Share News

నేనొచ్చాక డీఎస్సీపై రీఎంక్వయిరీ

ABN , Publish Date - Jun 04 , 2026 | 04:46 AM

డీఎస్సీ బాధితులకు వైసీపీ అండగా ఉంటుందని.. కళ్లు మూసుకుని తెరిచేలోగా మూడేళ్లు పూర్తవుతాయని, కచ్చితంగా తన ప్రభుత్వమే వస్తుందని..

నేనొచ్చాక డీఎస్సీపై రీఎంక్వయిరీ

  • సీబీఐ దర్యాప్తు జరిపించాలి: జగన్‌

అమరావతి, జూన్‌ 3 (ఆంధ్రజ్యోతి): డీఎస్సీ బాధితులకు వైసీపీ అండగా ఉంటుందని.. కళ్లు మూసుకుని తెరిచేలోగా మూడేళ్లు పూర్తవుతాయని, కచ్చితంగా తన ప్రభుత్వమే వస్తుందని.. అధికారంలోకి వచ్చిన వెంటనే డప్రత్యేకంగా రీఎంక్వయిరీ వేస్తానని వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ తెలిపారు. డీఎస్సీ అక్రమాలపై సీబీఐ దర్యాప్తునకు డిమాండ్‌ చేశారు. టీచర్‌ ఉద్యోగాలకు అర్హత సాధించని కొందరు డీఎస్సీ అభ్యర్థులు బుధవారం తాడేపల్లి ప్యాలె్‌సలో ఆయన్ను కలిశారు. ‘ఇంతమంది బాధితులా’ అని ఆయన నవ్వుతూ అన్నారు. ‘ఎస్‌ సార్‌.. ఇంకా ఉన్నారు సార్‌’ అంటూ ఒక మహిళ నవ్వుతూనే సమాధానం ఇచ్చారు. తన ప్రభుత్వం వచ్చాక విచారణ కోసం ప్రత్యేకంగా కమిషన్‌ను నియమిస్తామని..బాధితులకు న్యాయ సహాయం చేసేందుకు ప్రత్యేకంగా లీగల్‌ ప్యానల్‌ను నియమిస్తానని జగన్‌ ఈ సందర్భంగా చెప్పారు. స్పోర్ట్స్‌ కోటాలో ఉద్యోగాల భర్తీ కోసం ఎలాంటి టెస్టులూ ఉండవంటూ మొదట ఉత్తర్వు జారీ చేసి అవినీతికి ప్రభుత్వం గేట్లెత్తిందని ఆరోపించారు. ఉద్యోగాల భర్తీ జరిగాక స్పోర్ట్స్‌ కోటా అభ్యర్థులు కూడా పరీక్షలు రాయాలంటూ జీవో ఇచ్చారని అన్నారు. 2019లో తాను అధికార పగ్గాలు చేపట్టాక గాంధీ జయంతి నాటికి లక్షా ఇరవై వేల గ్రామ సచివాలయ ఉద్యోగాలను పారదర్శకంగా భర్తీ చేశానని.. ఎక్కడా ఒక్క ఆరోపణ కూడా రాలేదన్నారు. కానీ కేవలం 16,000 ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీలో అక్రమాలు జరిగాయని, పోస్టులు అమ్ముకున్నారని ఆరోపించారు. తమకు అన్యాయం జరిగిందంటూ ఒక మహిళ ఈ సందర్భంగా కన్నీళ్లు పెట్టుకోగా.. ఏడిస్తే సమస్య పరిష్కారం కాదని.. ధైర్యంగా పోరాటం చేయాలని జగన్‌ సూచించారు. మూడేళ్లు కళ్లు మూసుకుంటే తన ప్రభుత్వం వస్తుందని.. తాను అధికారంలోకి వచ్చిన వెంటనే డీఎస్సీపై రీ-ఎంక్వయిరీ వేస్తానని.. అందాకా ఓపిక పట్టాలన్నారు.

Updated Date - Jun 04 , 2026 | 04:46 AM