అమరావతిని వ్యతిరేకిస్తే 15 కోట్లు
ABN , Publish Date - May 27 , 2026 | 04:09 AM
వైసీపీ ఎంపీ అవినాశ్‌రెడ్డిపై పులివెందుల టీడీపీ ఇన్‌చార్జి బీటెక్ రవి సంచలన ఆరోపణలు చేశారు. మండలిలో అమరావతికి వ్యతిరేకంగా మద్దతిస్తే తనకు రూ. 15 కోట్లు ఇస్తామంటూ ఆఫర్ చేశారని వెల్లడించారు.
వివేకా హత్యపై ఫిర్యాదు వాపస్ కోసం బ్లాంక్ చెక్ ఆఫర్
నాకు ఇస్తామన్నది నిజమా.. కాదా?
వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డికి బీటెక్ రవి సూటి ప్రశ్నలు
మీడియా సమావేశంలో సంచలన వివరాలు వెల్లడి
చెక్‌పై 20, 30 కోట్లు ఎంతైనా రాసుకోమన్నారు
వివేకా ఎమ్మెల్సీ క్యాంపుల వివరాలు వీళ్లే లీక్ చేశారు
అప్పట్లో ఈ విషయం వివేకాకు తెలిసిపోయింది
అందుకే ఆయన్ను దారుణంగా చంపేశారు
పుష్పను మించిన ఎర్రచందనం స్మగ్లర్లు మీరు
వైఎస్ అంత్యక్రియల పేరు చెప్పి దుంగలు అమ్ముకున్నారు
ఉలిమెల్ల తోట మీటింగ్‌లో మీరు చెప్పింది ఏంటి?
అక్కడ ఏమీ జరగలేదు అని అవినాశ్ చెబితే రాజకీయాల నుంచి తప్పుకొంటా
వాళ్ల బతుకులు ప్రజలకు తెలియాలనే ఇవన్నీ చెబుతున్నా: రవి
పులివెందుల/కడప ఎర్రముక్కపల్లె, మే 26 (ఆంధ్రజ్యోతి): వైసీపీ ఎంపీ అవినాశ్‌రెడ్డిపై పులివెందుల టీడీపీ ఇన్‌చార్జి బీటెక్ రవి సంచలన ఆరోపణలు చేశారు. మండలిలో అమరావతికి వ్యతిరేకంగా మద్దతిస్తే తనకు రూ. 15 కోట్లు ఇస్తామంటూ ఆఫర్ చేశారని వెల్లడించారు. అలాగే వైఎస్ వివేకానంద రెడ్డి హత్య విషయంలో సీబీఐకు చేసిన ఫిర్యాదు వెనక్కి తీసుకుంటే బ్లాంక్ చెక్ ఇస్తామన్నారని చెప్పారు. సోమవారం ఎంపీ అవినాశ్‌రెడ్డి వైసీపీ కార్యకర్తల సమావేశంలో బీటెక్ రవిపై పలు ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో మంగళవారం బీటెక్ రవి పులివెందులలో విలేకరులతో మాట్లాడుతూ, అలాగే ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డిబేట్‌లోనూ పలు సంచలన విషయాలు వెల్లడించారు. అమరావతి వ్యతిరేకంగా మండలిలో మద్దతు ఇస్తే రూ. 15 కోట్లు తనకు ఇస్తామని విజయసాయిరెడ్డి ఆఫర్ చేశారని, అది చేయించింది అవినాశ్‌రెడ్డేనని ఆరోపించారు. ఈ ఆఫర్ విషయం అధినేత చంద్రబాబుకు చెప్పానన్నారు. ఆ ఆఫర్‌ను వద్దనుకున్న వ్యక్తినని, తనను కొనలేరని అన్నారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య విషయంలో సీబీఐకి మొదట ఫిర్యాదు చేసింది తానేనని వెల్లడించారు. ఆ తర్వాత ఆదినారాయణరెడ్డి, సునీత వచ్చారన్నారు.
ఆ తర్వాత భయపడి తన వద్దకు, ఆదినారాయణరెడ్డి వద్దకు వచ్చిన అవినాశ్‌రెడ్డి మనుషులు బ్లాంక్ చెక్ ఇస్తాం.. రూ. 20 కోట్లు, రూ. 30 కోట్లు ఎంతైనా రాసుకోండి.. కేసు నుం చి విత్‌డ్రా కావాలి అని కోరారని చెప్పారు. సిట్‌ను మీ జోలికి రాకుండా చేస్తాం, అధినాయకత్వంతోనే చెప్పిస్తామని ఆఫర్ పెట్టలేదా అని ప్రశ్నించారు. ఆ ఆఫర్ నిజామా? కాదా? చెప్పాలని నిలదీశారు. తాము ఆ ఆఫర్‌ను తిరస్కరించామని రవి వెల్లడించారు. అది తన క్యారెక్టర్ అ ని పేర్కొన్నారు. ప్రజలకు వీళ్ల గురించి అర్థం కావాలని, వీరి బతుకులు గురించి తెలియాలనే ఈ విషయాలు చెపుతున్నానని రవి చెప్పారు. గతంలో వైఎస్ వివేకానందరెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసినపుడు ఏర్పాటుచేసిన మూడు క్యాంప్‌ల్లో అసంతృప్తుల లిస్టును వైఎస్ అవినాశ్‌రెడ్డి, శంకర్‌రెడ్డిలే స్వయంగా తనకు ఇచ్చారని బీటెక్ రవి వెల్లడించారు. వివేకా క్యాంపుల్లో ఎవరెవరు ఎక్కడ ఉన్నారు? ఏ క్యాంపులో ఎవరు అసంతృప్తిగా ఉన్నారో తమకు ప్రతిరోజు వైసీపీవారే మెసేజ్‌లు పెట్టేవారన్నారు. వాళ్లను సెట్ చేసుకోండంటూ సూచించేవారని చెప్పారు. వివేకానందరెడ్డి గెలవకూడదని ఆ రోజే ప్లాన్ చేసి, తనకు ఇన్‌డైరెక్టుగా సహకరించారని వెల్లడించారు. తానే ఆ ఎన్నికల్లో లబ్ధిదారుడిని కాబట్టి ఈ విషయాన్ని అప్పట్లో బయటపెట్టలేదన్నారు.
వివేకాను అందుకే చంపేశారు
ఎమ్మెల్సీ ఎలక్షన్లు పూర్తయ్యాక వివేకా తనతో మాట్లాడారని రవి తెలిపారు. తనను మోసం చేసిందెవరో చెప్పాలని కోరినా తాను చెప్పలేదన్నారు. సమాచారం లీక్ చేసింది అవినాశ్, శంకర్ లేనా అని స్వయంగా అడిగారని చెప్పారు. వారి విషయం వివేకాకు తెలిసిపోయిందనే అక్కసుతోనే దారుణంగా చంపేశారని స్పష్టం చేశారు.
వైఎస్ మరణం మాటున ఎర్రచందనం స్మగ్లింగ్
మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మరణాన్ని అడ్డం పెట్టుకుని వైఎస్ భాస్కర్‌రెడ్డి ఎర్రచందనం స్మగ్లింగ్ చేశారని, ఆయన ఎత్తుగడలు పుష్ప-2 సినిమాను తలపించాయని రవి చెప్పారు. వైఎస్సార్ మరణించిన సమయంలో రైల్వేకోడూరులో 40 నుంచి 50 టన్నుల ఎర్రచందనం స్టాక్ ఉంటే దానిని రాజశేఖర్‌రెడ్డి అంత్యక్రియల్లో దహనం ఏర్పాట్ల కోసం తెచ్చినట్లు నమ్మించి, అమ్ముకున్నారని వెల్లడించారు. సీఐ రాజేశ్వర్‌రెడ్డి, గుణకనపల్లె బోరు కృష్ణారెడ్డిని అడిగితే ఎర్రచందనం గురించి చెబుతారన్నారు. వైఎస్ మరణాన్ని కూడా స్మగ్లింగ్‌కు వాడుకున్న ఘనత వారిదేనని ఎద్దేవా చేశారు.
ఉలిమెల్ల తోటలో మీటింగ్ నిజమా? కాదా?
కసనూరు ఎంపీటీసీ ఎలక్షన్ సమయంలో పులివెందులకు సమీపంలోని ఉలిమెల్ల తోట (శ్రీమంతుడు సినిమాలో తోట వంటిది)లో జరిగిన మీటింగ్ నిజమా కాదా అని ఎంపీ అవినాశ్‌రెడ్డిని రవి ప్రశ్నించారు. 2014లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎలక్షన్లు వచ్చినప్పుడు అవినాశ్‌రెడ్డి ఉలిమెల్ల తోటలో తనతో భేటీ అయ్యారని, ఆ భేటీలో ఏమి లాలూ చి పడి కసనూరు ఎంపీటీసీ టీడీపీకి ఏకగ్రీవం చేశారో చెప్పాలన్నారు. ఈ విషయం సతీశ్‌రెడ్డికి తెలుసునన్నారు. ఉలిమెల్ల తోటలో ఏమీ జరగలేదు అని అవినాశ్‌రెడ్డి చెబితే తాను రాజకీయాల నుంచి తప్పుకుం టా అని బీటెక్ రవి సవాల్ చేశారు. వ్యక్తిగతంగా పోతే తన వద్ద చా లా ఉన్నాయని, పుష్ప 1, పుష్ప 2, పుష్ప 3 కూడా ఉన్నాయన్నారు.
మీరు బాత్రూం బాయ్స్... నేను అమ్ముడుపోను
తనకు బాలినేని శ్రీనివాస్ చాలా క్లోజ్ అని, ఎంపీ మిథున్‌రెడ్డిని కూడా ఢిల్లీలో కలిసేవాడినని, విజయసాయిరెడ్డి, మేడా రఘునాథరెడ్డి, పులివెందులలోని వైఎస్ మధు కూడా తనతో మాట్లాడుతుంటారని రవి వెల్లడించారు. రాజకీయం వేరు, స్నేహం వేరు అని పేర్కొన్నారు. వైఎస్ మధు తొండూరు మండలంలో 200 ఎకరాలు ఆక్రమిస్తే విచారణ చేయించామని, త్వరలో అది క్యాన్సిల్ అవుతుందన్నారు. ‘‘నువ్వెంత నీ బతుకెంత అన్నట్లు నా గురించి అవినాశ్‌రెడ్డి మాట్లాడారు. నేను బీజేపీలో చేరుతానని చెబుతున్న అవినాశ్‌రెడ్డీ.. ఒక్కటి తెలుసుకో.. నాకు పార్టీ మారాల్సిన అవసరం లేదు. గత ప్రభుత్వంలో ఎన్ని ఇబ్బందులు పడ్డానో ప్రజలందరికీ తెలుసు. బీటెక్ రవి అమ్ముడుబోయే వ్యక్తి కాదు. ఒకానొక సందర్భంలో భాస్కర్‌రెడ్డి, నేను మందు కొట్టే సమయంలో.. భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ, పార్థసారథిరెడ్డి ఒకరకంగా సాయంచేశాడని, ఈ ముసలోడు (వివేకా) ఎప్పుడూ అడ్డంపడుతూ ఉంటాడని అన్నారు. వైసీపీ హయాంలో రెండుసార్లు నన్ను జైలుకు పంపారు. అరెస్టు చేసి కణతిన పిస్టల్ పెట్టి చంపుతామన్నప్పుడే భయపడలేదు.. ఇప్పుడు భయపడతామా? మహా అయితే మీ చిన్నాయనను చంపినట్లు చంపుతారేమో. మా ఇళ్లు, మా బాత్‌రూములు కూడా చాలా భద్రంగా పెట్టుకున్నాం. ఎందుకంటే మీరు బాత్‌రూమ్ బాయ్స్ అనే విషయం తెలుసు’’ అని రవి అన్నారు.
మీది కమీషన్ల బతుకు
పులివెందులలో పోస్టాఫీస్ వద్ద ఉన్న ఇంట్లో అవినాశ్‌రెడ్డి ఉన్న సమయంలో తోటల వద్దకు కూలికి పోయేవారని, తాము కళ్లారా చూశామని రవి చెప్పారు. ఆ పరిస్థితి నుంచి ఈ పరిస్థితికి ఎలా వచ్చారని ప్రశ్నించారు. వైఎస్సార్ రెండోసారి సీఎం అయినపుడు బ్రాహ్మణి స్టీల్‌కు సంబంధించి ఒక ఎలక్ర్టికల్ వర్క్ బీబీఎం అనే సంస్థకు వచ్చిందని తెలిపారు. అప్పుడు జగన్, భారతిలతో మాట్లాడి ఆ వర్కును క్యాన్సిల్ చేయించి ఎల్‌అండ్‌టీ కంపెనీకి కట్టబెట్టినందుకు రూ.15 కోట్లు భాస్కర్‌రెడ్డికి కమీషన్‌గా వచ్చాయని వెల్లడించారు. అలా కమీషన్లతో బతికింది వాస్తవం కాదా అని రవి ప్రశ్నించారు. అలాగే ప్రకృతి వనరులను కోట్ల రూపాయలకు కట్టబెట్టేశారని, ఇసుక విషయంలో అఖరికి వైఎస్ జార్జిరెడ్డి కుమారుడు అనిల్‌ను కూడా దూరం చేశారని పేర్కొన్నారు.