోమవారం విచారణ చేపట్టారు. సునీతారెడ్డి తరఫున న్యాయవాదులు ఎస్ గౌతమ్, లిఖిత్‌రెడ్డి వాదనలు వినిపించారు. పూర్తిస్థాయిలో తదుపరి దర్యాప్తు జరిగితే వివేకా హత్య కేసులో స్పష్టత వస్తుందన్నారు. ఈ అంశం బాధితురాలైన సునీతారెడ్డికి, సీబీఐకి మధ్య వ్యవహారమని.. నిందితులు శివశంకర్‌రెడ్డి, వైఎస్ భాస్కర్‌రెడ్డి, కడప ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి తదితరుల వాదనలు వినాల్సిన అవసరం లేదని తెలిపారు. సీబీఐ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఈ పిటిషన్ దాఖలైందని.. మొదటిసారి విచారణకు వచ్చినందున కౌంటర్ దాఖలుకు 2 వారాల సమయమివ్వాలని సీబీఐ తరఫు న్యాయవాది శ్రీనివాస్ కపాటియా కోరారు. తదుపరి విచారణ కోరుతూ పిటిషనర్ సీబీఐ కోర్టులో వేసిన పిటిషన్‌లో నిందితులను ప్రతివాదులుగా చేర్చలేదని వారి తరఫు న్యాయవాది తెలిపారు. హైకోర్టులో దాఖలైన ఈ పిటిషన్‌లో తాము ఇంప్లీడయ్యేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు. వాదనలు విన్న ధర్మాసనం.. సీబీఐకి నోటీసులు జారీచేసింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.
సునీత పిటిషన్‌లో కీలకాంశాలివీ..
హత్య జరిగిన రోజు (2019 మార్చి 15న) కిరణ్ యాదవ్, అర్జున్‌రెడ్డి మధ్య సంభాషణలకు ఎలాంటి ప్రాధాన్యం లేదని సీబీఐ పేర్కొంది. కిరణ్ యాదవ్ కాల్‌రికార్డుల ప్రకారం అతడి మొబైల్ నంబర్ నుంచి ఏ-1 ఎర్ర గంగిరెడ్డికి కాల్ వెళ్లింది. 42 సెకన్లు వాళ్లు మాట్లాడుకున్నారు. ఏ-3 ఉమాశంకర్‌రెడ్డికి సైతం కాల్ వెళ్లింది. సీబీఐ ఈ విషయాలన్నీ పట్టించుకోకుండా వదిలేసింది.
ఏ-2 సునీల్ యాదవ్ సోదరుడు కిరణ్ యాదవ్ స్టేట్‌మెంట్‌కు.. వారి తల్లి సావిత్రి స్టేట్‌మెంట్ పూర్తి విరుద్ధంగా ఉంది. రాత్రి 10 గంటల ప్రాంతంలో సునీల్ యాదవ్ ఇంటి నుంచి వెళ్లిపోయాడని తల్లి సావిత్రి చెప్పగా.. రాత్రి మొత్తం ఇంట్లోనే ఉన్నాడని కిరణ్ యాదవ్ స్టేట్‌మెంట్‌లో ఉంది. అలాగే కిరణ్ యాదవ్ రాత్రంతా యాక్టివ్‌గా ఇంటర్‌నెట్ వినియోగించినట్లు డేటా చెబుతోంది. సీబీఐ దాఖలు చేసిన మూడో అనుబంధ చార్జిషీటు చూస్తే.. దర్యాప్తును నామమాత్రంగా చేసినట్లు తేటతెల్లమవుతోంది. కిరణ్‌యాదవ్, అర్జున్‌రెడ్డి సంభాషణలపై దర్యాప్తు చేయాలని కోర్టు పరిమితంగా ఇచ్చిన ఆదేశాలను కూడా సీబీఐ పాటించలేదు. ఈ చిన్న కోణాన్ని కూడా సరిగా దర్యాప్తు చేయలేకపోయింది. ఈ నేపథ్యంలో వివేకా హత్య కేసులో సమగ్ర దర్యాప్తు జరగాలి.
వివేకా చనిపోయినట్లు అధికారికంగా ప్రకటించడానికి ముందే అత్యంత పెద్ద పొలిటికల్ లీడర్లకు (జగన్) వివేకా మరణ వార్త ఎలా తెలిసింది? వారికి ఎవరు ఫోన్ చేశారు? ఏం చెప్పారు? హత్యకోసం వాడిన ఆయుధాలు ఏమయ్యాయి? ఏ-4 దస్తగిరితో ముడిపడి ఉన్న.. వివరణ లేని డబ్బు, బంగారు ఆభరణాల విషయంలో సీబీఐ ఏం తేల్చింది? వివేకా హత్య జరిగిన తర్వాత ఆధారాల చెరిపివేత విషయంలో ఎంవీ కృష్ణారెడ్డి, వైఎస్ మనోహర్‌రెడ్డి పాత్ర ఏంటి? రిటైర్డ్ పోలీసులను పెట్టుకుని సాక్షులను ఒక పద్ధతి ప్రకారం బెదిరించడం.. విస్తృత స్థాయి కుట్రను బయటకు తీయాలన్న సుప్రీంకోర్టు ఉత్తర్వులపై సీబీఐ ఏం చేసింది.. వంటి విషయాలన్నీ తేలాల్సి ఉంది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో తదుపరి విచారణకు దర్యాప్తు సంస్థకు ఆదేశాలు జారీచేయాలి.
వైఎస్ భాస్కర్‌రెడ్డిని ఏపీలోకి అనుమతించొద్దు
తెలంగాణ హైకోర్టుకు సీబీఐ, సునీతారెడ్డి వినతి
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్యకేసు నిందితుడు వైఎస్ భాస్కర్‌రెడ్డికి ఆంధ్రప్రదేశ్‌లో ప్రవేశించడానికి అనుమతివ్వవద్దని సీబీఐ, సునీతారెడ్డి తెలంగాణ హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు. తనకు కోర్టు బెయిల్ ఇచ్చేటప్పుడు ఆంధ్ర వెళ్లరాదని షరతు విధించిందని, దానిని సడలించాలని భాస్కర్‌రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యం సోమవారం న్యాయమూర్తి జస్టిస్ కె.సుజన ఎదుట విచారణకు వచ్చింది. 2019లో వివేకా హత్యపై ఎఫ్‌ఐఆర్ నమోదైందని, ప్రస్తుతం 2026లో ఉన్నామని.. ఇంకా ఎన్నేళ్లు పిటిషనర్ ఏపీకి వెళ్లకుండా ఉండాలని భాస్కర్‌రెడ్డి తరఫు న్యాయవాది ప్రశ్నించారు. ఆయన కుమారుడైన కడప ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డికి ఈ షరతు విధించనప్పుడు.. భాస్కర్‌రెడ్డికి ఎందుకని అడిగారు. సీబీఐ తరఫున స్పెషల్ పీపీ శ్రీనివాస్ కపాటియా, సునీతారెడ్డి తరఫున న్యాయవాది ఎస్.గౌతమ్ వాదనలు వినిపించారు. భాస్కర్‌రెడ్డిని ఏపీలోకి అనుమతిస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందన్నారు. ఆరోగ్యం బాగా లేదని బెయిల్ పొందిన ఆయన.. ఇప్పుడు వ్యవసాయం చేసుకోవడానికి శాశ్వతంగా ఏపీకి వెళ్తానని కోరడం ఏమిటని ప్రశ్నించారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. తీర్పును రిజర్వు చేస్తున్నట్లు ప్రకటించారు.