వైసీపీ పాలనలో విచ్చలవిడిగా డ్రగ్స్
ABN , Publish Date - Mar 09 , 2026 | 05:44 AM
జగన్‌రెడ్డి ఐదేళ్ల పాలనలో లిక్కర్ మాఫియాతో నాసిరకం మద్యం తయారుచేసి రాష్ట్ర ఆదాయాన్ని తినేశాడని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు.
మూడు రాజధానులని ఒక్కటీ లేకుండా చేశారు: షర్మిల
దేవరపల్లి, ఫిబ్రవరి 8(ఆంధ్రజ్యోతి): జగన్‌రెడ్డి ఐదేళ్ల పాలనలో లిక్కర్ మాఫియాతో నాసిరకం మద్యం తయారుచేసి రాష్ట్ర ఆదాయాన్ని తినేశాడని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం దుద్దుకూరులో ఉపాధి హామీ పరిరక్షణ యాత్రలో భాగంగా ఆదివారం రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ వైసీపీ పాలనలో రాష్ర్టానికి కంటైనర్లలో డ్రగ్స్ వచ్చాయని, రాష్ట్రంలో విచ్చలవిడిగా మాదక ద్రవ్యాలు దొరికేలా తయారు చేశారని ఆరోపించారు. అధికారంలోకి వస్తే మోదీ కాలర్ పట్టుకుని ప్రత్యేక హోదా తెస్తానని చెప్పిన జగన్.. బీజేపీకి సాగిలపడ్డాడని విమర్శించారు. రాష్ట్రానికి మూడు రాజధానులంటూ ఒక్క రాజధాని కూడా లేకుండా చేసిన ఘనత జగన్‌కే దక్కుతుందన్నారు. పోలవరం ఎత్తు తగ్గించి నిర్వీర్యం చేస్తుంటే ఒక్కరు కూడా నోరు మెదపటం లేదన్నారు. ఉపాధి హామీ పథకానికి కేంద్ర ప్రభుత్వం తూట్లు పొడుస్తుంటే ఎందుకు అడ్డుకోవడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ మహిళలకు పెద్దపీట వేస్తోందని, మహిళలకు రాజకీయ పదవుల్లో 50శాతం రిజర్వేషన్ కల్పించిన ఘనత కాంగ్రెస్‌కే దక్కుతుందని చెప్పారు. బీజేపీ పాలనలో మహిళలకు రక్షణ కరువైందన్నారు. రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు అమర్‌జహాబేగ్ మాట్లాడుతూ తల్లికి, చెల్లికి న్యాయం చేయలేని జగన్‌రెడ్డి ఈ రాష్ర్టాన్ని ఏం ఉద్ధరిస్తారని ప్రశ్నించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు జేడీ శీలం, బోడా వెంకట్, మార్టిన్ లూధర్, టీకే విశ్వేశ్వరరెడ్డి, గిడుగు రుద్రరాజు, కే.ప్రభాకరరావు, కాకర్ల శ్రీహరిబాబు తదితరులు పాల్గొన్నారు.