జగన్‌కు బీజేపీతో అక్రమ పొత్తు
ABN , Publish Date - May 20 , 2026 | 04:05 AM
బీజేపీతో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అక్రమ పొత్తు కొనసాగిస్తున్నారని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు.
బటన్‌లు నొక్కితే సీఎం కాలేరు: షర్మిల
విజయవాడ అర్బన్, మే 19(ఆంధ్రజ్యోతి): బీజేపీతో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అక్రమ పొత్తు కొనసాగిస్తున్నారని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. విజయవాడ గవర్నర్‌పేటలోని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం పలు పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు కాంగ్రె్‌సలో చేరారు. ఈ సందర్భంగా షర్మిల మీడియాతో మాట్లాడారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశయాలకు జగన్ తూట్లు పొడిచారని ధ్వజమెత్తారు. ఆయన సీఎం అయ్యాక బటన్‌లు నొక్కడం తప్ప చేసిందేమీ లేదన్నారు. కేవలం బటన్‌లు నొక్కితేనే మళ్లీ మళ్లీ సీఎంలు కాలేరని తెలుసుకోవాలన్నారు. సిగ్గులేకుండా వైసీపీ నేతలు సోమవారం పెట్రో ధరల పెంపుపై ధర్నాలు చేశారని విమర్శించారు. వాళ్ల హయాంలో భారాలు మోపిన విషయం మరిచారా? అని ప్రశ్నించారు. దేశంలో, రాష్ట్రంలో రాజ్యాంగం బతికి ఉండాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని, రాహుల్‌గాంధీ ప్రధాన మంత్రి అవ్వాలని అన్నారు. వైఎస్సార్ బతికిఉంటే రాష్ట్ర విభజన జరిగేది కాదని, ఆయన మరణం తరువాత స్ర్టాంగ్ లీడర్ లేకపోవటంతో రాష్ట్ర విభజన జరిగిందన్నారు. విభజన హామీలకు అన్యాయం జరుగుతుంటే చంద్రబాబు, జగన్ బిజేపీని అడగటం లేదన్నారు.