నా దారి మావిగన్! అమరావతి నిర్మాణం సాధ్యం కాదు
ABN , Publish Date - Jun 03 , 2026 | 04:16 AM
జగన్ మరోసారి రాజధాని అమరావతిపై విషం చిమ్మారు. అమరావతి నిర్మాణమంటే రాష్ట్రానికి రాజధానే ఉండదన్నారు. ‘నా దారి మావిగన్..
ఎకరా అభివృద్ధికి 2 కోట్లు కావాలి: జగన్
వైసీపీ నేతలు తీసుకొచ్చిన అమరావతి రైతులతో భేటీ
వీరంతా భూములివ్వనివారే!
భూసమీకరణను వ్యతిరేకించినవారే
అమరావతి/గుంటూరు, జూన్ 2 (ఆంధ్రజ్యోతి): జగన్ మరోసారి రాజధాని అమరావతిపై విషం చిమ్మారు. అమరావతి నిర్మాణమంటే రాష్ట్రానికి రాజధానే ఉండదన్నారు. ‘నా దారి మావిగన్.. రాజధానిగా అమరావతి నిర్మాణం సాధ్యం కాదు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరులను కలిపి 110 కిలోమీటర్ల మేర ‘మావిగన్’ రాజధానిగా అభివృద్ధి చెందుతుంది’ అని చెప్పారు. వైసీపీ ముఖ్య నేతలు పేర్ని నాని, మురుగుడు హనుమంతరావు, నందిగం సురేశ్, లేళ్ల అప్పిరెడ్డి తీసుకొచ్చిన కొందరు ఎంపిక చేసుకున్న రైతులను మంగళవారం తాడేపల్లి ప్యాలె్‌సలో జగన్ కలిశారు. వీరంతా రాజధానికి భూసమీకరణను వ్యతిరేకించినవారు, భూములివ్వనివారే కావడం గమనార్హం. పైగా వీరంతా వైసీపీకి చెందినవారు. ఆ పార్టీ తరఫున మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లుగా పనిచేశారు. వీరిలో కొందరు స్వయం ప్రకటిత రైతు సంఘాల నేతలు కూడా. వీరిని భూములిచ్చిన రైతుల ముసుగులో తీసుకొచ్చి డ్రామా ఆడారు. ఉండవల్లి, పెనుమాక గ్రామాలకు చెందిన ఈ నేతలందరూ తాజాగా వైసీపీ నాయకుడు దొంతిరెడ్డి ఆధ్వర్యంలో జగన్ ముందుకొచ్చారు. రాజధాని కోసం భూములివ్వని రైతులపై ప్రభుత్వం దౌర్జన్యం చేస్తోందని.. తమ భూములను తవ్వేస్తున్నారని, దేవాలయ భూములను కబళిస్తున్నారని వైసీపీ నేతలు చెప్పిన మాటలను వారు ఆయన ముందు వల్లెవేశారు. ఆయన స్పందిస్తూ.. మావిగన్ ప్రస్తావన తెచ్చారు. రైతుల తరఫున ప్రభుత్వంపై పోరాటం చేస్తానని హామీ ఇవ్వలేదు. వారికి అండగా ఉంటానంటూ ముక్తసరిగా ఒక్కమాట అనేసి.. అధికారంలోకి వచ్చాక రైతుల అభిప్రాయాలకు అనుగుణంగా ముందుకు వెళ్తామని తెలిపారు. అమరావతి నిర్మాణం కోసం ఎకరాకు రెండు కోట్ల రూపాయలు ఖర్చవుతుందని.. దానిని నిర్మిస్తామంటే చివరకు రాష్ట్రానికి రాజధాని లేకుండా పోతుందని చెప్పారు. తాను అధికారంలోకి వచ్చాక అమరావతి పనులు నిలిపేసి.. మావిగన్‌ను అభివృద్ధి చేస్తానన్నారు. ‘మూడు రాజధానుల’ పేరుతో మూడుముక్కలాటలాడి.. భూములిచ్చిన రైతులను వేదనపాలు చేసి, అమరావతి రైతులను, మహిళలను బూట్ల కాళ్లతో తొక్కి, లాఠీలతో తలలు పగలగొట్టి, మహిళల పొత్తికడుపులో బూటు కాళ్లతో తన్ని, పెయిడ్ ఆర్టిస్టులని అవమానకరంగా మాట్లాడి, ఇళ్లపైకి డ్రోన్లు పంపి అనైతికంగా హింసించిన వైసీపీ నాయకత్వం.. ఇప్పుడు ‘అమరావతి రైతుల కోసం’ అంటూ మొసలి కన్నీరు కారుస్తోందని రాజధాని రైతులు మండిపడుతున్నారు.