విశాఖ ఉక్కుకు చంద్రబాబు ఖల్‌నాయక్
ABN , Publish Date - Mar 25 , 2026 | 04:40 AM
‘మిట్టల్ స్టీల్ ప్లాంట్‌కు సీఎం చంద్రబాబు దురంధర్ అయితే... విశాఖ స్టీల్స్ పట్ల ఖల్‌నాయక్’ అని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు.
దానిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలది సైలెంట్ కిల్లింగ్ ఆపరేషన్
‘మిట్టల్’కు ఇచ్చిన రాయితీలు వైజాగ్ స్టీల్స్‌కు ఎందుకు ఇవ్వరు?: షర్మిల
అమరావతి/సింహాద్రిపురం, మార్చి 24(ఆంధ్రజ్యోతి): ‘మిట్టల్ స్టీల్ ప్లాంట్‌కు సీఎం చంద్రబాబు దురంధర్ అయితే... విశాఖ స్టీల్స్ పట్ల ఖల్‌నాయక్’ అని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. విజయవాడలో మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడారు. ‘వైజాగ్ స్టీల్‌పై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలది ఆపరేషన్ సైలెంట్ కిల్లింగ్. మిట్టల్ స్టీల్స్ భూమి పూజకు హాజరై విశాఖ ఉక్కుకు వెళ్లకపోతే దుమారం రేగుతుందన్న భయంతోనే కేంద్ర ఉక్కు మంత్రి కుమారస్వామి వెళ్లారు. అక్కడకు వెళ్లిన ఆయన దీర్ఘకాలికంగా ఉన్న డిమాండ్లలో ఒక్కదానిపైనా ఎందుకు స్పందించలేదు? మిట్టల్ స్టీల్స్‌కు ఇచ్చిన రాయితీలు విశాఖ ఉక్కుకు ఇవ్వగలరా? విశాఖ స్టీల్‌కు కేంద్రం క్యాప్టివ్ మైన్స్ ఎందుకు కేటాయించడం లేదు? మిట్టల్ స్టీల్స్ అంటే చంద్రబాబుకు ఎందుకంత ప్రేమ? రాష్ట్రంలో 1,80,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉంటే 10 వేల పోస్టుల భర్తీకే నోటిఫికేషన్ జారీ చేస్తారా’ అని మండిపడ్డారు. పులివెందుల నియోజకవర్గంలో అరటి రైతులది అరణ్యరోదన అని పేర్కొన్నారు. సింహాద్రిపురం మండలం కసనూరులో గాలివానకు దెబ్బతిన్న అరటి తోటలను మంగళవారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మొన్నటి వరకు టన్ను రూ.26 వేలు పలికిన అరటి ప్రస్తుతం టన్ను రూ.4 వేలకు పడిపోయిందన్నారు. పులివెందుల ఎమ్మెల్యేగా ఉండి రైతుల పట్ల జగన్ నిర్లక్ష్యం వహించడం దారుణమని మండిపడ్డారు.