Share News

Neglect of Rayalaseema: సీమకు జగన్‌ సున్నం

ABN , Publish Date - Jan 14 , 2026 | 03:22 AM

చంద్రబాబు సీమ ద్రోహి’... అంటూ కొన్నాళ్లుగా జగన్‌ విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు! ఆయన హయాంలోనే పుట్టి, ఆయన హయాంలోనే కొండెక్కిన రాయలసీమ ఎత్తిపోతలను... చంద్రబాబు ఎందుకు...

Neglect of Rayalaseema: సీమకు జగన్‌ సున్నం

  • రాయలసీమ ప్రాజెక్టులపై అంతులేని నిర్లక్ష్యం

  • ఉన్న ఐదేళ్లూ వాటి పనులకు ఫుల్‌స్టాప్‌

  • కూటమి వచ్చాకే మళ్లీ ప్రాజెక్టులకు కదలిక

  • ‘శ్రీశైలం’ నిర్వహణకు పైసా ఇవ్వని జగన్‌

  • హంద్రీనీవా కాలువలో గంపెడు మట్టీ తీయలేదు

  • సొంత జిల్లాలో 10 వేల కోట్లతో శంకుస్థాపనలు

  • ఏ ఒక్కటీ మొదలు పెట్టని దైన్యం

  • అనంత, కర్నూలు జిల్లాల్లోనూ గాలికి

  • అయినా బాబు సీమ ద్రోహి అంటూ కువిమర్శలు

పులివెందుల పులి.. రాయలసీమ ముద్దుబిడ్డ... ఇవీ వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డికి ఆయన పార్టీ నేతలు పెట్టుకున్న బిరుదులు. కానీ... ఐదేళ్లు సీఎంగా ఉన్న జగన్‌ కడప జిల్లాకు, రాయలసీమ ప్రాజెక్టులకు ఏం చేశారో తెలుసా? శ్రీశైలం డ్యామ్‌ నిర్వహణకు పైసా కూడా ఇవ్వలేదు. సొంత జిల్లాలో రూ.10,388 కోట్లతో వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసినా.. ఒక్క ప్రాజెక్టు పని కూడా మొదలు పెట్టలేదు. ఇంకా ఉమ్మడి అనంతపురం, కర్నూలు జిల్లాల్లో గత టీడీపీ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులను కూడా గాలికొదిలేశారు. జగన్‌ చేసిందల్లా ఏంటంటే.. సర్వరాయసాగర్‌ నుంచి ఆయనకు చెందిన భారతీ సిమెంట్స్‌కు, ఆయన మేనమామ, కమలాపురం మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి చేపల చెరువుకు నీటిని మళ్లించడమే. జగన్‌ పాలనలో పడకేసిన ప్రాజెక్టులను ఇప్పుడు కూటమి ప్రభుత్వం పట్టాలెక్కిస్తోంది. అయినా సరే... ‘సీమ ద్రోహి చంద్రబాబు’ అని నిందించడం జగన్‌కే చెల్లింది.

(కర్నూలు-ఆంధ్రజ్యోతి)

‘చంద్రబాబు సీమ ద్రోహి’... అంటూ కొన్నాళ్లుగా జగన్‌ విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు! ఆయన హయాంలోనే పుట్టి, ఆయన హయాంలోనే కొండెక్కిన ‘రాయలసీమ ఎత్తిపోతల’ను... చంద్రబాబు ఎందుకు పూర్తి చేయడంలేదంటూ వింత వాదనలు చేస్తున్నారు. ‘రాయలసీమ అభివృద్ధి.. ప్రయోజనాలపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు చీమంతైనా చిత్తశుద్ధి లేదు’ అంటూ జగన్‌ రోత మీడియాలో కథనాలు వండి వారుస్తున్నారు. చంద్రబాబును ఇంతలా దూషిస్తున్నారంటే... రాయలసీమ ప్రాజెక్టులకు జగన్‌ ఎంత చేసి ఉంటారో! అనే సందేహం వస్తుంది కదూ!


ఒక్క ముక్కలో చెప్పాలంటే... సీమ ప్రాజెక్టులకు జగన్‌ చేసింది సున్నా! ఇప్పుడు సీమ నేలను తడుపుతున్న ప్రాజెక్టులన్నీ తెలుగుదేశం హయాంలోవే! అంతేకాదు... 2014-19 మధ్య సీమ ప్రాజెక్టులపై చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని పనులు చేయడం నిజం! సీమకు జగన్‌ చేసిందేమిటి, చంద్రబాబు చేసిందేమిటి... ప్రాజెక్టుల వారీగా చూస్తే!

‘అనంత’ ప్రాజెక్టులు...

2014-19 మధ్య అప్పటి సీఎం చంద్రబాబు అనంతపురం జిల్లాలో కరువు పల్లెలకు హంద్రీనీవా ప్రాజెక్టు ద్వారా కృష్ణా జలాలు మళ్లించి కరువు శాశ్వతంగా నివారించాలని సంకల్పించారు. రూ.900 కోట్లతో జీడిపల్లి-అప్పర్‌ పెన్నా ఎత్తిపోతల పథకం, రూ.850 కోట్లతో జీడిపల్లి-బైరవానితిప్ప ఎత్తిపోతల ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో 30-35 శాతం పనులు పూర్తి చేశారు. 2019లో ప్రభుత్వం మారడంతో పనులు ఆగిపోయాయి. జగన్‌ ఈ రెండు ప్రాజెక్టులను ఆపివేశారు. కొత్తగా శ్రీసత్యసాయి జిల్లా(పుట్టపర్తి)లో హంద్రీనీవా నుంచి 195 మైనర్‌ ఇరిగేషన్‌ (ఎంఐ) చెరువులు నింపే పనులను రూ.850 కోట్లతో చేపట్టారు. 25 శాతం పనులు చేసినా ఒక్కపైసా కూడా నిధులు ఇవ్వలేదు. కూటమి ప్రభుత్వం వచ్చాకే రూ.60 కోట్ల బిల్లులు చెల్లించారు.

కడప ప్రాజెక్టులు...

కడప జిల్లాలో అత్యంత కీలకమైన జలాశయం గండికోట. గాలేరు-నగరి ప్రాజెక్టులో భాగంగా 26.85 టీఎంసీల సామర్థ్యంతో 2004-09 మధ్యలో నిర్మించారు. అప్పటి సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ కింద రూ.1.86 లక్షలు ఇచ్చారు. 2014లో అధికారం చేపట్టిన సీఎం చంద్రబాబు ఆర్‌ అండ్‌ఆర్‌ ప్యాకేజీ రూ.6.75 లక్షలకు పెంచారు. గండికోటలో నీటి నిల్వకు అడ్డంకిగా ఉన్న కడప-అనంతపురం వయా తాడిపత్రి రోడ్డును పూర్తిగా అలైన్‌మెంట్‌ మార్చేసి కొత్త రోడ్డు నిర్మించారు. తొలిసారిగా 12 టీఎంసీలు నిల్వ చేయడంతో పాటు పులివెందులకు కృష్ణా జలాలు అందించారు. జీఎన్‌ఎస్ఎస్ ఫేజ్‌-2 పనులు కూడా మొదలు పెట్టారు.


పునాది రాళ్లకే సరి...

సీఎంగా జగన్‌ బాధ్యతలు చేపట్టాక కడప జిల్లాలో రాయలసీమ దుర్భిక్ష నివారణ మిషన్‌లో భాగంగా గాలేరు నగరి-హంద్రీనీవా లిఫ్ట్‌ స్కీమ్‌కు రూ.4,373.93 కోట్లు, ఎర్రబల్లి ఎత్తిపోతల పథకానికి రూ.853.63 కోట్లు, కుందూ-టీజీపీ లిఫ్ట్‌కు రూ.419.42 కోట్లు, పులివెందుల బ్రాంచి కెనాల్‌ (పీబీసీ), సీబీఆర్‌, జీకేఎల్‌ఐ కాలువల కింద మైక్రో ఇరిగేషన్‌ ప్రాజెక్టుకు రూ.1,256 కోట్లు, గండికోట-చిత్రావతి, గండికోట-పైడిపాలెం లిఫ్టుల సామర్థ్యం పెంపునకు రూ.2,601.28 కోట్ల వ్యయంతో.. ఇలా మొత్తం ఏడు ప్రాజెక్టులకు రూ.10,388.23 కోట్లతో శంకుస్థాపన చేశారు. కానీ ఒక్క ప్రాజెక్టు కూడా మొదలు పెట్టలేదు. రాజోలి, జొలదరాశి ప్రాజెక్టుల పరిస్థితీ ఇంతే.

ఎన్టీఆర్‌ నుంచి చంద్రబాబు దాకా...

ఏటా వందల టీఎంసీల కృష్ణా వరద జలాలు శ్రీశైలం డ్యామ్‌ దాటుకొని కడలి పాలవుతున్నాయని.. ఆ నీటిని ఒడిసి పట్టి కరువుసీమకు మళ్లిస్తే కరువు, వలసలు ఉండవని.. ఈ ప్రాంతం సస్యశామలం అవుతుందని మొట్టమొదట తలచిన వ్యక్తి ఎన్టీఆర్‌. తెలుగు గంగ, హంద్రీనీవా సుజల స్రవంతి, గాలేరు-నగరి సుజల స్రవంతి ప్రాజెక్టులకు రూపకల్పన చేసింది ఆయనే. సీమ ప్రాజెక్టుల విషయంలో మొదటి నుంచి టీడీపీ చిత్తశుద్ధితో ముందుకు వెళ్తోంది. 2004-2014మధ్యలో అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం కూడా సీమ ప్రాజెక్టులు పూర్తి చేయడంలో కృషి చేసిందని నిపుణులు అంటున్నారు. అయితే... గత జగన్‌ ప్రభుత్వం ప్రాజెక్టులను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని చెబుతున్నారు. ఉన్న ప్రాజెక్టులకు నిధులు ఇవ్వకపోగా, కొత్త ప్రాజెక్టులు చేపట్టలేదు.

జగన్‌ హయాంలో

చంద్రబాబు 12 టీఎంసీలు నింపారు.. తాను అంతకంటే ఎక్కువగా నింపాలనే అత్యుత్సాహంతో రాత్రికి రాత్రి తాళ్లప్రొద్దుటూరు గ్రామాన్ని బలవంతంగా ఖాళీ చేయించి 26 టీఎంసీలు నింపారే తప్పా.. ఆ నీటిని వినియోగించుకునే పంట కాలువలు పూర్తి చేయలేదు.


భారతీ సిమెంట్స్‌కు నీళ్లు

సర్వరాయసాగర్‌, వామికొండ జలాశయాలు గత టీడీపీ ప్రభుత్వంలోనే దాదాపుగా పూర్తయ్యాయి. పంటకాలువలు పూర్తి చేస్తే దాదాపు 45 వేల ఎకరాలకు సాగునీరు అందే అవకాశం ఉంది. జగన్‌ హయాంలో పంట కాలువలు పూర్తి చేయలేదు. కానీ... జగన్‌కు చెందిన భారతీ సిమెంట్స్‌, ఆయన మేనమామ కమలాపురం మాజీ ఎమ్మెల్యే రవీంధ్రనాథ్‌రెడ్డి చేపల చెరువుకు మాత్రమే నీటిని వాడుకుంటున్నారు.

శ్రీశైలం డ్యామ్‌ నిర్వహణ

జగన్‌ ఐదేళ్ల పాలనలో శ్రీశైలం ప్రాజెక్టు నిర్వహణను గాలికొదిలేశారు. ప్రాజెక్టు నిర్వహణ కోసం ఒక్క పైసా కూడా నిధులు ఇవ్వలేదని ఇంజనీర్లు చెబుతున్నారు. దీంతో... డ్యామ్‌ పరిస్థితి ప్రమాదకరంగా మారింది. అంతకుముందు రాష్ట్ర విభజన తరువాత శ్రీశైలం ప్రాజెక్టు నిర్వహణపై నాడు సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. 2009లో వరదకు దెబ్బతిన్న డ్యామ్‌ మరమ్మతులకు ప్రతిపాదనలు తయారు చేయించారు. మళ్లీ కూటమి ప్రభుత్వం వచ్చాక శ్రీశైలం డ్యామ్‌ శాశ్వత మరమ్మతులు, ప్రొటెక్టివ్‌ స్టీల్‌ సిలిండర్ల ఏర్పాటుకోసం రూ.203.95 కోట్లు మంజూరు చేశారు. రూ.5.9 కోట్లతో డ్యామ్‌ ఇరువైపుల కొండ రాళ్లు జారిపడకుండా షాట్‌క్రీటింగ్‌ పనులు, 2009లో వరదలకు కొట్టుకుపోయిన అప్రోచ్‌ రోడ్డు నిర్మాణం కోసం రూ.25.50 కోట్లతో పనులకు శ్రీకారం చుట్టారు. ప్రొటెక్టివ్‌ స్టీల్‌ సిలిండర్ల ఏర్పాటుకు ఇప్పటికే అధ్యయనం చేయించారు. కొత్తవి ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలు తయారు చేస్తున్నారు.


కుప్పానికి కృష్ణా జలాలు..

హంద్రీనీవా ప్రాజెక్టులో భాగంగా కుప్పం బ్రాంచి కెనాల్‌ నిర్మాణానికి రూ.413 కోట్లతో 2015లో నాటి సీఎం చంద్రబాబు అనుమతులు ఇచ్చారు. 2019 నాటికి దాదాపుగా 90-95 శాతం పనులు పూర్తి చేశారు. తరువాత వైసీపీ ప్రభుత్వం రావడంతో పనులు ఆగిపోయాయి. కుప్పం బ్రాంచి కెనాల్‌ పనుల కోసం ఒక్క పైసా కూడా ఖర్చు చేయలేదు. గత టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబు తొలిసారిగా పులివెందులకు కృష్ణా జలాలు మళ్లించిన ఘనత సొంతం చేసుకోగా.. కుప్పానికి తాను నీళ్లు ఇచ్చాననే క్రెడిట్‌ సాధించాలనే ఎత్తులు వేసి అభాసుపాలయ్యారు. మళ్లీ కూటమి ప్రభుత్వం వచ్చాక రూ.197 కోట్లతో కుప్పం బ్రాంచి కెనాల్‌ సిమెంట్‌ కాంక్రీట్‌ లైనింగ్‌ పనులు చేపట్టి యుద్ధప్రాతిపదికన పూర్తి చేశారు.

హంద్రీనీవా విస్తరణ

ఉమ్మడి కర్నూలు, అనంతపురం, చిత్తూరు, కడప జిల్లాల్లో 6.05 లక్షల ఎకరాలకు సాగునీరు, 35 లక్షల జనాభాకు తాగునీరు అందించాలనే లక్ష్యంతో హంద్రీనీవా పథకం చేపట్టారు. 2004 నుంచి పనులు జరుగుతూ....నే ఉన్నాయి. 2014లో సీఎంగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టాక 2017-18లో రూ.1,030 కోట్లతో కాలువ విస్తరణ పనులు చేపట్టారు. నాలుగు ప్యాకేజీలుగా పనులు చేపట్టి రూ.285.77 కోట్లు ఖర్చు చేశారు. తర్వాత జగన్‌ వచ్చారు. విస్తరణ పనులు ఆపేశారు. 6,500 క్యూసెక్కులకు విస్తరిస్తామంటూ 2023లో రూ.6,182.19 కోట్లతో టెండర్లు పిలిచారు. కాంట్రాక్టర్లకు పనులు అప్పగించినా పైసా కూడా ఖర్చు చేయలేదు. మళ్లీ కూటమి ప్రభుత్వం వచ్చాక దాదాపు రూ.3 వేలకోట్లతో మాల్యాల నుంచి కుప్పం వరకు కాలువ విస్తరణలో భాగంగా మట్టి, సీసీ లైనింగ్‌ పనులు పూర్తి చేశారు.


కర్నూలు ప్రాజెక్టులు

కర్నూలు జిల్లాలో కరువు, వలసలు నివారించాలనే లక్ష్యంతో ఆలూరు, ఆదోని నియోజకవర్గాల్లో 80 వేల ఎకరాలకు సాగు, 195 గ్రామాలకు తాగునీరు ఇవ్వాలని వేదావతి ఎత్తిపోతల ప్రాజెక్టుకు రూ.1,942.80 కోట్లు.. మంత్రాలయం, ఎమ్మిగనూరు, కోడుమూరు నియోజకవర్గాల్లో 40 వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు రూ.1,985.42 కోట్లు మంజూరు చేసి టెండర్లు పిలిచారు. పనులు మొదలు పెట్టారు. అలాగే గుండ్రేవుల జలాశయానికి రూ.2,950 కోట్లు కేటాయిస్తూ జీవో ఇచ్చారు. జగన్‌ ప్రభుత్వం వచ్చాక ఈ పనులన్నింటినీ ఎక్కడికక్కడే ఆ పనులు ఆపేశారు. గంపెడు మట్టి కూడా తీయలేదు. మళ్లీ కూటమి సర్కారు వచ్చాకే రూ.6,581.96 కోట్ల విలువైన వేదావతి, ఆర్డీఎస్‌ కుడి కాలువ, రాయలసీమ లిఫ్ట్‌ పనులు కొనసాగించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

Updated Date - Jan 14 , 2026 | 03:24 AM