Share News

Youth Attack: ఘంటసాల పోలీస్ స్టేషన్‌పై యువకుల దౌర్జన్యం

ABN , Publish Date - Jan 15 , 2026 | 03:38 AM

కర్రీ పాయింట్‌ దగ్గర మొదలైన గొడవ పోలీస్ స్టేషన్‌పై దౌర్జన్యం చేసేవరకూ వెళ్లింది. కృష్ణా జిల్లా, ఘంటసాలలోని అంబేడ్కర్‌ నగర్‌కు...

Youth Attack: ఘంటసాల పోలీస్ స్టేషన్‌పై యువకుల దౌర్జన్యం

  • ఎస్‌ఐతో పాటు సిబ్బందిపై దూషణలు.. దాడి

  • పోలీసుల అదుపులో నలుగురు, మరో ముగ్గురు పరార్‌

ఘంటసాల, జనవరి 14 (ఆంధ్రజ్యోతి): కర్రీ పాయింట్‌ దగ్గర మొదలైన గొడవ పోలీస్ స్టేషన్‌పై దౌర్జన్యం చేసేవరకూ వెళ్లింది. కృష్ణా జిల్లా, ఘంటసాలలోని అంబేడ్కర్‌ నగర్‌కు చెందిన ఏడుగురు యువకులు స్థానిక ఎస్‌ఐతో పాటు స్టేషన్‌ సిబ్బందిపై భౌతిక దాడి చేశారు. స్థానికుల కథనం మేరకు, సత్రవ సెంటరు సమీపంలోని వేములపల్లి రాధాకృష్ణ షాపింగ్‌ ప్రాంగణంలో షేక్‌ మాలింబి కర్రీ పాయింట్‌ నడుపుతోంది. అంబేడ్కర్‌ నగర్‌కు చెందిన కాళింగి సాయికృష్ణ, దగాని వంశీ అనే యువకులు బుధవారం మధ్యాహ్నం సమయంలో కూరలు కొనే విషయంలో ఆమెతో గొడవపడ్డారు. ఇది గ మనించిన షాపు యజమాని రాధాకృష్ణ యువకులకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. అయితే ఈ సమయంలో ఆ యువకులు నెట్టివేయటంతో రాధాకృష్ణ ఎడమ కాలికి గాయమైంది. ఈ గలాటా సమాచారం తెలియడంతో ఎస్‌ఐ ప్రతాపరెడ్డి వెంటనే కానిస్టేబుల్‌ జోగయ్య, హోంగార్డు శ్రీనివాసులను ఘటనా స్థలానికి పంపారు. వివరాలు తెలుసుకునే సమయంలో పోలీస్‌ సిబ్బందిపై కూడా యువకులు దౌర్జన్యానికి దిగారు. అంతేగాక షాపింగ్‌ ప్రాంగణమంతా అల్లకల్లోలం చేశారు. ఘంటసాల పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లే సమయంలో ఆ యువకులు తమ స్నేహితులకు సమాచారం ఇచ్చారు. స్టేషన్‌కు వెళ్లే సమయానికి సాయికృష్ణ, వంశీల స్నేహితులు మరో ఐదుగురు స్టేషన్‌ వద్దకు వచ్చారు. వీరంతా కలిసి స్టేషన్‌ వద్ద హంగామా సృష్టించారు. వాళ్లని సముదాయించడానికి వచ్చిన ఎస్‌ఐ, పోలీస్‌ సిబ్బందిని అసభ్య పదజాలంతో దూషించారు. తర్వాత ఎస్‌, సిబ్బందిపై భౌతిక దాడి చేశారు. ఈ గొడవ అంతా సీసీ కెమెరాలో రికార్డు అయినట్లు సమాచారం. స్టేషన్‌పై దౌర్జన్యానికి దిగిన ఏడుగురిలో నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకోగా, ముగ్గురు మాత్రం పరారయ్యారు. పరారైన వారిలో గొడవకు కారణమైన సాయికృష్ణ, వంశీ ఉన్నట్లు తెలుస్తోంది. వారి కోసం గాలింపు చేపట్టారు. ఈ దాడి విషయం తెలుసుకున్న అవనిగడ్డ డీఎస్పీ తాళ్లూరి శ్రీవిద్య, చల్లపల్లి సీఐ కె.ఈశ్వరరావు ఘంటసాల వచ్చి వివరాలు సేకరించారు.

Updated Date - Jan 15 , 2026 | 03:38 AM