అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి
ABN , Publish Date - Aug 11 , 2026 | 11:25 PM
గోనెగండ్ల మండలం గంజహళ్లి గ్రామంలో మంగళవారం అనుమానాస్పద స్థితిలో బారిక రమేష్(20) అనే యువకుడు మృతి చెందాడు.
గోనెగండ్ల, ఆగస్టు 11(ఆంధ్రజ్యోతి): గోనెగండ్ల మండలం గంజహళ్లి గ్రామంలో మంగళవారం అనుమానాస్పద స్థితిలో బారిక రమేష్(20) అనే యువకుడు మృతి చెందాడు. గ్రామానికి చెందిన పెద్ద బడేసా, ఈశ్వరమ్మలకు ఒక కూతురు, ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరికి రెండు ఎకరాల పొలం ఉంది. పెద్దకుమారుడు రమేష్ పొలం పనులు చేస్తూ జీవించేవాడు. గత నెలలో రూ. 1.50 లక్షలు పెట్టి ఎద్దులను కూడా కొన్నాడు. సోమవారం ఉదయం ప్రతి రోజుమాదిరే ఎద్దులను తీసుకొని పొలానికి వెళ్లాడు. సాయంత్రం అయినా రమేష్ ఇంటి రాకపోవడతో కుటుంబసభ్యులు ఆందోళన చెంది తమ పొలంలోను ఇతర స్థలాలలో రాత్రి రెండు గంటల వరకు వెతికారు. పొలం దగ్గర సెల్‌ఫోను, ఎద్దులు ఉన్నాయి. రమేష్ జాడ కనిపించలేదు. మల్లెల వంక వాగులోని చిన్న నీటి గుంటలో రమేష్ శవం ఉదయం కనిపించింది. రమేష్ మృతికి గల కారణాలను పోలీసులు విచారిస్తున్నారు. శవపరీక్ష నిమిత్తం ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే మృతుని కుటుంబసభ్యులు మాత్రం గ్రామంలోని కొంత మందిపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా సీఐ చంద్రబాబు మాట్లాడుతూ అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని, విచారిస్తున్నామని తెలిపారు.