18 ఏళ్ల పిల్లోనికి ఏం తెలుస్తాది
ABN , Publish Date - Jul 15 , 2026 | 03:52 AM
వైసీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మంగళవారం విశాఖపట్నంలో మత్స్యకార కుటుంబాలను పరామర్శించారు. అక్కడే మీడియాతో మాట్లాడారు.
యాక్సిడెంట్లు జరుగుతా ఉంటాయ్.. సీదిరి కుమారుడిపై జగన్ సానుభూతి
వాస్తవాలు వదిలేసి వింత వాదన.. కేసును మరొకరిపైకి నెట్టేసిన సీదిరి
సినీ ఫక్కీలో పోలీసులను మాయ చేసిన వైనం
పోలీసు వర్గాల సమాచారం ప్రకారం... సీదిరి అప్పలరాజు కుమారుడు ఆరవ్ ఎన్‌ఫీల్డ్ వాహనంపై వేగంగా వెళుతూ పశువుల కాపరి దానయ్యను ఢీకొట్టాడు. ఆ వెంటనే బాధితుడిని ఆస్పత్రికి తీసుకెళ్లి ఉంటే బతికేవాడేమో! కానీ... ఆ పని చేయలేదు. కుమారుడిని కేసు నుంచి తప్పించడంపైనే సీదిరి అప్పలరాజు దృష్టి సారించారు. సినిమాల్లోలాగా... సిద్ధార్థ్ అనే యువకుడే యాక్సిడెంట్ చేసినట్లుగా చిత్రీకరించారు.
(విశాఖపట్నం/అమరావతి - ఆంధ్రజ్యోతి)
వైసీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మంగళవారం విశాఖపట్నంలో మత్స్యకార కుటుంబాలను పరామర్శించారు. అక్కడే మీడియాతో మాట్లాడారు. ఈ ప్రభుత్వం మత్స్యకారులను దారుణంగా వేధిస్తోందని, అందుకు చిన్న ఎగ్జాంపుల్... అంటూ మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు చేసిన రోడ్డు ప్రమాదం గురించి ప్రస్తావించారు. జగన్ ఏమన్నారంటే... ‘‘ఆ సీదిరి అప్పలరాజు కొడుకు 18 ఏళ్ల పిల్లోడు. అప్పలరాజు డాక్టరు... పలాస ఎమ్మెల్యే... మన ప్రభుత్వంలో ఫిషింగ్ మంత్రి. ఆయన కొడుకు బైక్ తోల్తా ఉండి కర్మవశాత్తూ ఎవరినో గుద్ది ఒక మనిషి చనిపోయాడు. యాక్సిడెంట్లు అవుతాఉంటాయి. చేసింది కరెక్టు అని నేను చెప్పను. 18 ఏళ్ల పిల్లోడు బైక్ తొలుతా ఉంటే, ఆ పిల్లోనికి ఏం తెలుస్తాది. ఒక్కోసారి జరుగుతాయ్. జరిగినప్పుడు నువ్వేం చేస్తా ఉన్నావు? ప్రభుత్వం ఏం చేసిందో తెలుసా? సీదిరి అప్పలరాజు కొడుకును మర్డర్ కేసులో, హోమిసైడ్ సెక్షన్లు పెట్టి ఇరికించాలని ప్రయత్నం చేసింది. నిజంగా ఈ ప్రభుత్వానికి మానవత్వం ఉందా అని అడుగుతా ఉన్నా! చివరకు జడ్జి తప్పుబట్టి ఏం సెక్షన్లు పెడుతున్నారయ్యా... 18 ఏళ్ల పిల్లోని మీద మర్డర్ కేసు పెట్టడం ఏమిటి? అరె, యాక్సిడెంట్ అయ్యింది. తప్పు జరిగింది. అయితే మర్డర్ కేసు పెట్టడం ఏందయ్యా అని జడ్జి తిట్టి సెక్షన్లు మార్పించింది. అంటే ఎంత దారుణంగా జరుగుతుందో ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా!’’
ఐదేళ్లు సీఎంగా పని చేసిన జగన్ తెలుసుకోవాల్సిన విషయాలేమిటంటే...
నిజమే! ప్రమాదం చేయాలని, తనవల్ల మరొకరు చనిపోవాలని ఎవరూ అనుకోరు. సీదిరి అప్పలరాజు కుమారుడు ఆరవ్‌కూ ఇదే వర్తిస్తుంది. ఇది ప్రమాదంతో ఆగిపోలేదు. ‘నావల్ల ప్రమాదం జరిగింది’ అని ఆరవ్ పోలీసులకు సమాచారం ఇచ్చి ఉంటే ఇక్కడిదాకా వచ్చేదే కాదు. కానీ... యాక్సిడెంట్ చేసింది ఆరవ్ కా గా... కేసులో ఇరికించింది అతని స్నేహితుడు సిద్ధార్థ్‌ను. ఇది చట్ట రీత్యా నేరం కాదా!?
సీదిరి అప్పలరాజు కుమారుడు ‘పిల్లోడు’ అని జగన్ జాలి ప్రదర్శిస్తున్నారు. 19 ఏళ్లు అంటే టీనేజ్ కుర్రాడే! ఈ వయసులో కేసుల్లో ఇరుక్కోవడం కష్టమే. కానీ... చట్టం ప్రకారం 18ఏళ్లు దాటితే మైనారిటీ తీరినట్లే. ఆరవ్‌కు ఓటు హక్కు పొందే వయసు వచ్చింది. జగన్ చెబుతున్న ‘పిల్లోడు’ సిద్ధాంతం ఇక్కడ వర్తించదు.
‘ఈ ప్రభుత్వానికి మానత్వం లేదు. సీదిరి అప్పలరాజు కుమారుడిపై హోమిసైడ్ కేసు పెడతారా?’ అని జగన్ గట్టిగా ప్రశ్నించారు. మనిషిని హత్య చేస్తే మర్డర్ కేసు పెడతారు. ఒక మనిషి మరణానికి కారణమైతే... హోమిసైడ్ కేసే పెడతారు. ప్రమాదంలో ఒకరి మరణానికి కారణమైనందున ఆరవ్‌పై హోమిసైడ్ కేసు పెట్టారు. చట్టం ఇదే చెబుతోంది. ఇది కాకుండా మరేదైనా సెక్షన్ ఉంటే జగన్ చెప్పాలి!
‘ఆరవ్‌పై మర్డర్ కేసుపెట్టారు. జడ్జి తిట్టి సెక్షన్లు మార్పించారు’ అని జగన్ పేర్కొనడం మరో విచిత్రం! ఆరవ్‌పై పోలీసులు మర్డర్ కేసు పెట్టనేలేదు. ప్రమాదంలో మనిషి మరణానికి కారణం కావడం, వాస్తవాలను దాచిపెట్టడం, మరొకరిపై కేసును తోసేందుకు ప్రయత్నించడం... ఈ సెక్షన్ల కిందే కేసు పెట్టారు.
అప్పలరాజు కుమారుడు ఆరవ్‌పై జగన్ ఎంతో జాలి, మరెంతో దయ, ఇంకెంతో సానుభూతి చూపించారు. మరి... ఆరవ్ కారణంగా ప్రమాదంలో మరణించిన గొర్రెల కాపరి కుటుంబం పరిస్థితి ఏమిటి? మీ దయకు వారు అర్హులు కారా? యాక్సిడెంట్ కేసును ఆరవ్ స్నేహితుడైన 21ఏళ్ల సిద్ధార్థ్ నెత్తిన వేయాలని చూడటం న్యాయమా? అతని భవిష్యత్తు మాటేమిటి?