Share News

సైతాన్‌ సైన్యం పరామర్శకు తప్ప.. ప్రజల కోసం జగన్‌ బయటకు రాడు!

ABN , Publish Date - Mar 10 , 2026 | 05:20 AM

జగన్‌ తన సైతాన్‌ సైన్యాన్ని పరామర్శించడం తప్ప ప్రజల కోసం బయటకు రాడని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ధ్వజమెత్తారు.

సైతాన్‌ సైన్యం పరామర్శకు తప్ప.. ప్రజల కోసం జగన్‌ బయటకు రాడు!

  • ఆయనకు ప్రజా సమస్యలపై చిత్తశుద్ధి లేదు

  • కల్తీ పాల బాధితులకు షర్మిల పరామర్శ

రాజమహేంద్రవరం సిటీ/కాళ్ల, మార్చి 9(ఆంధ్రజ్యోతి): జగన్‌ తన సైతాన్‌ సైన్యాన్ని పరామర్శించడం తప్ప ప్రజల కోసం బయటకు రాడని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ధ్వజమెత్తారు. ఆయనకు ప్రజల సమస్యలపై చిత్తశుద్ధి లేదని విమర్శించారు. సోమవారం తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం కిమ్స్‌ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న కల్తీ పాల ఘటన బాధితులను ఆమె పరామర్శించారు. అనంతరం షర్మిల మీడియాతో మాట్లాడుతూ.. వరలక్ష్మీ డెయిరీ పేరుతో 11 ఏళ్ల నుంచి లైసెన్స్‌ లేకుండా పాల వ్యాపారం చేస్తుంటే ఆహార భద్రతా విభాగం అధికారులు మొద్దు నిద్రపోయారన్నారు. ఈ పాపంలో మాజీ సీఎం జగన్‌కు కూడా భాగం ఉందన్నారు. కల్తీ పాల వల్ల 11 మంది మృతిచెందడం బాధాకరమని, బాధి కుటుంబాలకు రూ.20 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. మరోవైపు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం, కాళ్ల ప్రాంతాల్లో షర్మిల పర్యటించారు. కాళ్లలో జరిగిన ఉపాధి హామీ పరిరక్షణ యాత్రలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ.. ఉపాధి పథకాన్ని కేంద్రంలోని బీజేపీ ఖూనీ చేస్తున్నా జగన్‌ ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు. బీజేపీతో చంద్రబాబుకు పొత్తు, జగన్‌కు అక్రమ పొత్తు ఉంది’ అని వ్యాఖ్యానించారు. ‘రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఎవరూ అడగరు. బీజేపీని ఎదిరించే దమ్మున్న మగాడు రాష్ట్రంలో ఒక్కడూ లేడు. కాలర్‌ పట్టుకుని నిలదీస్తా.. ప్రత్యేక హోదా తెస్తానని ప్రగల్భాలు పలికిన జగన్‌.. ఆ తర్వాత ప్రశ్నించలేకపోయారు’అని అన్నారు. ఆయా కార్యక్రమాల్లో సీడబ్ల్యూసీ సభ్యుడు గిడుగు రుద్రరాజు, పార్టీ నేతలు జేడీ శీలం, కనుమూరు బాపిరాజు పాల్గొన్నారు.

Updated Date - Mar 10 , 2026 | 05:22 AM