Share News

తూర్పు గోదావరి పర్యటనలో పరామర్శలు, పర్యటనల్లో విధ్వంసం

ABN , Publish Date - Aug 06 , 2026 | 05:02 AM

పొగాకు రైతులకు పరామర్శ, గిట్టుబాటు ధర డిమాండ్‌తో వైసీపీ అధినేత జగన్‌ చేపట్టిన పర్యటన... అటు ప్రజలకు, ఇటు పొగాకు రైతులకూ చుక్కలు చూపించింది.

తూర్పు గోదావరి పర్యటనలో పరామర్శలు, పర్యటనల్లో విధ్వంసం

  • బయటికి వస్తే జనానికి చుక్కలే

  • పరామర్శలు, పర్యటనల్లో విధ్వంసం

  • తూర్పు గోదావరి పర్యటనలో మూకదాడి..

  • పొగాకు బేళ్లపైకి ఎక్కి తొక్కడంతో చెల్లాచెదురు

  • రైతులకు సంఘీభావమంటూ వెళ్లి వారికే నష్టం

  • ర్యాలీ పేరిట బలప్రదర్శనలోనూ వీరంగం

  • టిఫిన్‌ సెంటర్‌లోకి వెళ్లి డబ్బులు దోపిడీ

  • పైకి ఎక్కి డ్యాన్సులు చేయడంతో హోటల్‌ ధ్వంసం

  • ప్రశ్నించిన మహిళలు, పిల్లలపై దాడి

  • బైకులకు సైలెన్సర్లు తీసేసి రోడ్లపై గోలగోల

  • బుల్లెట్‌తో ఢీకొట్టడంతో యువకుడికి గాయాలు

  • చివరకు వైసీపీ రైతులతో మేకప్‌.. జగన్‌ ప్యాకప్‌

అధికారంలో ఉండగా.... జగన్‌ కాలు బయట పెట్టారంటే పరదాలు కట్టడం, చెట్లు కొట్టడం, రకరకాల ఆంక్షలతో జనానికి చుక్కలు చూపించడం!

అధికారం పోయాక... జగన్‌ కాలు బయట పెట్టారంటే రప్పారప్పా నినాదాలు, దారిపొడవునా రచ్చ! జనానికి చుక్కలు చూపించడం ఇప్పుడూ కామన్‌!

పేరు పరామర్శ! తీరు... విధ్వంసం! పుంగనూరులో తోతాపురి మామిడి రైతుల పరామర్శలో నిరసన పేరిట రైతుల మామిడి కాయలు రోడ్లపై పోసి ట్రాక్టర్లతో తొక్కించారు. గుంటూరులో మిర్చి యార్డు సందర్శన పేరుతో అక్కడ నానా రచ్చ చేశారు. నేడు... పొగాకు రైతుల పరామర్శలో రైతుల పొగాకు బేళ్లను ఎక్కి, తొక్కి చెల్లాచెదురు చేశారు.

రాజమహేంద్రవరం, జూలై 5(ఆంధ్రజ్యోతి): పొగాకు రైతులకు పరామర్శ, గిట్టుబాటు ధర డిమాండ్‌తో వైసీపీ అధినేత జగన్‌ చేపట్టిన పర్యటన... అటు ప్రజలకు, ఇటు పొగాకు రైతులకూ చుక్కలు చూపించింది. వైసీపీ శ్రేణుల వీరంగం, అత్యుత్సాహంతో భీతావహ వాతావరణం నెలకొంది. ‘రైతుపోరు’ పేరిట బుధవారం తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లిలోని పొగాకు వేలం కేంద్రాన్ని జగన్‌ సందర్శించారు. ఈ సందర్భంగా వైసీపీ కార్యకర్తల్లు వీధుల్లో వీరంగం వేశారు. బైకులకు సైలెన్సర్లు తీసేసి పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూ రోడ్లపై దూసుకెళ్లారు. కళాశాల ముందు డీజే సౌండ్లతో గోల చేశారు. చిన్న టిఫిన్‌ సెంటర్‌ నడుపుకొంటున్న మహిళపై రుబాబుకు దిగారు. పొగాకు బేళ్లపై ఎక్కి ధ్వంసం చేశారు. ఎప్పటి మాదిరిగానే అనుమతి లేకపోయినా ర్యాలీ పేరుతో బలప్రదర్శన చేసి, ప్రభుత్వంపై విమర్శలు గుప్పించి జగన్‌ వెళ్లిపోయారు. రైతులకు సంఘీభావంగా చేపట్టిన పర్యటనలో రైతులకు లాభం కలగకపోగా, నష్టం చేకూర్చారు.


2 కి.మీ.. 2 గంటలు

బుధవారం ఉదయం 10.30 గంటలకు జగన్‌ హెలికాప్టర్‌లో దేవరపల్లి వచ్చారు. ఈ సందర్భంగా వైసీపీ శ్రేణులు ఇనుప బ్యారికేడ్లను సైతం పక్కకు లాగేసి, విరగ్గొట్టేసి హెలీప్యాడ్‌ వద్దకు చొచ్చుకెళ్లారు. అక్కడి నుంచి జగన్‌ను బయటకు తీసుకురావడానికి పోలీసులు అష్టకష్టాలు పడ్డారు. అక్కడి నుంచి సుమారు రెండు కిలోమీటర్ల మేర ర్యాలీగా బలప్రదర్శన చేశారు. ఆయన వాహనాన్ని ఉద్దేశపూర్వకంగానే వైసీపీ కార్యకర్తలు ఎక్కడికక్కడ కదలనివ్వకపోవడంతో ర్యాలీ దాదాపు రెండు గంటలు కొనసాగింది. పొగాకు వేలం కేంద్రంలో 30 నిమిషాలపాటు అప్పటికే ఎంపిక చేసిన వైసీపీకి చెందిన రైతులతో మాట్లాడారు. అనంతరం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మీడియా పాయింట్‌లో సీఎం చంద్రబాబు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై విమర్శలు చేశారు. ధర పెంచి మార్క్‌ఫెడ్‌ ద్వారా పొగాకు కొనుగోళ్లు జరపాలని డిమాండ్‌ చేశారు. 20 నిమిషాల పాటు సాగింది. అనంతరం హెలీప్యాడ్‌కు చేరుకొని తిరుగు పయనమయ్యారు.

ర్యాలీలో వీరంగం

జగన్‌ ర్యాలీ సందర్భంగా వైసీపీ కార్యకర్తలు మరీ రెచ్చిపోయారు. దివ్య అనే మహిళ నిర్వహిస్తున్న చిన్నపాటి టిఫిన్‌ సెంటర్‌లోకి ప్రవేశించి చేతికి అందింది పట్టుకుపోయారు. డబ్బులూ దోచుకున్నారు. దుకాణంపైకి ఎక్కి డ్యాన్సులు చేశారు. టిఫిన్‌ సెంటర్‌ను ధ్వంసం చేశారు. ఇదేమిటని ప్రశ్నించడంతో మహిళలు, పిల్లలపై కూడా మూకలు దాడి చేశాయి. జగన్‌ రాక వల్ల తమకు రూ.10 వేల వరకూ నష్టం జరిగిందని దివ్య, ఆమె తల్లి కన్నీరుమున్నీరయ్యారు. జగన్‌ రాకకు ముందు నుంచే వైసీపీ కార్యకర్తలు రోడ్లపై వీరంగం సృష్టించారు.


బండికి పెట్రోలు.. మందు, బిర్యానీ

బలప్రదర్శన చేయాలనే జగన్‌ తాపత్రయంతో జిల్లాలోని ఒకరిద్దరు ప్రధాన నాయకుల చేతి చమురు బలంగానే వదిలిందనే చర్చ నడిచింది. పెద్ద సంఖ్యలో జనాలను తరలించాలని వైసీపీ పెద్దల నుంచి హుకుం జారీ కావడంతో కొద్ది రోజుల ముందు నుంచే ఆ ప్రయత్నాల్లో ఉన్నారు. మహిళలు, పురుషులకు ఒక్కొక్కరికి రూ.200 నగదుతో పాటు బిర్యానీ ప్యాకెట్‌, మందుబాబులకు క్వార్టరు బాటిల్‌, ద్విచక్ర వాహనదారులకు పెట్రోలు, వాహనాల కిరాయికి వైసీపీ నాయకులు బాగా ఖర్చు చేయాల్సి వచ్చింది.

సంక్షోభంలో పొగాకు రైతులు: జగన్‌

చంద్రబాబు 27 నెలల పరిపాలనలో అన్నివర్గాలు నష్టపోయాయని జగన్‌ అన్నారు. వరి, మొక్కజొన్న, అరటి, కొబ్బరి, ప్రత్తి, మినుము, పెసలు, సజ్జలు, ఉల్లి, టమాట, పొగాకు, కోకో, ఆక్వా ఏ పంటకూ గిట్టుబాటు ధర రాలేదని విమర్శించారు. పొగాకు రైతులు సంక్షోభంతో రోడ్డున పడ్డారన్నారు.

రోడ్లపై జనాలకు నరకం

వైసీపీ మూకల వీరంగానికి ఒక యువకుడు ఆస్పత్రి పాలయ్యాడు. బందపురం నుంచి బ్యాంకు పనిమీద దేవరపల్లికి వచ్చి ద్విచక్ర వాహనంపై తిరిగి వెళ్తున్న కుందుల లక్ష్మీనారాయణ అనే యువకుడిని ఓ వైసీపీ కార్యకర్త బుల్లెట్‌తో బలంగా ఢీకొట్టాడు. దీంతో ఆ యువకుడి కాలు విరిగిపోయింది. వైసీపీ క్యాడర్‌ తోపులాటల్లో దాదాపు పది మందికి గాయాలయ్యాయి. చాలామంది సెల్‌ఫోన్లు చోరీకి గురయ్యాయి.ఒకయువతి మెడలో బంగారు గొలుసు లాక్కెళ్లడానికి ఒకడు ప్రయత్నించగా.. ఆమె అప్రమత్తమై కేకలు వేయడంతో అతడు పరారయ్యాడు. ఈ గుంపుగోలలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా స్వల్ప అస్వస్థతకు గురయ్యారు.హెలీప్యాడ్‌ను డిగ్రీ కళాశాల దగ్గర్లో ఏర్పాటు చేశారు. కళాశాల వద్ద డీజే సౌండ్‌ సిస్టమ్‌తో భారీ శబ్దాలు చేస్తూ పాటలు వేయడంతో విద్యార్థులు అసహనానికి గురయ్యారు.


పొగాకు కేంద్రంలో అరాచకం

జగన్‌ పొగాకు కేంద్రంలోకి ప్రవేశిస్తున్న సమయంలో ఒక్కసారిగా వైసీపీ కార్యకర్తలు చొచ్చుకొని రావడంతో పోలీసులు దాదాపుగా చేతులెత్తేశారు. అప్పటికి కేంద్రంలో 1500 వరకూ పొగాకు బేళ్లు ఉన్నాయి. ఒక్కోటి 100 నుంచి 150 కిలోల వరకూ ఉంటుంది. జగన్‌ దగ్గరకు వచ్చేశారనే సమాచారంతో అప్పటికే వేలం ముగిసిన బేళ్లను కంపెనీల ప్రతినిధులు ఆగమేఘాలపై ఒబ్బిడి(చక్కబెట్టుకొన్నారు) చేసుకున్నారు. వేలం వేయాల్సినవి సుమారు వెయ్యికి పైగా బేళ్లు అక్కడే ఉన్నాయి. జగన్‌ రాకతో వేలం ఆపేశారు. జగన్‌తో పాటు వైసీపీ కార్యకర్తలు మూకదాడి మాదిరిగా లోపలకు వచ్చి బేళ్లపై ఎక్కి తొక్కేశారు. గతంలో కూడా ఒకసారి జగన్‌ వచ్చినప్పుడు ఇలాగే విధ్వంసం సృష్టించారు. పొగాకు బేళ్లు రైతుల కష్టమని, వాటిని నాశనం చేయవద్దని మైకులో పదే పదే బోర్డు తరఫున కోరినా ఫలితం లేకపోయింది. తమ కష్టాన్ని కాళ్లతో తొక్కేస్తుండడం చూసి ఓ రైతు కళ్లు చెమర్చాయి. జగన్‌ వెళ్లాక మళ్లీ వేలం కార్యక్రమం జరిగింది.

Updated Date - Aug 06 , 2026 | 06:12 AM