‘సో కాల్డ్ రాజధాని’
ABN , Publish Date - Jul 03 , 2026 | 05:05 AM
రాష్ట్ర రాజధానిపై వైసీపీ అధినేత జగన్ పూటకోమాట మాట్లాడుతున్నారు. మూడు రాజధానులు పోయాయి..
అమరావతి కాదు.. విజయవాడ..!
జగన్ తాజా వ్యాఖ్యలు
బిత్తరపోయిన వైసీపీ నేతలు
విజయవాడలో ఆత్మహత్య చేసుకున్న క్రాంతికుమార్ కుటుంబానికి పరామర్శ
రాజధాని పరిధిలో ఇలాంటి ఘటనలు ఆందోళనకరం
ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలి: వైసీపీ అధినేత
విజయవాడ, జూలై 2 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర రాజధానిపై వైసీపీ అధినేత జగన్ పూటకోమాట మాట్లాడుతున్నారు. మూడు రాజధానులు పోయాయి.. ‘మావిగన్’ అని మొదలుపెట్టారు. ఆ నినాదంతోనే వచ్చే ఎన్నికలకు వెళ్తున్నామని బుధవారం ప్రకటించిన ఆయన.. గురువారం అమరావతిపై మరోసారి అక్కసు వెళ్లగక్కారు. రాష్ట్రానికి సోకాల్డ్ రాజధాని అమరావతి కాదని.. విజయవాడే అసలు రాజధాని అని వ్యాఖ్యానించారు. పక్కనే ఉన్న వైసీపీ నాయకులు బిత్తరపోయారు. ఇటీవల ఆత్మహత్య చేసుకున్న ట్యాక్సీ డ్రైవర్ క్రాంతికుమార్ కుటుంబ సభ్యులను గురువారం విజయవాడ ఫకీర్‌గూడెంలో జగన్ పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో లాకప్ డెత్‌లు, ఆత్మహత్య ఘటనలు పెరుగుతున్నాయని అన్నారు. పోలీసుల వేధింపులు తట్టుకోలేకే క్రాంతికుమార్ ఆత్మహత్య చేసుకున్నారని ఆరోపించారు. ఆ కుటుంబ పరిస్థితి ఎంతో దయనీయంగా ఉందని.. ఒక చిన్న ఇంట్లో పేదరికంతో జీవిస్తున్నారని.. ప్రస్తుతం ఆర్థిక, సామాజికంగా తీవ్ర సంక్షోభంలో ఉన్నారని చెప్పారు. గత ఎనిమిదేళ్లుగా అతడిపై ఎలాంటి కేసులు లేవని, గత మూడు నెలలుగా పోలీసులు పదేపదే స్టేషన్‌కు పిలిపించి వేధింపులకు గురిచేశారని.. తట్టుకోలేక చివరకు ఆత్మహత్యకు పాల్పడ్డారని ఆరోపించారు. ఆయన తండ్రి నగర పోలీస్ కమిషనర్‌ను కలిసి ఆత్మహత్య వీడియో చూపించినప్పటికీ.. ఎలాంటి స్పందనా రాకపోవడం విచారకరమని.. పోలీసుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని విమర్శించారు. ఈ వ్యవహారంలో ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. క్రాంతికుమార్ కుటుంబానికి అండగా నిలుస్తామని.. పార్టీ తరఫున న్యాయ సహాయం అందించి, న్యాయం జరిగే వరకు పోరాడతామని స్పష్టం చేశారు. పోలీసుల నిర్వాకం కారణంగా తక్కువ కాలంలోనే రెండు మరణాలు చోటుచేసుకోవడం.. రాజధాని పరిధిలోనే ఇటువంటివి జరగడం మరింత బాధాకరమని.. సీఎం, హోం మంత్రి, పోలీసు ఉన్నతాధికారులు ఉన్న ప్రాంతంలోనే ఇలాంటి ఘటనలు జరుగుతుండడం రాష్ట్రంలో శాంతిభద్రతలపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయని విమర్శించారు.
అమరావతిలో ఇళ్ల పట్టాలిస్తారట!
అమరావతి పొడగిట్టని జగన్.. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన వెంటనే అమరావతిలో గతంలో కేటాయించిన లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని చెప్పడం గమనార్హం. వైసీపీ హయాంలో అమరావతిలో ఇచ్చిన పట్టాభూమికి కూటమి ప్రభుత్వం స్థలం కేటాయించలేదని ఓ మహిళ చెప్పగా ఆయన స్పందించారు. గతంలో తాను రూ.100 కట్టించి రిజిస్ర్టేషన్ చేయించిన వారికి ఇళ్ల స్థలాలు కేటాయిస్తానని చెప్పారు. అవసరమైతే కోర్టులో కేసు వేయించైనా న్యాయం చేస్తానన్నారు.