కేసుల నుంచి రక్షణ కోసం బానిసలా బతకాలా?
ABN , Publish Date - Apr 19 , 2026 | 04:00 AM
‘దత్తపుత్రుడు జగన్ తెర తొలగింది. బీజేపీతో పెట్టుకున్న అక్రమ పొత్తు తేటతెల్లమైంది. విపక్షం ముసుగులో ఉన్నది సైతం ఆర్‌ఎస్ఎస్ పక్షమేనని నిజ నిర్ధారణ జరిగింది’ అని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు.
వైసీపీ అధినేత చేసిన నీచపు పనికి వైఎ్‌సఆర్ ఆత్మ ఘోషిస్తోంది
దత్తపుత్రుడు జగన్ తెర తొలగింది
బీజేపీతో అక్రమ పొత్తు తేటతెల్లమైంది: షర్మిల
అమరావతి, ఏప్రిల్ 18(ఆంధ్రజ్యోతి): ‘దత్తపుత్రుడు జగన్ తెర తొలగింది. బీజేపీతో పెట్టుకున్న అక్రమ పొత్తు తేటతెల్లమైంది. విపక్షం ముసుగులో ఉన్నది సైతం ఆర్‌ఎస్ఎస్ పక్షమేనని నిజ నిర్ధారణ జరిగింది’ అని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. ‘బిల్లులను అడ్డుకున్న ప్రతిపక్ష పార్టీలు ఏం సాధించాయి?’ అంటూ వైసీపీ అధినేత జగన్ వేసిన ప్రశ్నకు ఆమె శనివారం ఎక్స్‌లో స్పందించారు. ‘టీడీపీ, జనసేనలను మించి మోదీని ఇంతలా మోయాలా? మన దేశ రాజ్యాంగ పరిరక్షణ కంటే బీజేపీ భజనే ముఖ్యమా? అక్రమ డీ లిమిటేషన్ బిల్లులపై ఎన్‌డీఏ పక్షాన నిలబడ్డందుకు జగన్ సిగ్గుపడాలి. ఐదేళ్ల పాలనలో చేసిన అవినీతి కోసం ఇంతలా బీజేపీతో అంటకాగాలా? కేసుల నుంచి రక్షణ కోసం బానిసగా బ్రతకాలా? బీజేపీ బిల్లులకు గొర్రెలా, గుడ్డిగా తలాడించాలా? మోదీ మెప్పు కోసం సొంత కాకిలెక్కలు అల్లాలా? ఇదేనా తమరు చెప్పే వైఎస్ఆర్ ఆశయాలు, వారసత్వం? మహానేత సిద్ధాంతాలను మంటగలిపినందుకు, విలువలకు తూట్లు పొడిచినందుకు ఆత్మ విమర్శ చేసుకోవాలి. రాజ్యాంగానికి విఘాతం కలిగించే అక్రమ బిల్లులకు విపక్షాలు అడ్డుపడి విజయం సాధిస్తే... ఏం సాధించారని ప్రశ్నించడం హాస్యాస్పదం. కోట్లాది మంది రాష్ట్ర ప్రజల గుండెలు గాయపరచడమే మీరు సాధించిన గొప్పతనం. దక్షిణాది రాష్ట్రాల భావోద్వేగాన్ని అర్థం చేసుకోకపోవడమా మీ రాజకీయం? ప్రతిపక్షంగా, విపక్షానికి మద్దతు ఇవ్వాల్సిందిపోయి అధికార పక్షానికి జై కొట్టడం ప్రపంచంలో ఎక్కడైనా ఉందా? జగన్... మీరు చేసిన నీచపు పనికి వైఎస్ ఆత్మ నిజంగా ఘోషిస్తోంది. మహిళా బిల్లు, డీ లిమిటేషన్‌కు లంకె పెట్టడం జగన్ అవివేకానికి నిదర్శనం. న్యాయం జరగలేదని, సాకారం కాలేదని మీరే అంటున్నారా? లేదా మోదీ మీచేత చెప్పించారా? మహిళలకు 33 శాతం రిజర్వేషన్లకు ఎవరూ వ్యతిరేకం కాదు. అవనికి అగ్రతాంబూలం అందిస్తుంటే అభ్యంతరం ఎవరికీ లేదు. 2023లోనే మహిళా బిల్లు పాసయ్యింది.
అడ్డుకున్నది మోదీ లబ్ధికోసం పెట్టిన డీ-లిమిటేషన్ బిల్లును మాత్రమే. నియోజకవర్గాలు పునర్విభజన, మహిళా బిలుపై కాంగ్రెస్ పార్టీ వైఖరి సుస్పష్టం. 2026 జనాభా లెక్కలు అందుబాటులోకి రావాలి. కులగణన ద్వారా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల సంఖ్య తేలాలి. కులాల ఆధారంగా డీ-లిమిటేషన్‌లో రిజర్వేషన్లు పాటించాలి. వెనుకబడ్డ కులాలకు రాజకీయ ప్రాధాన్యం కల్పించి న్యాయం చేయాలి. ప్రస్తుత 543 స్థానాలకు తక్షణం మహిళా రిజర్వేషన్లు పాటించాలి. చిన్న రాష్ట్రాల వాదనలనూ పరిగణనలోనికి తీసుకోవాలి. అధికారిక గణాంకాలు లేకుండా 50 శాతం పెంచి దేశాన్ని ఉద్ధరిస్తున్నామని మోదీ ఎలా చెబుతారు? దానిని జగన్ గుడ్డిగా ఎలా నమ్ముతారు? ఇది రాష్ట్ర ప్రజలను మోసం చేయడమే. అందుకే ఆంధ్రలో బీజేపీ అంటే... బాబు, జగన్, పవన్. మూడు పార్టీలు మోదీ మెప్పు కోరేవే. ప్రతిపక్షం ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే’ అని షర్మిల పేర్కొన్నారు.