రాష్ట్రంలో రాక్షస పాలన!
ABN , Publish Date - Jan 29 , 2026 | 04:17 AM
రాష్ట్రంలో రాక్షసపాలన సాగుతోందని వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆరోపించారు. జంగిల్ రాజ్‌ను కూటమి ప్రభుత్వం, సీఎం చంద్రబాబు, ఆయన కొడుకు లోకేశ్ ప్రోత్సహిస్తున్నారని అన్నారు.
జంగిల్ రాజ్‌కు బాబు, లోకేశ్ ప్రోత్సాహం
వచ్చేది వైసీపీ ప్రభుత్వమే.. జగన్ 2.0 ఎలా ఉంటుందో చూస్తారు
వైసీపీ అధినేత వార్నింగ్.. భీమవరం నేతలతో భేటీ
అమరావతి, జనవరి 28(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో రాక్షసపాలన సాగుతోందని వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆరోపించారు. జంగిల్ రాజ్‌ను కూటమి ప్రభుత్వం, సీఎం చంద్రబాబు, ఆయన కొడుకు లోకేశ్ ప్రోత్సహిస్తున్నారని అన్నారు. బుధవారం తాడేపల్లి ప్యాలె్‌సలో భీమవరం అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ ముఖ్య నేతలు, స్థానిక ప్రజాప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు. పైన చంద్రబాబు మొదలుకొని కిందిస్థాయిదాకా అవినీతి విచ్చలవిడిగా సాగుతోందన్నారు. పోలీసులు రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని నడుపుతూ అక్రమ కేసులు బనాయిస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో ఏ వర్గానికీ న్యాయం జరగడం లేదని.. ప్రధానంగా మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. ఎమ్మెల్యే అరవ శ్రీధర్ నుంచి కూన రవికుమార్ దాకా లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని.. అరవ శ్రీధర్ అసలు మనిషేనా అని ప్రశ్నించారు. మంత్రి వాసంశెట్టి సుభాష్ ఏకంగా స్టేజ్‌పైనే అశ్లీల నృత్యాలు చేస్తున్నారని.. గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నజీర్ మహిళతో మాట్లాడుతూ అశ్లీల వీడియోలు చూశాడన్నారు. అధికారాన్ని ఉపయోగించుకుని మంత్రులు, ఎమ్మెల్యేలు కేసులు కొట్టేయించుకుంటున్నారని ఆరోపించారు. సంక్రాంతి సంబరాలు ఎలా జరిగాయో సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నాయన్నారు. భీమవరం డీఎస్పీ సంక్రాంతి సమయంలో తనకు ఉత్సాహం లేదంటూ పోలీసు డ్రస్సులోనే వ్యాఖ్యానించారని.. చివరకు పులివెందులలోనూ కోడి పందాల సంస్కృతిని ఆర్గనైజ్డ్‌గా తీసుకొచ్చారని ధ్వజమెత్తారు. తన నియోజకవర్గంలో కోడి పందాల నిర్వహణకు ఏకంగా వేలం పాటలు వేశారని అన్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వ పాలనకూ.. గతంలో వైసీపీ పాలనకూ మధ్య తేడాను ప్రజలకు వివరించాలని నేతలకు సూచించారు. కళ్లు మూసుకుంటే రెండేళ్లు పూర్తి కావస్తోందని.. మళ్లీ కళ్లు మూసుకుంటే మిగతా మూడేళ్లూ పూర్తవుతాయని తెలిపారు. ఏడాదిన్నర తర్వాత తాను 150 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పాదయాత్ర చేస్తానని.. ప్రతి మూడు రోజులకోసారి ప్రజా ఉప్పెన మధ్య బహిరంగ సభ నిర్వహిస్తానని అన్నారు. భవిష్యత్‌లో వచ్చేది వైసీపీ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. జగన్ 2.0 ఎలా ఉంటుందో చూస్తారని మాజీ సీఎం హెచ్చరించారు.