Share News

పూటకో మాట!

ABN , Publish Date - Jul 02 , 2026 | 03:45 AM

రాష్ట్రానికి మూడు రాజధానులు ఉండాలి. విశాఖను పరిపాలనా రాజధానిని చేస్తాం. నేను విశాఖలోనే కాపురం పెడతా’.. 2019-2024లో ముఖ్యమంత్రి హోదాలో జగన్‌ చెప్పిన మాట ఇది.

పూటకో మాట!

  • రాజధానిపై జగన్‌ విన్యాసాలు

  • 2019లో అమరావతికి మద్దతు

  • అధికారంలోకి వచ్చాక మాట మడత

  • మూడు రాజధానులంటూ ప్రకటన

  • 2024లో ఓడిపోయాక మళ్లీ యూటర్న్‌

  • ‘మావిగన్‌’ అంటూ ఇప్పుడు కొత్త పాట

  • అమరావతిని విచ్ఛిన్నం చేయడమే లక్ష్యం

  • ఐదేళ్లకోసారి మాట మార్చడమే పార్టీ విధానమా అంటూ జనం మండిపాటు

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

‘రాజధాని నగరంగా అమరావతిని కొనసాగిస్తా’.. 2019 ఎన్నికల సమయంలో ప్రతిపక్షనేతగా జగన్‌ చేసిన ప్రకటన ఇది.

‘రాష్ట్రానికి మూడు రాజధానులు ఉండాలి. విశాఖను పరిపాలనా రాజధానిని చేస్తాం. నేను విశాఖలోనే కాపురం పెడతా’.. 2019-2024లో ముఖ్యమంత్రి హోదాలో జగన్‌ చెప్పిన మాట ఇది.

‘2029లో మావిగన్‌ అజెండాతో బరిలో దిగుతా. మ్యానిఫెస్టోలోనూ రాజధానిగా మావిగన్‌(మచిలీపట్నం-విజయవాడ-గుంటూరు)ను చేరుస్తాం’.. 2024లో చిత్తుగా ఓడిపోయాక తాజాగా జగన్‌ చేసిన ప్రకటన ఇది.

ఇలా పూటకో మాట..! ప్రతి ఐదేళ్లకోసారి రాజధాని విషయంలో కుప్పిగంతులు..! ‘మాట తప్పను.. మడమ తిప్పను’ అని గొప్పగా చెప్పుకొనే జగన్‌ రాజధానిపై చేస్తున్న ప్రకటనలపై సామాన్యులే కాదు ఆయన పార్టీ కార్యకర్తలు, నాయకులు సైతం విస్తుపోతున్నారు. ఐదేళ్లకోసారి మాట మార్చడం, అయోమయం సృష్టించడంపై సొంత పార్టీ క్యాడర్‌ భగ్గుమంటున్నారు. రాజధానిపై ఓ విధానమంటూ లేకుండా ఎన్నికలయ్యాక నాలుక మడతేయడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ అరాచక పాలనపై కన్నెర్ర చేసిన ప్రజలు 2024 ఎన్నికల్లో ప్రతిపక్ష హోదా కూడా దక్కనీయకుండా కేవలం 11 అసెంబ్లీ స్థానాలకే పరిమితం చేశారు. రాజధాని నగరంగా వ్యతిరేకించిన అమరావతిలోనూ, పరిపాలనా రాజధానిగా ప్రకటించిన విశాఖపట్నంలోనూ వైసీపీని చిత్తుచిత్తుగా ఓడించారు. అంతేకాదు మూడు ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి. అయినా జగన్‌ తీరులో మార్పు రావడం లేదని సొంత పార్టీ శ్రేణులు విమర్శిస్తున్నారు. జగన్‌ అడ్డగోలు నిర్ణయాల వల్ల తమ రాజకీయ భవిష్యత్తు భూస్థాపితమైపోతోందంటూ వైసీపీ నేతలు ఆక్రోశం వ్యక్తం చేస్తున్నారు.


2019కి ముందు.. ఆ తర్వాత

రాజధానిగా అమరావతిని కొనసాగిస్తానంటూ 2019 ఎన్నికల సమయంలోను, అంతకుముందు రాష్ట్ర ప్రజలను నమ్మించి జగన్‌ అధికారంలోకి వచ్చారు. పాలనా పగ్గాలు చేపట్టిన వెంటనే రాజధానిపై విషం కక్కడం ప్రారంభించారు. 2014-19 మధ్యకాలంలో రాజధాని ప్రాంతంలో చేపట్టిన అభివృద్ధిని విధ్వంసం చేశారు. నిర్మాణాలను ఎక్కడికక్కడ ఆపేశారు. రాజధాని రైతులను తీవ్రంగా వేధించారు. అభివృద్ధి వికేంద్రీకరణ పేరిట మూడు రాజధానులంటూ ప్రకటించారు. శాసన రాజధానిగా అమరావతి, న్యాయరాజధానిగా కర్నూలు, పరిపాలనా రాజధానిగా విశాఖపట్నం ఏర్పాటు చేస్తామని చెప్పారు. కోస్తాంధ్ర, రాయలసీమ, ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతాయంటూ ప్రజలను మభ్యపెట్టాలని చూశారు. శాసనసభలో మూడు రాజధానుల పేరిట బిల్లును కూడా ప్రవేశ పెట్టారు. శాసనమండలిలో సంఖ్యాబలం లేకపోవడంతో మూడు రాజధానుల బిల్లు వీగిపోయింది. విశాఖ రుషికొండలో సొంతానికి వందల కోట్లతో ప్యాలెస్‌ కట్టుకున్నారు. గత ఎన్నికల్లో జగన్‌ ఓటమికి రాజధాని అంశం కూడా ఓ కారణమైంది.

జగన్‌ టార్గెట్‌ అమరావతి

కూటమి ప్రభుత్వం వచ్చాక అమరావతి పనులను మళ్లీ పట్టాలెక్కించింది. 2028 నాటికి అభివృద్ధి పనులు పూర్తి చేయాలన్న లక్ష్యంతో పనులు వేగవంతం చేసింది. అమరావతిని రాజధానిగా గుర్తిస్తూ ఇటీవల కేంద్రం గెజిట్‌ విడుదల చేసింది. దీంతో శాశ్వతంగా అమరావతే రాజధాని అనే విశ్వాసం అందరిలో ఏర్పడింది. పెట్టుబడిదారుల్లోనూ నమ్మకం పెరిగింది. ఈ నేపథ్యంలో అమరావతిపై జగన్‌ మళ్లీ కుట్రలు ప్రారంభించారు. తాను అధికారంలో ఉన్నప్పుడు రైతులను తీవ్రంగా వేధించిన జగన్‌.. ఎవరూ ఆహ్వానించకపోయినా రాజధాని రైతుల పరిరక్షణ కమిటీ పేరిట అమరావతిపైకి వైసీపీ నేతలను దండయాత్రకు పంపారు. రైతులు తిరగబడంతో అక్కడి నుంచి వారు వెనుదిరిగి రాకతప్పలేదు. ప్రస్తుతం రాజధాని ప్రాంతంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలన్నీ అడ్డుకోవడం.. ఆ ప్రాంతంలో భూముల ధరలు పడిపోయేలా చేయడం.. కొత్తగా పెట్టుబడులు రాకుండా అయోమయం సృష్టించడం.. రాజధాని అమరావతిపై గందరగోళం ఏర్పడేలా చేయడం లక్ష్యంగా జగన్‌ కుట్రలు చేస్తున్నారని విమర్శిస్తున్నారు. మూడు రాజధానులపైనా మాట మార్చిన జగన్‌.. ఆ మధ్య మావిగన్‌ అంటూ కొత్తగా ప్రకటించారు. దీనిపై సొంత పార్టీ నేతల్లోనే వ్యతిరేకత వచ్చింది. అయినా వైఖరి మారలేదు. మావిగన్‌ తమ అజెండా అంటూ తాజాగా ప్రకటించారు. అయితే జగన్‌ చేసిన మావిగన్‌ ప్రతిపాదనపై సొంత పార్టీ నేతలే మండిపడుతున్నారు. ప్రతి ఎన్నికకూ రాజధానిపై అజెండా మార్చేస్తే జనం ఎలా నమ్ముతారని ప్రశ్నిస్తున్నారు. అమరావతిని విచ్ఛిన్నం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారా అని మండిపడుతున్నారు. ఇలాగైతే వచ్చే ఎన్నికల్లోనూ మూల్యం చెల్లించుకోకతప్పదని వాపోతున్నారు. జగన్‌ ప్రకటన వైసీపీకి బూమ్‌రాంగ్‌ అయిందని ఆ పార్టీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Jul 02 , 2026 | 03:45 AM