అంబేడ్కర్ స్పూర్తితో యువత ముందుకు సాగాలి
ABN , Publish Date - Apr 15 , 2026 | 12:07 AM
ప్రపంచంలోని అతి పెద్ద రాజ్యాంగాన్ని రూపొందించిన మహనీయుడు డా. బీఆర్ అంబేడ్కర్ అని, ఆయన స్ఫూర్తితో యువత ముందుకు సాగాలని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత అన్నారు.
రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసిసింగ్ శాఖ మంత్రి టీజీ భరత
జిల్లాలో ఘనంగా డా.బీఆర్ అంబేడ్కర్ జయంతి వేడుకలు
కర్నూలు ఎడ్యుకేషన, ఏప్రిల్ 14 (ఆంధ్రజ్యోతి): ప్రపంచంలోని అతి పెద్ద రాజ్యాంగాన్ని రూపొందించిన మహనీయుడు డా. బీఆర్ అంబేడ్కర్ అని, ఆయన స్ఫూర్తితో యువత ముందుకు సాగాలని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత అన్నారు. మంగళవారం అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని నగరంలోని పాత బస్టాండులో ఉన్న అంబేడ్కర్ విగ్రహానికి మంత్రి టీజీ భరత, కర్నూలు పార్లమెంటు సభ్యుడు బస్తిపాటి నాగరాజు, జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్, టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ, ప్రజాప్రతినిధులు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లు, వివిద కుల సంఘాల నాయకులు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ అంబేడ్కర్ అందించిన రాజ్యాంగం వల్లే దేశం అత్యున్నత స్థాయిలో ఉందని అన్నారు. సమాన హక్కులు కల్పించే విషయానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాముఖ్యతను ఇస్తుందన్నారు. అంబేడ్కర్ జయంతి సందర్భంగా తాము మౌర్య ఇనలోని పరిణయ ఫంక్షన హాలులో జాబ్‌మేళా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎంపీ బస్తిపాటి నాగరాజు మాట్లాడుతూ సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చి ఈ రోజు ఒక ఎంపీ హోదాలో తాను ఉండటానికి అంబేడ్కర్ రచించిన రాజ్యాంగమే కారణమని అన్నారు. జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ మాట్లాడుతూ సామాజిక న్యాయం, సమానత్వం కోసం డా. బీఆర్ అంబేడ్కర్ చేసిన కృషి అపారమన్నారు. టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ మాట్లాడుతూ మహామేధావి అయిన అంబేడ్కర్ జీవిత చరిత్రను ప్రతి ఒక్కరూ చదువుకోవాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. అనంతరం ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన వ్యాసరచన పోటీలో గెలుపొందిన విద్యార్థులకు మెమెంటో, ప్రశంసాపత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ విశ్వనాథ్, ఏపీఈడబ్ల్యూఐడీసీ డైరెక్టర్ నాగమణి, మాజీ మంత్రి మారెప్ప, మాజీ మున్సిపల్ చైర్మన బంగి అనంతయ్య, ఎస్టీ కార్పొరేషన డైరెక్టర్ పోతురాజు, డీవీఎనసీ సభ్యులు, ఎస్టీ కుల సంఘాల నాయకులు అనంతరత్నం, మాల విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కసారం వెంకటేశ్వర్లు, ఎస్టీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రప్ప, వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.
ఫ కుర్చీ కోసం కుస్తీ: నిరసన వ్యక్తం చేసిన డీవీఎనసీ సభ్యులు, ఎస్సీ కుల సంఘాల నాయకులు:
స్థానిక పాతబస్టాండులోని అంబేడ్కర్ విగ్రహం ముందు ఏర్పాటు చేసిన సభావేదికపై కూర్చోవడానికి కుర్చీలు వేయలేదని.. వేదికపై పిలవలేదని డీవీఎనసీ సభ్యులు, ఎస్సీ కుల సంఘాల నాయకులు అసంతృప్తిని వ్యక్తం చేస్తూ సభా ఎదుటే నిరసన వ్యక్తం చేశారు. జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డా. అంబేడ్కర్ జయంతి వేడుకల్లో తమను అవమాన పరిచారని వివిధ కుల సంఘాల నాయకులు మండిపడ్డారు. వేదికపై ఉన్న జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ జోక్యం చేసుకుని వారిని శాంతింపజేశారు.