పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు.. రావణ్‌పై ‘ఉపా’ కేసు!
ABN , Publish Date - Jul 06 , 2026 | 04:46 AM
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై యూట్యూబ్‌లో దూషించడంతో పాటు ఏలూరులో జరిగిన సభలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ ప్రశ్న రావణ్‌పై ఫిర్యాదులు..
ఐదోసారి యూట్యూబర్ అరెస్టు
18 వరకు జ్యుడీషియల్ రిమాండ్
నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలింపు
అనకాపల్లి జిల్లా వేంపాడు టోల్‌ప్లాజా వద్ద అదుపులోకి తీసుకున్న గన్నవరం పోలీసులు
విజయవాడ/గన్నవరం, జూలై 5 (ఆంధ్రజ్యోతి): డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై యూట్యూబ్‌లో దూషించడంతో పాటు ఏలూరులో జరిగిన సభలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ ప్రశ్న రావణ్‌పై ఫిర్యాదులు, అరెస్టులు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు నాలుగు సార్లు అరెస్టు చేయగా.. కోర్టులు బెయిల్ మంజూరుచేశాయి. తాజాగా ఆయన్ను ఐదోసారి కూడా పోలీసులు అరెస్టు చేశారు. ఈసారి చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (యూఏపీఏ-ఉపా) కింద కూడా కేసు నమోదు చేశారు. కోర్టు ఆయనకు ఈ నెల 18 వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. పవన్ కల్యాణ్‌పై రావణ్ అసభ్య దూషణలు చేశారంటూ రోడ్డు డెవల్‌పమెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ గరికపాటి శివశంకర్ కృష్ణా జిల్లా గన్నవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై వారు ఎఫ్‌ఐఆర్ (క్రైం నెంబరు 188/2026) నమోదుచేశారు. రావణ్‌పై బీఎన్‌ఎస్ 147, 148, 192, 197(1)(డీ), 353(1) సెక్షన్లతో పాటు ఉపా చట్టంలోని సెక్షన్లు 13, 39 కింద అభియోగాలు మోపారు. శనివారం సాయంత్రం ఆయన్ను అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం వేంపాడు టోల్‌ప్లాజా వద్ద అదుపులోకి తీసుకుని.. రోడ్డుమార్గాన ఆదివారం గన్నవరానికి తీసుకొచ్చారు. అరెస్టు సమాచారాన్ని ఆయన సతీమణి అనూషకు తెలియజేశారు. గన్నవరం సామాజిక ఆరోగ్య కేంద్రంలో రావణ్‌కు వైద్య పరీక్షలు చేయించారు. అనంతరం పోలీసు స్టేషన్‌లో సాయంత్రం వరకు విచారించి.. అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో హాజరుపరిచారు.
ప్రతి వీడియోలో విద్వేష ప్రసంగమే
ప్రశ్న పేరుతో రావణ్ చేసిన ప్రతి వీడియోలోనూ విద్వేష ప్రసంగం ఉందని పోలీసుల తరఫు న్యాయవాది, డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్ (డీవోపీ) బైరా రామకోటేశ్వరరావు తెలిపారు. ఆదివారం రాత్రి కోర్టులో సుదీర్ఘంగా విచారణ జరిగింది. రావణ్ ఇప్పటి వరకు 5,100 వీడియోలను తన యూట్యూబ్ చానల్‌లో పోస్టు చేశారని.. మావోయిస్టు నేతలు హిడ్మా, కె.సాంబయ్యను ఎన్‌కౌంటర్ చేసిన తర్వాత యువతను, విద్యార్థులను రెచ్చగొట్టేలా చేసిన వ్యాఖ్యల వీడియోలు కూడా వాటిలో ఉన్నాయని డీవోపీ పేర్కొన్నారు. వారిద్దరూ చనిపోయినా మరింత మంది హిడ్మాలు, సాంబయ్యలు పుడతారని విశ్లేషణ చేశాడని.. రావణ్ చానల్‌కు 2 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారని, వారిలో 28వేల మంది ఈ వీడియోలను వీక్షించారని తెలిపారు. గన్నవరంలో నమోదైన కేసుకు, కాకినాడ జిల్లా సర్పవరం, పిఠాపురంలో నమోదైన కేసులకు సంబంధం లేదన్నారు. ఆ వీడియోలన్నీ ఏఐ సృష్టేనని రావణ్ తరఫు న్యాయవాది జడ శ్రవణ్‌కుమార్ అన్నారు. వాదనల అనంతరం రావణ్‌కు ఈ నెల 19 వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తూ న్యాయాధికారి గాయత్రి ఉత్తర్వులు జారీచేశారు. పోలీసులు ఆయన్ను నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించారు.
భారీ బందోబస్తు
రావణ్‌ను పిఠాపురం, కాకినాడ, మచిలీపట్నంలో అరెస్టు చేసినప్పుడు జనసేన నాయకులు, కార్యకర్తలు భారీసంఖ్యలో స్టేషన్ల వద్దకు చేరుకున్నారు. దీంతో గన్నవరంలో పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. కోర్టులోకి న్యాయవాదులు తప్ప ఇతరులెవరూ వెళ్లకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. రావణ్‌ను తీసుకొచ్చారన్న సమాచారంతో వైసీపీ, భారత్ జై భీం పార్టీల నాయకులు, కార్యకర్తలు హల్‌చల్ చేశారు. వైసీపీ నేతలు స్టేషన్ వద్ద ఆందోళన చేయాలని భావించగా.. పోలీసులు అడ్డుకున్నారు.
రావణ్‌పై సాలూరు, పాలకొండల్లోనూ ఫిర్యాదు
పాలకొండ/సాలూరు: పవన్ కల్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన రావణ్‌పై పార్వతీపురం మన్యంజిల్లా పాలకొండ పట్టణ జనసేన నాయకుడు కొండదాడి రాజేశ్ ఆధ్వర్యంలో ఆ పార్టీ నేతలు పోలీసు స్టేషన్‌లో ఆదివారం ఫిర్యాదు చేశారు. ఇదే జిల్లా సాలూరులో పట్టణ, రూరల్ పోలీస్ స్టేషన్లలో జనసేన, హైందవ ధర్మసేన నాయకులు ఫిర్యాదు చేశారు.