ఓట్లు తొలగిస్తే ఓడిపోతాం!
ABN , Publish Date - May 28 , 2026 | 04:59 AM
రాష్ట్రంలో ఎన్నికల కమిషన్ చేపడుతున్న ‘సర్’ ప్రక్రియతో పార్టీ సానుభూతిపరుల ఓట్లను తొలగించేస్తే ఎన్నికల్లో ఓడిపోతామని వైసీపీ అధ్యక్షుడు జగన్ ఆందోళన వ్యక్తం చేశారు.
స్టాలిన్, మమత ఇలాగే ఓడారు: జగన్
అమరావతి, మే 27 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఎన్నికల కమిషన్ చేపడుతున్న ‘సర్’ ప్రక్రియతో పార్టీ సానుభూతిపరుల ఓట్లను తొలగించేస్తే ఎన్నికల్లో ఓడిపోతామని వైసీపీ అధ్యక్షుడు జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై అప్రమత్తంగా ఉండాలని.. వైసీపీ ఓట్లు తొలగించకుండా చూడాలని పార్టీ అసెంబ్లీ, లోక్‌సభ నియోజకవర్గ ఇన్‌చార్జులను, సమన్వయకర్తలను ఆదేశించారు. ‘సర్’పై అనేక రాష్ట్రాలు అనేక సందేహాలు, భయాలు, ఆందోళనలు వ్యక్తం చేశాయన్నారు. పశ్చిమబెంగాల్లో 11.9 శాతం.. అంటే 91 లక్షల ఓట్లను తొలగించారని.. తమిళనాడులో 11.6శాతం.. 74 లక్షల ఓట్లు తొలగించారని చెప్పారు. మమతా బెనర్జీ పోటీ చేసిన భవానీపూర్‌లో 44,900 ఓట్లను తొలగించడంతో ఆమె 15105 ఓట్ల తేడాతో ఓడిపోయారని.. స్టాలిన్ పోటీచేసిన కొళత్తూరులో 71,133 ఓట్లను తీసివేయడంతో ఆయన 8,000 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారని అన్నారు. ‘సర్’పై అప్రమత్తంగా ఉండాలన్నారు. బుధవారం తాడేపల్లి ప్యాలె్‌సలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో జగన్ మాట్లాడారు. చంద్రబాబుకు కుప్పంలో 22 వేలదొంగ ఓట్లు ఉన్నాయని జగన్ ఆరోపించారు. సీఎం చంద్రబాబు రెండేళ్ల పాలనకు నిరసనగా వచ్చే నెల 4 నుంచి 12 దాకా ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ పేరిట ప్రతి నియోజకవర్గంలో నిరసనలు, ఆందోళనలు నిర్వహించాలని ఆదేశించారు. చంద్రబాబు రాక్షసపాలనపై చర్చ జరపాలన్నారు. ఈ సందర్భంగా ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. ప్రజలందరికీ అందించి చంద్రబాబు అరాచక పాలన, హామీల బుట్టదాఖలుపై వివరించాలన్నారు. నాన్న తర్వాత తన పాలనలోనే సంక్షేమం జరిగిందని.. మంచి చేశానని చెప్పి కాలర్ ఎగరేశానని తెలిపారు. స్థానిక ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవాలని, చంద్రబాబు కుట్రలను ఎదుర్కొని విజయం సాధించాలని.. పోటీచేసే అభ్యర్థులకు సంపూర్ణ సహకారం అందించాలని అసెంబ్లీ ఇన్‌చార్జులకు స్పష్టంచేశారు. ఇప్పుడు వారికి సహకరిస్తే.. వారు అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి విజయానికి పనిచేస్తారన్నారు. స్థానిక ఎన్నికల్లో ఓటమిని అసెంబ్లీ ఇన్‌చార్జి వైఫల్యంగానే పరిగణిస్తానని హెచ్చరించారు. ‘నిద్రలో మావిగన్ అనే మాట వినిపిస్తే చంద్రబాబు గుండే ఆగి చనిపోయేలా ఉన్నాడు. ప్రజలను పిచ్చోళ్లనుకుంటున్నాడు’ అని వ్యాఖ్యానించారు.
జనం వెన్నుపోటుదారులా?
గత ఎన్నికల్లో తనను దారుణంగా ఓడించింది.. భారీ మెజారిటీతో కూటమిని గద్దెనెక్కించింది ప్రజలన్న సంగతి జగన్ మరచిపోయినట్లు కనబడుతోందని రాజకీయ వర్గాలు అంటున్నాయి. ప్రజాతీర్పు వెలువడిన జూన్ 4నుంచి ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ పేరిట నిరసనలకు పిలుపివ్వడాన్ని వైసీపీ ముఖ్య నేతలు తప్పుబడుతున్నారు. కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకున్నారని.. అంటే జనం తనకు వెన్నుపోటు పొడిచారని జగన్ భావిస్తున్నారా అని ప్రశ్నిస్తున్నారు. స్థానిక ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులు గెలవకపోతే అసెంబ్లీ ఇన్‌చార్జులనే బాధ్యులను చేస్తానని హెచ్చరించడాన్ని కూడా ఆక్షేపిస్తున్నారు. పులివెందుల పరిధి స్థానిక సంస్థల్లో వైసీపీని గెలిపించే బాధ్యత ఆయన తీసుకుంటారా.. ఓటమికి బాధ్యత వహిస్తారా అని అడుగుతున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు మూడేళ్లకు ముందే స్థానిక ఎన్నికలు జరిగితే.. అభ్యర్ధుల ఎన్నికల ఖర్చు తాము భరించాలంటే ఎలా సాధ్యమని కొందరు ఇన్‌చార్జులు అంటున్నారు. 2024లోనూ ఇదే తరహాలో నియోజకవర్గ ఇన్‌చార్జులను ప్రకటించి.. ఆఖరి నిమిషంలో సర్వేల పేరు చెప్పి మొండిచేయి చూపారని.. ఇప్పుడు మళ్లీ స్థానిక ఎన్నికలను తమ నెత్తినపెట్టి.. ఖర్చుచేసి అభ్యర్థులను గెలిపించుకున్నా, 2029లో టికెట్ ఇస్తారన్న గ్యారెంటీ ఏమిటని నిలదీస్తున్నారు.