ఉపాధి హామీ నిర్వీర్యంపై మౌనమెందుకు జగన్?
ABN , Publish Date - Feb 04 , 2026 | 05:16 AM
కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసేందుకు కుట్ర చేస్తున్నా జగన్ మౌనం వహించడంలో ఆంతర్యమేమిటని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రశ్నించారు.
పేదల కడుపు కొట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర
మండిపడ్డ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల
కళ్యాణదుర్గం, ఫిబ్రవరి 3(ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసేందుకు కుట్ర చేస్తున్నా జగన్ మౌనం వహించడంలో ఆంతర్యమేమిటని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రశ్నించారు. ఉపాధి హామీ పరిరక్షణ యాత్ర రెండో రోజైన మంగళవారం అనంతపురం జిల్లాలో కొనసాగింది. శెట్టూరు మండలం ఐదుకల్లు గ్రామంలో జరిగిన రచ్చబండ కార్యక్రమంలో ఆమె కూలీలు, గ్రామస్థులతో మాట్లాడారు. మహాత్మగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని జగన్ కోరడం లేదన్నారు. కేంద్రం కొత్త చట్టంతో ఉపాధి హామీ పథకాన్ని చంపేయాలని చూస్తోందని మండిపడ్డారు. ప్రధాని మోదీ తెచ్చిన వీబీజీ రామ్‌జీ చట్టంలో పనులను నిర్ణయించే అధికారం ఢిల్లీ స్థాయిలో ఉంటుందని, గ్రామాల్లో సమస్యలు ఢిల్లీ స్థాయిలో ఎలా తెలుస్తాయని ప్రశ్నించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఉపాఽధి హామీ పథకాన్ని దిగజార్చేసిందని విమర్శించారు. కొత్త చట్టంతో రాష్ట్రంపై ఏడాదికి రూ.5 వేల కోట్ల భారం పడుతుందన్నారు. రాష్ట్రం ఇప్పటికే అప్పుల్లో ఉందని, ఇలాంటి సమయంలో 40శాతం నిఽధులు ఇవ్వడం కష్టతరమన్నారు. ఉపాధి పథకం నిధుల్లో రాష్ర్టాలను భాగస్వామ్యం చేయడం కుట్రేనని, ఈ కుట్రలో చంద్రబాబు, పవన్, జగన్ భాగమయ్యారని ఆరోపించారు. ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించేవరకు ప్రజలు ఉద్యమం చేయాలని పిలుపునిచ్చారు.