సాయికృష్ణ కేసును సీబీఐకి అప్పగించాలి!
ABN , Publish Date - Jun 19 , 2026 | 05:13 AM
గాదె సాయికృష్ణ కేసును ప్రభుత్వం సీబీఐకి అప్పగించాలని వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. ‘తప్పు చేయకపోతే సీఐ నాగరాజును ఎందుకు సస్పెండ్ చేశారు?
డీజీపీ, సీపీ, ఏసీపీ అందరూ భాగస్వాములే : జగన్
సాయికృష్ణ తల్లి, కుటుంబ సభ్యులకు పరామర్శ
విజయవాడ, జూన్ 18 (ఆంధ్రజ్యోతి): గాదె సాయికృష్ణ కేసును ప్రభుత్వం సీబీఐకి అప్పగించాలని వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. ‘తప్పు చేయకపోతే సీఐ నాగరాజును ఎందుకు సస్పెండ్ చేశారు? సీబీఐ విచారణతోనే బాధ్యులందరిపై చర్యలు తీసుకోవడం సాధ్యమవుతుంది’ అని అన్నారు. గురువారం సాయంత్రం సాయికృష్ణ కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. అతడి తల్లి విజయలక్ష్మిని ఓదార్చారు. హైకోర్టు న్యాయవాది అయిన సాయికృష్ణ పిన్ని కనకదుర్గ.. ఘటన వివరాలను ఆయనకు తెలియజేశారు. అన్ని విధాలా అండగా ఉంటామని వారికి ఆయన హామీ ఇచ్చారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. సీఎం చంద్రబాబు ప్రోత్సహిస్తున్న కొంతమంది పోలీసుల వల్ల ప్రజలు పోలీసు స్టేషన్లకు వెళ్లడానికి భయపడుతున్నారని అన్నారు. విజయవాడ పోలీసు కమిషనర్, డీసీపీ, సీఐతోపాటు డీజీపీకి సైతం ఈ ఘటనలో ప్రమేయం ఉందని ఆరోపించారు. వీరిని చంద్రబాబు ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. రోదిస్తున్న తల్లిని పోలీసుస్టేషన్‌కు పిలిచి మరీ ‘నీ కొడుకు ఫొటోకు దండ వేసుకో’ అని సీఐ హేళనగా మాట్లాడడం అమానవీయమని.. అన్నారు. సాయికృష్ణను కోర్టులో హాజరుపరచాలని న్యాయమూర్తి ఆదేశించిన తర్వాత గత్యంతరం లేక సీఐని సస్పెండ్ చేశారని ఆరోపించారు. సాయికృష్ణ తల్లి న్యాయపోరాటంలో వైసీపీ సంపూర్ణ మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు.