Share News

సీఎం పదవికి జగన్‌ అనర్హుడు!

ABN , Publish Date - Jan 30 , 2026 | 05:29 AM

ముఖ్యమంత్రి పదవికి వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి సూట్‌ (సరిపోలేదని) కాలేదని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల తేల్చి చెప్పారు.

సీఎం పదవికి జగన్‌ అనర్హుడు!

  • అధికారం ఇస్తే ఒక్కరోజూ బయటకు రాలేదు

  • పాదయాత్ర ప్రజల కోసం కాదు.. పదవి కోసమే: షర్మిల

అమరావతి, జనవరి 29(ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి పదవికి వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి సూట్‌ (సరిపోలేదని) కాలేదని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల తేల్చి చెప్పారు. జగన్‌ పాదయాత్ర ప్రజల కోసం కాదని.. అధికారం కోసమేనని విమర్శించారు. ఏడాదిన్నర తర్వాత చేసే పాదయాత్రకు ఇప్పుడే ప్రకటనలు ఎందుకని ప్రశ్నించారు. చిత్తశుద్ధి లేని యాత్రలు ఎందుకని ప్రశ్నించారు. ప్రజలు ఒకసారి అధికారం ఇస్తే ఏంచేశారని ప్రశ్నించారు. విజయవాడలో గురువారం ఆమె మీడియాతో మాట్లాడారు. వైఎ్‌సఆర్‌ చేపట్టిన జలయజ్ఞం కార్యక్రమానికి జగన్‌ తూట్లు పొడిచారని, నవరత్నాల హామీలకూ దిక్కులేకుండా పోయిందని విమర్శించారు. అధికారం ఇస్తే ఒక్కరోజు కూడా బయటకు రాలేదని, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలనూ కలవలేదని విమర్శించారు. ‘అధికారంలో ఉండగా జగన్‌ను చూశాం. జగన్‌ నైజం మారాలి. స్వార్థం తగ్గి మంచితనం పెరగాలి. అప్పుడు దేవుడు అధికారం ఇస్తాడేమో? అంతవరకూ దేవుడూ, ప్రజలూ జగన్‌ను ఆశీర్వదించబోరు’ అని అన్నారు. కేంద్ర ప్రభుత్వం మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పేరు మార్చడం సహా ఉపాధి కూలీలకు పనిలేకుండా చేసినందుకు నిరసనగా వచ్చే నెల 2 నుంచి జిల్లాల్లో పర్యటిస్తానని షర్మిల ప్రకటించారు.

Updated Date - Jan 30 , 2026 | 05:29 AM