చంద్రబాబుకు చుక్కలే!
ABN , Publish Date - Apr 09 , 2026 | 04:02 AM
‘‘చంద్రబాబు పాలనలో సగం ముగిసింది. వచ్చే ఏడాది పాదయాత్ర మొదలుపెడతా. అప్పుడు ప్రతి రోజూ వైసీపీ కార్యకర్తలు చంద్రబాబుకు సినిమా చూపిస్తారు.
పాదయాత్రలో సినిమా చూపిస్తాం: జగన్
అమరావతి, ఏప్రిల్ 8(ఆంధ్రజ్యోతి): ‘‘చంద్రబాబు పాలనలో సగం ముగిసింది. వచ్చే ఏడాది పాదయాత్ర మొదలుపెడతా. అప్పుడు ప్రతి రోజూ వైసీపీ కార్యకర్తలు చంద్రబాబుకు సినిమా చూపిస్తారు. చుక్కలు చూపిస్తారు’’ అని మాజీ సీఎం జగన్ పేర్కొన్నారు. బుధవారం ఆయన తాడేపల్లిగూడెం వైసీపీ శ్రేణులతో సమావేశమయ్యారు. ఎన్నికల్లో ప్రజలు కూటమిని ఫుట్‌బాల్ తన్నినట్లుగా తంతారని, సింగిల్ డిజిట్ కూడా ఇవ్వరని జోస్యం చెప్పారు. అమరావతి రాజధాని అంటే 25 ఏళ్లయినా నిర్మించడం సాధ్యం కాదన్నారు. చంద్రబాబు రాష్ట్రానికి రాజధాని లేకుండా చేస్తున్నారని ఆరోపించారు. ప్లాన్-ఏ కింద మూడు రాజధానుల విధానం సూచించానని అన్నారు. ‘‘జగన్ చెప్పాడని మూడు రాజధానులను వ్యతిరేకిస్తుంటే.. ప్లాన్-బీ కింద మచిలీపట్నం-మా, విజయవాడ-వి, గుంటూరు-గన్ కలిపి ‘మావిగన్’ను రాజధాని ప్రాంతంగా ప్రకటించాలని చిలక్కు చెప్పినట్లుగా చెప్పా. అయితే... నేను చెప్పానన్న కారణంతో చంద్రబాబు తల అడ్డంగా ఊపుతున్నాడు’’ అని జగన్ పేర్కొన్నారు.