Share News

‘ప్రశ్న రావణ్‌’ అరెస్టు

ABN , Publish Date - Jul 02 , 2026 | 03:55 AM

ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్‌ బచ్చలకూరి జోసెఫ్‌ అలియాస్‌ ప్రశ్న రావణ్‌ను కాకినాడ జిల్లా పిఠాపురం పోలీసులు...

‘ప్రశ్న రావణ్‌’ అరెస్టు

  • డిప్యూటీ సీఎంపై అనుచిత వ్యాఖ్యల కేసు

  • హైదరాబాద్‌ నుంచి తీసుకొచ్చి పిఠాపురం మేజిస్ర్టేట్‌ ఎదుట హాజరుపర్చిన పోలీసులు

  • ష్యూరిటీ బాండ్లపై బెయిల్‌ మంజూరు.. మరో కేసులో వెంటనే అదుపులోకి..

పిఠాపురం, జూలై1(ఆంధ్రజ్యోతి): ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్‌ బచ్చలకూరి జోసెఫ్‌ అలియాస్‌ ప్రశ్న రావణ్‌ను కాకినాడ జిల్లా పిఠాపురం పోలీసులు అరెస్టు చేశారు. విచారణ అనంతరం రాత్రి పిఠా పురంలో మెజిస్ర్టేట్‌ వద్ద హాజరుపరచగా, పూచీ కత్తుపై బెయిల్‌ మంజూరు చేశారు. అయితే మరో కేసులో అతడిని వెంటనే సర్పవరం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాలివీ.. ఏలూరులో గత నెల 28న జరిగిన దళిత క్రైస్తవ సమర శంఖారావం సభలో..పవన్‌ కల్యాణ్‌, ముఖ్యమంత్రి చంద్రబాబు, రాధా మనోహర్‌దా్‌సలపై రావణ్‌ అనుచిత వ్యాఖ్యలు చేయడంతో .. పవన్‌ను వ్యక్తిగతంగా దూషించాడని, అతడిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పిఠాపురానికి చెందిన జనసేన నాయకుడు బొజ్జా కుమార్‌ ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు మంగళవారం రాత్రి హైదరాబాద్‌ వెళ్లి జోసెఫ్‌ను అదుపులోకి తీసుకున్నారు. బుధవారం పిఠాపురం పోలీసు స్టేషన్‌కు తీసుకొచ్చి పెద్దాపురం, పిఠాపురం సీఐలు వైఆర్‌కే శ్రీనివాస్‌, జి.శ్రీనివాస్‌ రోజంతా అతడిని విచారించారు. విషయం తెలుసుకుని పలువురు వైసీపీ, క్రైస్తవ దళిత సంఘాల నేతలు, జై భీమ్‌ భారత్‌ పార్టీ నేతలు ఆయనకు మద్దతుగా వచ్చి స్టేషన్‌ వద్ద గుమిగూడారు. ఆ సందర్భంగా మీడియా ఎదుట పవన్‌కల్యాణ్‌ను కొందరు దూషించారు. విషయం తెలుసుకున్న జనసేన నేతలు పెద్దఎత్తున స్టేషన్‌కు చేరుకున్నారు. రావణ్‌తోపాటు, పవన్‌పై విమర్శలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఉద్రిక్తత వాతావరణం నెలకొనడంతో పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు.

మరో కేసులో అదుపులోకి..

ప్రశ్న రావణ్‌ను పిఠాపురం పోలీసు స్టేషన్లో సీఐ శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో సుదీర్ఘంగా ప్రశ్నించినా అతడు విచారణకు సహకరించలేదని సమాచారం. మీరు ఎంత ఇబ్బంది పెట్టినా నేను చెప్పేది ఏమీ లేదని, ఏదైనా ఉంటే యూట్యూబ్‌లోనే చెబుతా అని నిర్లక్ష్యంగా సమాధానమిచ్చినట్లు తెలిసింది. అనంతరం ప్రశ్న రావణ్‌ను రాత్రి 9.30 గంటల సమయంలో పిఠాపురంలో మేజిస్ట్రేట్‌ ఎదుట హారుపరిచారు. సుమారు రెండున్నర గంటల వాదనల తర్వాత అతడికి బెయిల్‌ మంజూరు చేస్తూ మేజిస్ర్టేట్‌ తీర్పు చెప్పారు. ష్యూరిటీ బాండ్లు సమర్పించాలని ఆదేశించారు. అయితే, 2025లో నమోదైన మరో కేసులో రావణ్‌ను కాకినాడ సర్పవరం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.


నన్ను లిల్లీపుట్‌ అన్నందునే.. : జడ శ్రావణ్‌

రావణ్‌ను మేజిస్ర్టేట్‌ ఎదుట హాజరుపరిచే సమయానికి అక్కడికి జైభీమ్‌ పార్టీ అధ్యక్షుడు జడ శ్రావణ్‌ వచ్చారు. మీడియాతో మాట్లాడుతూ.. ‘పవన్‌ కల్యాణ్‌ గతంలో చేసిన వ్యాఖ్యలను స్ఫూర్తిగా తీసుకుని రావణ్‌ మాట్లాడితే అతడిని అరెస్టు చేస్తారా? నన్ను లిల్లీపుట్‌ అని అన్నందునే రఘురామను .. నిన్ను కోస్తే మూడూళ్లకు సరిపోతావ్‌ అన్నాను. ఇందులో తప్పేముంది. వారికో న్యాయం.. మాకో న్యాయమా?’ అని అన్నారు.

బొజ్జా ఐశ్వర్య ఇంటి వద్ద వీర మహిళల నిరసన

యూ ట్యూబర్‌ రావణ్‌కు సంఘీభావంగా పిఠాపురం వెళ్లి పవన్‌కల్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బొజ్జా ఐశ్వర్య వెంటనే తమ నాయకుడికి క్షమాపణలు చెప్పాలని జనసేన వీర మహిళలు డిమాండ్‌ చేశారు. కాకినాడ రామారావుపేట పోలీసు డీఎస్పీ కార్యాలయం సమీపంలో ఐశ్వర్య ఇంటి వద్ద బుధవారం రాత్రి వారు ఆందోళన చేశారు. టూటౌన్‌ పోలీసులు అక్కడికి చేరుకుని వారిని నిలువరించారు. తమకు ఫిర్యాదు చేయాలని సూచించారు. మరోవైపు ఐశ్వర్య తనకు రక్షణ కల్పించాలని సోషల్‌ మీడియా వేదికగా జిల్లా ఎస్పీని కోరారు.

Updated Date - Jul 02 , 2026 | 03:55 AM