Share News

మోదీ సర్కారులో ఉపాధి పథకానికి ముప్పు

ABN , Publish Date - Feb 15 , 2026 | 04:10 AM

పల్లె ప్రజల వలసలు తగ్గించి, ఆకలి కేకలు లేకుండా చేసిన ఉపాధి హామీ పథకాన్ని బీజేపీ సర్కారు నిర్వీర్యం చేస్తోందని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

మోదీ సర్కారులో ఉపాధి పథకానికి ముప్పు

  • కూటమితో పాటు జగన్‌ కూడా బీజేపీ బానిసే: వైఎస్‌ షర్మిల

కడప కలెక్టరేట్‌, ఫిబ్రవరి 14 (ఆంధ్రజ్యోతి): పల్లె ప్రజల వలసలు తగ్గించి, ఆకలి కేకలు లేకుండా చేసిన ఉపాధి హామీ పథకాన్ని బీజేపీ సర్కారు నిర్వీర్యం చేస్తోందని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం కడప నగరంలోని యానాది కాలనీలో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఉపాధి హామీ కూలీలతో ఆమె రచ్చబండ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 2005లో గ్రామాల్లో వలసలు ఆపాలని, ఉపాధి కల్పించి ఆదుకోవాలని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వాన్ని ఒప్పించి అనంతపురం జిల్లాలో ఉపాధి హామీ పథకాన్ని ప్రారంభించారన్నారు. నాటి నుంచి నేటి వరకు వలసలు ఆగి, పల్లె ప్రజలు ఉపాధి పనులతో జీవనం సాగిస్తున్నారన్నారు. అలాంటి పథకానికి మోదీ సర్కారు గండి కొట్టే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. ఉపాధి హామీ పథకాన్ని ప్రజల కోసం వైఎస్‌ తెస్తే.. తనయుడుగా ఆ పథకాన్ని కాపాడాల్సిన జగన్‌ బీజేపీకి బానిసగా మారారని మండిపడ్డారు. ఆర్‌ఎ్‌సఎస్‌ వాది గాడ్సే గాంధీని హత్య చేస్తే, ఇప్పుడు ఉపాధి హామీ పథకానికి ఉన్న మహత్మాగాంధీ పేరును తొలగించి మోదీ ఖూనీ చేశారని విమర్శించారు. మోదీ తెచ్చిన వీబీరామ్‌జీ చట్టం గ్రామ స్వరాజ్యానికి వ్యతిరేకమన్నారు. బీజేపీ మత రాజకీయాలకు జగన్‌ మద్దతు ఉండడం విచారకరమన్నారు. రాష్ట్రంలో ఎంపీలంతా బీజేపీ వారేనన్నారు. బాబు, పవన్‌తో పాటు జగన్‌ కూడా బీజేపీ బానిసలుగా మారారని ఎద్దేవా చేశారు. ప్రజా వ్యతిరేక విధానాలను గాడిలో పెట్టేందుకు కాంగ్రెస్‌ ప్రజల ప్రక్షాన పోరాటాలకు సిద్ధమని షర్మిల తెలిపారు.

Updated Date - Feb 15 , 2026 | 04:11 AM