Share News

నా ధైర్యం.. నా బలం మీరే

ABN , Publish Date - Mar 13 , 2026 | 05:33 AM

‘నా దైర్యం ... నా బలం మీరే’ అని కార్యకర్తలను ఉద్దేశించి వైసీసీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అన్నారు. వైసీపీ 16వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ...

నా ధైర్యం.. నా బలం మీరే

  • వైసీపీ ఆవివర్భావ దినోత్సవ వేళ కార్యకర్తలతో జగన్‌

అమరావతి, మార్చి 12(ఆంధ్రజ్యోతి): ‘నా దైర్యం ... నా బలం మీరే’ అని కార్యకర్తలను ఉద్దేశించి వైసీసీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అన్నారు. వైసీపీ 16వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తాడేపల్లి ప్యాలెస్‌లో గురువారం పార్టీ నేతలు, కార్యకర్తల సమక్షంలో పార్టీ జెండాను ఎగుర వేశారు. అనంతరం మాట్లాడుతూ.. ‘నాన్న ఆశయసాధన కోసం స్థాపించిన వైసీపీని, నన్ను కార్యకర్తలు గుండెల్లో పెట్టుకున్నారు. భుజాలపై మోస్తున్నారు. కష్టకాలంలో వెనక్కి తగ్గకుండా పార్టీ కోసం నిలబడుతున్నారు. పార్టీపైనా, తనపైనా నమ్మకం ఉంచారు. 2011 మార్చి 12న నల్లకాలువలో ఇచ్చిన ఒక మాట.. పార్టీ స్థాపనకూ, ఎదుగుదలకు కారణమైంది. ఆ ఒక్కమాటా తన కుటుంబ పరిస్థితులనూ, రాష్ట్ర దశ దిశనూ మార్చింది. వైసీపీ ఒక్క జగన్‌ది కాదు. కొన్ని కోట్ల మంది కార్యకర్తలది. రాష్ట్రంలోనూ.. కేంద్రంలోనూ కాంగ్రెస్‌ పార్టీ బలంగా ఉన్న సమయంలో వైసీపీ పుట్టింది. తాను నమ్ముకున్న దేవుడు, ప్రజ లు తనను నడిపించారు. వైఎ్‌సఆర్‌నూ,వైసీపీని ప్రేమించే ప్రతి గుండెకూ శుభాకాంక్షలు చెబుతున్నా’ అని అన్నారు.


అట్టహాసమూ లేదు.. ఆనందమూ లేదు

సహజంగా రాజకీయ పక్షాలకు పార్టీ ఆవిర్భావ దినోత్సవం పుట్టిన రోజులాంటిది. అధికారంలో ఉన్నా.. లేకపోయినా.. ఈ వేడుకను పార్టీలు అట్టహాసంగా జరుపుకొంటాయి. కానీ తాడేపల్లి ప్యాలె్‌సలో గురువారం జరిగిన వైసీపీ ఆవిర్భావ దినోత్సవం కొద్దిమంది నాయకులు, ఎమ్మెల్సీలు, కార్యకర్తల మధ్య సాదాసీదాగా జరుపుకొన్నారు. నలుగురు మీడియా ప్రతినిధులతో ప్రెస్‌కాన్ఫరెన్సు నిర్వహిస్తేనే రెండు మూడు గంటలపాటు ఏకబిగిన మాట్లాడే జగన్‌.. ఆవిర్భావ దినోత్సవాన్ని పట్టుమని పదిహేను నిమిషాల్లో ముగించేశారు. జెండా ఎగుర వేశాక.. ఐదు నిమిషాల్లోపే తన ప్రసంగాన్ని ముగించేశారు. పార్టీ భవిష్యత్తు గురించి జగన్‌ ప్రకటన చేస్తారని పార్టీ ముఖ్యనేతలు ఆశించినా.. వాటికి తావివ్వకుండానే జగన్‌ ప్రసంగాన్ని ముగించి, ప్యాలెస్‌లోకి వెళ్లిపోయారు.

Updated Date - Mar 13 , 2026 | 05:34 AM