Share News

పెద్దల సభకు షర్మిల!

ABN , Publish Date - May 30 , 2026 | 03:54 AM

కాంగ్రెస్‌ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల.. రాజ్యసభలో అడుగు పెట్టనున్నట్టు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. కర్ణాటకలో ఖాళీ కానున్న రాజ్యసభ సీట్లలో ఒకటి షర్మిలకు ఖరారైనట్టు తెలిసింది.

పెద్దల సభకు షర్మిల!

  • కర్ణాటక కోటాలో రాజ్యసభకు

  • అధిష్ఠానం పిలుపుతో ఢిల్లీకి

  • రాహుల్‌, ఖర్గేతో వరుస భేటీలు

అమరావతి, ఢిల్లీ మే 25(ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల.. రాజ్యసభలో అడుగు పెట్టనున్నట్టు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. కర్ణాటకలో ఖాళీ కానున్న రాజ్యసభ సీట్లలో ఒకటి షర్మిలకు ఖరారైనట్టు తెలిసింది. కాంగ్రెస్‌ పార్టీలోకి షర్మిలను చేర్చుకునే సమయంలోనే ఏపీసీసీ అధ్యక్ష పదవితోపాటు రాజ్యసభ సీటు ఇస్తామని అధిష్ఠానం హామీ ఇచ్చింది. 2024 జనవరిలో తెలంగాణ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీని మూసేసి.. ఆమె కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. షర్మిల కాంగ్రెస్‌ పార్టీలో చేరడంలో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌, కాంగ్రెస్‌ పార్టీ జాతీయ కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ కీలక పాత్ర పోషించారు. ఈ క్రమంలో అధిష్ఠానం ఆహ్వానంతో శుక్రవారం ఢిల్లీ వెళ్లారు. తొలుత రాహుల్‌ గాంధీతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో షర్మిలకు రాజ్యసభ సీటును ఇస్తున్నట్లు రాహుల్‌ చెప్పారని పీసీసీ వర్గాలు తెలిపాయి. అలాగే, రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీని బలోపేతం చేయడంపైనా సూచనలు చేశారని పేర్కొన్నాయి. అనంతరం మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్‌తోనూ షర్మిల భేటీ అయ్యారు.

Updated Date - May 30 , 2026 | 03:56 AM