‘ఉపాధి’ నిర్వీర్యానికి బీజేపీ కుట్ర
ABN , Publish Date - Feb 14 , 2026 | 02:40 AM
మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేయడానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్ర పన్నిందని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్. షర్మిలారెడ్డి విమర్శించారు.
వీబీజీ రామ్‌జీ చట్టం రాష్ర్టానికి పెనుభారం: షర్మిల
సింగరాయకొండ, ఫిబ్రవరి 13(ఆంధ్రజ్యోతి): మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేయడానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్ర పన్నిందని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్. షర్మిలారెడ్డి విమర్శించారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాకల అంబేడ్కర్ కాలనీలో ఉపాధి హామీ పథకం పరిరక్షణ యాత్రలో భాగంగా శుక్రవారం నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. తొలుత ఉపాధి కూలీలతో ముఖాముఖి నిర్వహించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం నూతనంగా తెచ్చిన వీబీజీ రామ్‌జీ చట్టంతో రాష్ట్రానికి ఏటా రూ.5వేల కోట్లు పెనుభారం పడుతుందని తెలిపారు. అది తెలిసి కూడా చంద్రబాబు ప్రభుత్వం ఆ చట్టానికి పార్లమెంట్‌లో మద్దతు ఇవ్వడం దుర్మార్గమని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో పేదల కోసం చిత్తశుద్ధితో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఉపాధి హామీ పథకాన్ని విజయవంతంగా అమలు చేస్తే.. అలాంటి పథకాన్ని బీజేపీ చంపేస్తుంటే ఆయన కుమారుడు జగన్మోహన్‌రెడ్డి ఒక్కమాట కూడా మాట్లాడకపోవడం సిగ్గుచేటని ఎద్దేవా చేశారు. బీజేపీని ఎదిరించే సత్తాలేక జగన్ మోదీకి అమ్ముడుపోయారని ఘాటు వాఖ్యలు చేశారు. పాత ఉపాధి హామీ పథకంలో 100 రోజులు పని కల్పించలేని వారు కొత్త పథకంలో 125రోజులు పని కల్పిస్తారా? అంటూ ఆమె ప్రశ్నించారు.