Share News

నేను మంచోడిని!

ABN , Publish Date - May 22 , 2026 | 04:02 AM

‘నేను చాలా మంచోడిని’ అని వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ తనకు తాను సర్టిఫికెట్‌ ఇచ్చుకున్నారు. ‘మా తాత రాజారెడ్డిని చంపిన వాళ్లను ఏమీ చేయనని భరోసా ఇస్తున్నా’ అంటూ వరం ప్రసాదించారు.

నేను మంచోడిని!

  • గంజాయి వనంలో తులసిమొక్కను

  • విశ్వసనీయతతో రాజకీయాలు చేస్తున్నా

  • హత్యలు, కుట్రలతో చంద్రబాబు రాజకీయాలు.. వైఎస్‌ మరణం ఇప్పటికీ మిస్టరీనే

  • మా తాత, తండ్రి హత్యల్లో వేళ్లన్నీ చంద్రబాబు వైపే చూపిస్తున్నాయి

  • అనుకూల మీడియా ముందు జగన్‌ ప్రసంగం

గుండె ఆగి చస్తాడేమో!

‘‘నేను ప్రతిపాదించిన ‘మావిగన్‌’ పేరు వింటే సీఎం చంద్రబాబు నిద్రలోనే గుండె ఆగి చస్తాడేమో! మీరు (విలేకరులు) మావిగన్‌ అని ఆయన ముందు అని చూడండి. ఆయన గుండె ఆగిపోలేదంటే అదృష్టమే! మావిగన్‌కు ప్రజల మద్దతు పెరుగుతుంటే ఆయనకు బీపీ పెరుగుతోంది. ఆయనకు ఇప్పటికే 76 ఏళ్లు. వచ్చే ఎన్నికల సమయానికి 80 ఏళ్లు వచ్చేస్తాయి. బహుశా మొన్నటివే చివరి ఎన్నికలు కావొచ్చు’’

- వైఎస్‌ జగన్‌

అమరావతి, మే 21 (ఆంధ్రజ్యోతి): ‘నేను చాలా మంచోడిని’ అని వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ తనకు తాను సర్టిఫికెట్‌ ఇచ్చుకున్నారు. ‘మా తాత రాజారెడ్డిని చంపిన వాళ్లను ఏమీ చేయనని భరోసా ఇస్తున్నా’ అంటూ వరం ప్రసాదించారు. చాన్నాళ్ల తర్వాత జగన్‌ గురువారం తాడేపల్లి ప్యాలె్‌సలో తాను ఎంచుకున్న, ఎదురు ప్రశ్నించకుండా చెప్పింది వినే మీడియాతో సుదీర్ఘంగా మాట్లాడారు. ‘నేను మంచోడిని. చంద్రబాబు చెడ్డోడు’ అనేలా ఉపన్యాసం చేశారు. తాత వైఎస్‌ రాజారెడ్డి, తండ్రి రాజశేఖర రెడ్డి, పినతండ్రి వైఎస్‌ వివేకా మరణాలకూ చంద్రబాబుతో ముడిపెట్టారు. ‘‘నేను మంచోడిని కాబట్టే మా తాతను చంపినవారు గుండెలపై చేయివేసుకుని నిద్రపోతున్నారు. నేను చెడ్డోడిని అయితే వాళ్లు బతికి ఉండే వాళ్లా? వారిని ఏమీ చేయనని భరోసా ఇస్తున్నాను. గంజాయివనంలాంటి రాజకీయాల్లో నేను తులసి మొక్కను. చంద్రబాబు హత్యలు, కుట్రలతో రాజకీయాలు చేస్తుంటే.. నేను విశ్వసనీయతతో రాజకీయం చేస్తున్నా. దీనికి గర్వపడుతున్నా’’ అని అన్నారు. తన తండ్రి రాజకీయాలు నేర్పించారని, హత్యా రాజకీయాలు నేర్పించలేదని చెప్పుకొచ్చారు.


వైఎస్‌ మరణం మిస్టరీ...

వైసీపీని గొడ్డలి పార్టీ అని అంటున్న చంద్రబాబు, లోకేశ్‌పై జగన్‌ మండిపడ్డారు. ‘‘ఎవరిదయ్యా గొడ్డలి పార్టీ.. ఎవరిదయ్యా హత్యా రాజకీయాల కల్చర్‌? మా కుటుంబంలో తాతగారు, నాన్నగారు, చిన్నాన్నగారు బలైపోయారు. నువ్వు అసెంబ్లీకి ఎలా వస్తావో చూస్తానంటూ చంద్రబాబు బెదిరించిన రెండ్రోజులకే వైఎస్‌ హెలికాప్టర్‌ ప్రమాదంలో చనిపోయారు. ఇప్పటికీ ఇది మిస్టరీగానే ఉంది. చిన్నాన్న వివేకాను నేనే చంపానంటూ చెలరేగిపోయిన దస్తగిరి విచ్చలవిడిగా కారులో తిరుగుతున్నాడు. అతడిని అరెస్టు చేయడం లేదు. వంగవీటి రంగా ఎలా చనిపోయారు? ఈ హత్యల్లో వేళ్లన్నీ చంద్రబాబువైపే చూపిస్తున్నాయి. కుట్రలు, గొడ్డళ్లు, గునపాలు ఎవరికి అవసరమో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. చంద్రబాబుకు ఇబ్బంది కలిగితే.. హత్యా రాజకీయాలు చేస్తాడు’’ అని జగన్‌ ఆరోపించారు.

అమరావతిని ఆపేయాలి...

ఓపక్క చంద్రబాబు రాష్ట్రానికి రాజధాని లేకుండా చేస్తున్నారంటూనే.. అమరావతిలో నిర్మాణాలను నిలిపివేయాలని జగన్‌ డిమాండ్‌ చేశారు. రూ.2 లక్షల కోట్లు ఖర్చుచేసినా అది పూర్తికాదన్నారు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరులో రాజధాని నగరం (మావిగన్‌) నిర్మించాలన్నారు. అమరావతిలో ఇప్పటికే నిర్మించిన అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టులను మళ్లీ నిర్మించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. జగన్‌పై చర్యలు తీసుకోలేమని పవన్‌ కల్యాణ్‌తో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా చెప్పినట్లుగా ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌ చేసిన వ్యాఖ్యలను ఒక విలేకరి ప్రస్తావించగా.. తన గురించి తెలిసిన ఎవరైనా అలాగే అంటారని ఆయన బదులిచ్చారు.

పోలీసులకు మళ్లీ అదే హెచ్చరిక..

రాష్ట్రంలో జంగిల్‌రాజ్‌ నడుస్తోందని.. పోలీసు వ్యవస్థ పనిచేయడం లేదని జగన్‌ ఆరోపించారు. చంద్రబాబుకు వత్తాసు పలుకుతూ దొంగ కేసులు పెడుతున్న పోలీసు అధికారులను.. ఎక్కడున్నా, సప్తసముద్రాల అవతల ఉన్నా.. రిటైరైనా వదలబోమని మరోసారి హెచ్చరించారు. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గిస్తానని హామీ ఇచ్చిన చంద్రబాబు.. ఇప్పుడు భారీగా పెంచేశాడన్నారు.

Updated Date - May 22 , 2026 | 04:06 AM