Share News

జగన్‌కు ఏం రోగమొచ్చిందో!

ABN , Publish Date - Mar 16 , 2026 | 05:42 AM

‘జగన్మోహన్‌రెడ్డికి ఏంరోగం వచ్చిందో.. మోదీకి బానిసలా మారాడు’ అని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ధ్వజమెత్తారు. విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం పారాదిలో ఆదివారం జరిగిన ఉపాధి హామీ పరిరక్షణ యాత్ర (రచ్చబండ)లో ఆమె మాట్లాడారు.

జగన్‌కు ఏం రోగమొచ్చిందో!

  • మోదీకి బానిసగా మారాడు.. షర్మిల ధ్వజం

బొబ్బిలి, మార్చి 15(ఆంధ్రజ్యోతి): ‘జగన్మోహన్‌రెడ్డికి ఏంరోగం వచ్చిందో.. మోదీకి బానిసలా మారాడు’ అని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ధ్వజమెత్తారు. విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం పారాదిలో ఆదివారం జరిగిన ఉపాధి హామీ పరిరక్షణ యాత్ర (రచ్చబండ)లో ఆమె మాట్లాడారు. వైఎస్సార్‌ హయాంలో ప్రవేశపెట్టిన పథకం పోతుంటే జగన్‌కు ఏమాత్రం బాధ్యత లేదా? అని నిలదీశారు. ‘ఉపాధి పథకానికి కేంద్రంలోని బీజేపీ తూట్లు పొడుస్తుంటే.. ఆ పథకం తెచ్చిన రాజశేఖర్‌రెడ్డి కొడుకై ఉండి జగన్‌ బీజేపీని ప్రశ్నించడంలేదు. వైఎస్‌ బీజేపీని ప్రతి సందర్భంలో వ్యతిరేకిస్తే.. అధికారంలో వచ్చిన వెంటనే మోదీ కాళ్లమీద పడ్డాడు అంటే బీజేపీకి ఎంత బానిసయ్యోడో అర్థం చేసుకోండి. ఈ రాష్ర్టానికి జగన్‌ తీవ్ర అన్యాయం చేశాడు. కనీసం రాజధాని లేకుండా చేశాడు’ అని విమర్శించారు. ‘ఉపాధి కింద ఏడాదికి అయ్యే ఖర్చు రూ.86 వేల కోట్లు. ఈ మొత్తాన్ని కాంట్రాక్టర్లకు దోచిపెట్టే పన్నాగం చేస్తున్నారు. ఉపాధికి గ్యారంటీ లేని జీరామ్‌జీ చట్టం తెచ్చారు. జాబ్‌ కార్డులు తగ్గిస్తున్నారు. ఉపాధి హామీ పథకంలో 90 వాతం నిధులు కేంద్రం ఇచ్చేది. ఇప్పడు రాష్ర్టాలపై 40 శాతం భారం మోపుతున్నారు. జగన్‌, చంద్రబాబు పుణ్యామాని రాష్ట్రం ఇప్పటికే రూ.12 లక్షల కోట్ల అప్పుల్లో మునిగి ఉంది. ఇది రాష్ర్టానికి భారం కాదా? దీన్ని అంగీకరించడం చంద్రబాబుకు ఎంతమాత్రం భావ్యం కాదు. రాష్ట్రంపై భారం మోపే పథకానికి సుతరామూ ఒప్పుకోం’ అని అన్నారు. బీజేపీ అంటే బాబు, జగన్‌, పవన్‌ అని, వీరు ముగ్గురూ వ్యతిరేకించనంత కాలం రాష్ట్రంలో బీజేపీ చాలా బలంగా ఉంటుందని వ్యాఖ్యానించారు. కాగా, హైదరాబాద్‌లో డ్రగ్స్‌ పార్టీలో దొరికిపోయిన ఏలూరు ఎంపీ పుట్టామహేశ్‌ను పదవి నుంచి తప్పించి, పార్టీ నుంచి సస్పెండ్‌ చేసి చంద్రబాబు తన చిత్తశుద్ధిని, నిజాయితీని నిరూపించుకోవాన్నారు.


ఎమ్మెల్యే బేబీనాయనతో వాదన!

బొబ్బిలి పట్టణంలో సర్వే నంబరు 635 లో ఏడు ఎకరాల భూమిని స్థానిక ఎమ్మెల్యే ఆర్‌వీఎ్‌సకేకే రంగారావు (బేబీనాయన) లాక్కున్నారని కొందరు వ్యక్తులు షర్మిలకు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ఆమె.. నేరుగా ఎమ్మెల్యేకు ఫోన్‌ చేశారు. ‘ఎమ్మెల్యే గారూ.. పట్టణంలో 1991లో కాంగ్రెస్‌ పార్టీ పేదలకు భూమి ఇచ్చిందట. దాన్ని మీరు, మీ అనుచరులు కలిసి కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నట్లు బాధితులు ఫిర్యాదు చేస్తున్నారు. ఇటీవల వరకు వారే సాగు చేసుకుంటున్నారట. రైతుభరోసా డబ్బులు కూడా వారికి జమ అయ్యాయంట. ఇంత స్పష్టంగా వీరి ఆధీనంలో ఉన్నట్లు సాక్ష్యాధారాలు చూపుతుంటే మీరు, మీ అధికారులు వారిని దబాయిస్తున్నారట’ అని షర్మిల ప్రశ్నించారు. దీనికి ఎమ్మెల్యే బేబీనాయన బదులిస్తూ ‘వారు మిమ్నల్ని తప్పుదోవపట్టిస్తున్నారు. వందలాది ఎకరాల భూములను దానం చేశాం. మేమెందుకు కబ్జాలకు పాల్పడతాం. ఇతరుల భూములు మాకెందుకు? వారు చెప్పే సర్వే నంబరు వేరు. దానితో మాకు సంబంధం లేదు.’ అని బేబీనాయన బదులిచ్చారు. ఈ దశలో ఇద్దరూ కొద్దిసేపు వాదించుకున్నారు. అనంతరం షర్మిల కలెక్టరుకు ఫోన్‌ చేసి సమస్యను పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో డీసీసీఅధ్యక్షుడు మరిపి వినయ్‌, బొబ్బిలి నియోజకవర్గ ఇన్‌చార్జి మువ్వల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 16 , 2026 | 05:43 AM