YS Jagan Political Conspiracy: మళ్లీ అదే విషం!
ABN , Publish Date - Jan 09 , 2026 | 03:37 AM
రాజధాని కోసం రెండోదశ భూసమీకరణ ప్రక్రియ ప్రారంభమైన వేళ... ‘అమరావతి’కి చట్టబద్ధత కల్పిస్తూ పార్లమెంటులోనే బిల్లు ఆమోదించేలా ప్రయత్నాలు సాగిస్తున్న సమయంలో...
అమరావతిపై జగన్ కొత్త కుట్రలు
లేని రివర్ బేసిన్‌ను ‘సృష్టించిన’ వైసీపీ నేత
నదికి 6 కిలోమీటర్ల దూరంలో కోర్ క్యాపిటల్
ప్రభుత్వ ప్రధాన భవనాలన్నీ అక్కడే
కరకట్టకు వంద మీటర్ల వరకే ‘రివర్ బేసిన్’
అయినా.. కొత్త వాదన మొదలుపెట్టిన జగన్
ఇది తాడేపల్లిలో జగన్ నిర్మించుకున్న ప్యాలెస్. కృష్ణా నదికి రెండు కిలోమీటర్లలోపే ఉంటుంది. అమరావతి ‘రివర్ బేసిన్’లో ఉందంటున్న జగన్... తన ప్యాలెస్‌తోపాటు తాడేపల్లి మొత్తాన్నీ ఖాళీ చేయించాలంటారా?

(గుంటూరు/అమరావతి- ఆంధ్రజ్యోతి)
రాజధాని కోసం రెండోదశ భూసమీకరణ ప్రక్రియ ప్రారంభమైన వేళ... ‘అమరావతి’కి చట్టబద్ధత కల్పిస్తూ పార్లమెంటులోనే బిల్లు ఆమోదించేలా ప్రయత్నాలు సాగిస్తున్న సమయంలో... వైసీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరోసారి అమరావతిపై విషం చిమ్మారు. ‘రాజ్యాంగంలో అసలు రాజధాని అనే పదమే లేదు’ అని పాతపాట పాడుతూనే... ‘నదీ పరీవాహక ప్రాంతం’ (రివర్ బేసిన్)లో నిర్మాణాలు చేస్తున్నారని, సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలని కొత్త పల్లవి అందుకున్నారు. అమరావతిని జాతీయ స్థాయిలో వివాదాస్పదం చేసేందుకు లేని ‘రివర్ బేసిన్’ను సృష్టించారు. ప్రస్తుతం రాజధానిలో శాశ్వత సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు, ఐకానిక్ భవనాలను నేలపాడు గ్రామ పరిధిలో నిర్మిస్తున్నారు. ఇది కోర్ క్యాపిటల్ ఏరియా! ఈ ప్రాంతం కృష్ణా నదికి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంది. రాజధానిలోని ఈ-5, ఈ-6 రోడ్ల మధ్య ఈ నిర్మాణాలు వస్తున్నాయి. కృష్ణా నదీ ప్రవాహం... ఆ తర్వాత కొంత దూరంలో వరదల సమయంలో ముంపును అడ్డుకునే కరకట్ట... ఆ కరకట్ట నుంచి ఐదారు కిలోమీటర్ల దూరంలో ‘కోర్ క్యాపిటల్’ వస్తోంది. కృష్ణా నదికి, నేలపాడుకు మధ్య ఉద్దండరాయునిపాలెం, రాయపూడి, లింగాయపాలెం తదితర గ్రామాలు ఉన్నాయి.
జగన్ వాదన ప్రకారం ఈ గ్రామాలన్నీ తరలించాల్సిందే. అక్కడ ఇళ్లూ వాకిళ్లూ ఉండకూడదు. వాటన్నింటినీ ఖాళీ చేయించాల్సిందే! అసలు విషయం ఏమిటంటే... రాజధాని గ్రామాలేవీ ‘రివర్ బేసిన్’ పరిధిలోకి రావు. కరకట్ట నుంచి వంద మీటర్ల వరకు మాత్రమే రివర్ బేసిన్‌గా పరిగణిస్తున్నట్లు సాగునీటి శాఖ అధికారులు స్పష్టం చేశారు. అయినప్పటికీ... ‘రాజధానిని రివర్ బేసిన్‌లో నిర్మిస్తున్నారు. సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలి’ అని జగన్ డిమాండ్ చేయడం విశేషం. ఇది అమరావతిపై విషం చిమ్మడం తప్ప మరొకటి కాదని రాజధాని గ్రామ రైతులు మండిపడుతున్నారు.
మరి మీ ప్యాలెస్ మాటేమిటి?
‘జగన్ తాడేపల్లిలో ఇల్లు కట్టుకున్నారు. మేం అధికారంలోకొస్తే అమరావతి ఇక్కడే ఉంటుంది’ అని 2019 ఎన్నికల ముందు వైసీపీ నేతలు మభ్యపెట్టారు. ఆ సంగతి పక్కనపెడితే... తాడేపల్లిలో జగన్ ప్యాలెస్ కృష్ణా నదికి కేవలం 2 కిలోమీటర్ల లోపే ఉంటుంది. జగన్ చెప్పిన లెక్క ప్రకారం ఇదీ ‘రివర్ బేసిన్’లో ఉన్నట్లే. మరి ఆయన తన ప్యాలె్‌సను ఖాళీ చేసేస్తారా?
‘ఆంగ్ల’ మర్మమేమిటో!?
జగన్ బుధవారం తాడేపల్లి ప్యాలె్‌సలోపల ఎంపిక చేసుకున్న మీడియాతో మాట్లాడారు. అంతా తెలుగులోనే! అది ముగిశాక... ఎన్నడూలేని విధంగా బయటకు వచ్చి కొన్ని జాతీయ మీడి యా చానళ్లతో మరోసారి మాట్లాడారు. లోపల తెలుగులో మాట్లాడిన జగన్... తన సందేశం ఎవరికో చేరాలన్న ఉద్దేశంతో కాబోలు బయట మీడియాతో ఆంగ్లంలో మాట్లాడారు. జాతీయ మీడియా ప్రతినిధులను పిలిపించుకోవడం, అమరావతి గురించి ప్రస్తావించేలా చూడటం, అంతా వ్యూహం ప్రకారమే జరిగినట్లు తెలుస్తోంది. దీని మర్మమేమిటి? ఎవరి కోసం ‘ఆంగ్లంలో’ సంకేతాలు పంపారు? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.