ప్రధాని మోదీ అభినవ గాడ్సే
ABN , Publish Date - Mar 15 , 2026 | 05:00 AM
‘ప్రధాని మోదీ అభినవ గాడ్సే. ఉపాధి హామీ పథకంలో గాంధీ పేరు తొలగించి హత్య చేసిన నిందితుడు’ అని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మండిపడ్డారు.
మాఫియాలు చేశాడు కాబట్టే మోదీ అంటే జగన్‌కు భయం
సీఎం, డిప్యూటీ సీఎం అంతా బీజేపీకి బానిసలే: షర్మిల
అచ్యుతాపురం రూరల్, నక్కపల్లి, మార్చి 14 (ఆంధ్రజ్యోతి): ‘ప్రధాని మోదీ అభినవ గాడ్సే. ఉపాధి హామీ పథకంలో గాంధీ పేరు తొలగించి హత్య చేసిన నిందితుడు’ అని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మండిపడ్డారు. ఆమె శనివారం అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం తిమ్మరాజుపేటలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. అలాగే అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం వెదుళ్లపాలెం గ్రామాన్ని సందర్శించి, అక్కడ ఉపాధి పనులు చేస్తున్న కూలీలతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ‘‘కాంట్రాక్లర్లకు దోచిపెట్టేందుకే ఉపాధి హామీ పథకంలో మార్పులు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ‘వీబీ జీ రామ్ జీ’ పేరు పెట్టడం వెనుక పెద్ద మోసం దాగి ఉంది. నేరుగా కూలీలు పనులు చేయకుండా కాంట్రాక్టర్లకు కార్మికులను సప్లయ్ చేసే కుట్ర జరుగుతోంది. కొత్త చట్టం ప్రకారం రాష్ట్రంపై రూ.5 వేల కోట్ల భారం పడుతుంది. మోదీ తీసుకువచ్చిన చట్టం గ్రామ వినాశనానికి దారితీస్తుందన్నారు. ఉపాధి హామీ పథకం కాంగ్రెస్ హయాంలో బాగా నడిచింది. ఇప్పుడు దానిని మోదీ ప్రభుత్వం భ్రష్టు పట్టించింది. రాష్ట్రంలో గత ఏడాది 18.5 లక్షల జాబ్ కార్డులు తొలగించారు. ఈ పథకాన్ని చంపేసేందుకు కేంద్రం కుట్ర చేస్తోంది. అందుకే పని దినాలను తగ్గిస్తోంది. దివంగత సీఎం వైఎ్‌సఆర్ హయాంలో అమలైన పథకాన్ని మోదీ రద్దు చేస్తే జగన్‌రెడ్డి మౌనం వహించడం సిగ్గుచేటు. మాఫియాలు చేశాడు కాబట్టే మోదీకి భయపడుతున్నాడు. బీజేపీని ఎదురించే సత్తా సీఎం చంద్రబాబుతో పాటు ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌కు కూడా లేదు. అందరూ బానిసలే’ అని షర్మిల మండిపడ్డారు. షర్మిల తన పర్యటనలో ఉపాధి కూలీలతో కలసి కొద్దిసేపు పనిచేశారు. మట్టి తవ్వారు. మట్టి తట్టను నెత్తిన పెట్టుకుని మోశారు. ఆమె వెంట జిల్లా, నియోజకవర్గం కాంగ్రెస్ నాయకులు పలువురు పాల్గొన్నారు.