ఎమ్మెల్యేగానూ విఫలం!!
ABN , Publish Date - Apr 26 , 2026 | 04:55 AM
పదవీ కాంక్ష తప్ప వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి ప్రజాసమస్యలు పట్టడం లేదని వైసీపీ ముఖ్య నేతలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. కనీసం ఎమ్మెల్యేగానూ ఆయన తన బాధ్యత నిర్వహించడం లేదని పులివెందుల నియోజకవర్గవాసులు వాపోతున్నారు.
అధికార కాంక్ష తప్ప ప్రజాసమస్యలు జగన్‌కు పట్టవు!
మాజీ సీఎం తీరుపై జనంలో అసంతృప్తి
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
పదవీ కాంక్ష తప్ప వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి ప్రజాసమస్యలు పట్టడం లేదని వైసీపీ ముఖ్య నేతలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. కనీసం ఎమ్మెల్యేగానూ ఆయన తన బాధ్యత నిర్వహించడం లేదని పులివెందుల నియోజకవర్గవాసులు వాపోతున్నారు. పైగా ‘కళ్లు మూసి తెరిచేలోగా మూడేళ్లయిపోతుంది. నేనే అధికారంలోకి వస్తున్నా’ అని ఆయన పదే పదే చెబుతుండడంపై సొంత పార్టీ నేతలు, పులివెందుల ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ప్రజా సమస్యలపై ప్రభుత్వంపై పోరాడతానని.. ఒత్తిడి తెస్తానని జగన్ మాటవరుసకైనా చెప్పకపోవడం వారిని విస్మయపరుస్తోంది. జగన్ పులివెందులలో మూడ్రోజుల పర్యటనకు వెళ్లారు. బుధవారం నియోజకవర్గ ప్రజలు కొందరు ఆయన్ను కలిశారు. జాతీయ రహదారి విస్తరణలో తాము ఇళ్లు కోల్పోతున్నామని.. సత్వరం నష్టపరిహారం అందించేలా చూడాలని అభ్యర్థించారు. జగన్ స్పందిస్తూ.. మూడేళ్లలో తాను తిరిగి అధికారంలోకి వస్తానని యథావిధిగా రొటీన్ మాటే చెప్పారు. దీంతో ఒక బాధితుడు.. అంతదాకా మేం యాతనపడాలా అని ప్రశ్నించారు. ఈ ప్రశ్న పార్టీ శ్రేణుల్లో తీవ్ర చర్చకు దారితీసిందని వైసీపీ ముఖ్య నేతలు కొందరు చెబుతున్నారు. అధికారం ఉంటే తప్ప జనాన్ని పట్టించుకోరా అని తమ అధినేతను ఆక్షేపిస్తున్నారు.
అప్పుడూ లేదు.. ఇప్పుడూ లేదు!
అధికారంలో ఉన్నవారు ప్రజాసేవ చేసి మెప్పించి తిరిగి అధికారంలోకి వచ్చేందుకు కృషిచేస్తారు. ప్రతిపక్షంలో ఉన్నవారు ప్రజా సమస్యలపై పోరాటం చేసి గద్దె సాధించేందుకు ప్రయత్నిస్తారు. కేవలం 11 స్థానాలే సాధించి.. ప్రధాన ప్రతిపక్ష నేత హోదా రాదని తెలిసీ దానినే కోరుకుంటున్న జగన్.. ప్రజా సమస్యలపై పోరాటం చేసినా, చేయకపోయినా.. కనీసం ఎమ్మెల్యేగానైనా ముఖ్యమంత్రికి లేఖలు రాయొచ్చు. జనం సమస్యల పరిష్కారాన్ని కోరవచ్చు. 2019లో అధికారం కోల్పోయాక ప్రధాన ప్రతిపక్ష నేతగా చంద్రబాబు కుప్పం రెవెన్యూ డివిజన్ సమస్యపై నాటి సీఎం జగన్‌కు లేఖ రాశారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు ఈ పనిచేయలేదని.. ఇప్పుడు తనకు లేఖ రాశారంటూ జగన్ ఎద్దేవాచేసేవారు. నిజానికి పులివెందులలో జాతీయ రహదారి విస్తరణ పనులు జగన్ సీఎంగా ఉన్నప్పుడే ప్రారంభమయ్యాయి. బిల్లులు చెల్లించకపోవడంతో కాంట్రాక్టు సంస్థలు పనులు ఆపేశాయి. మళ్లీ ఇప్పుడు పనులు మొదలయ్యాయి. ఇళ్లు కోల్పోతున్న కుటుంబాలు పరిహారం ఇప్పించాలని జగన్‌ను తాజాగా కోరాయి. ఆయన అధికారంలో ఉండగా వారికి నష్ట పరిహారం, పునరావాసం అందించలేదు. ప్రతిపక్షంలోకి వచ్చాకైనా వారికి అండగా నిలిచే ప్రయత్నం చేయడంలేదు. సమస్య పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని వారు కోరుతుంటే.. కళ్లుమూసి తెరిచేలోగా మూడళ్లయిపోతాయని.. అధికారంలోకి వచ్చేస్తానంటున్న ఆయన తీరుతో ప్రజల్లో అసంతృప్తి, అసహనం పెరుగుతున్నాయని సొంత పార్టీ నేతలే అంగీకరిస్తున్నారు.
లండన్‌కు జగన్ దంపతులు
వచ్చే నెల 10న తిరిగి బెంగళూరుకు
అవరావతి, ఏప్రిల్ 25 (ఆంధ్రజ్యోతి): వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి దంపతులు బెంగళూరు నుంచి శనివారం అర్ధరాత్రి లండన్ బయల్దేరారు. రెండు వారాల పర్యటన తర్వాత తిరిగి వచ్చే నెల 10వ తేదీన తిరిగి బెంగళూరు చేరుకుంటారు. ఈ ప్రయాణానికి సంబంధించి ఆయన సీబీఐ ప్రత్యేక కోర్టు నుంచి అనుమతులు తీసుకున్నారు. వ్యక్తిగత ఈ-మెయిల్ అడ్రస్, సెల్ ఫోన్ నంబర్ ఇవ్వాలని.. సెక్యూరిటీ డిపాజిట్ కూడా చెల్లించాలని కోర్టు షరతులు విధించింది. లండన్‌లో ఉన్న కుమార్తెలను కలుసుకునేందుకు ఏటా వెళ్తున్నట్లే ఈ ఏడాది కూడా వెళ్లారు.