Share News

యూత్‌ కాంగ్రెస్‌ నిరసన

ABN , Publish Date - Feb 21 , 2026 | 06:32 AM

భారత్‌-అమెరికా వాణిజ్య ఒప్పందాన్ని నిరసిస్తూ ఏఐ ఇంపాక్ట్‌ సదస్సులో యూత్‌ కాంగ్రెస్‌ కార్యకర్తలు అర్ధనగ్న ప్రదర్శన చేపట్టారు.

యూత్‌ కాంగ్రెస్‌ నిరసన

  • భారత్‌-అమెరికా వాణిజ్య ఒప్పందాన్ని నిరసిస్తూ చొక్కాలు విప్పి అర్ధనగ్న ప్రదర్శన

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 20(ఆంధ్రజ్యోతి): భారత్‌-అమెరికా వాణిజ్య ఒప్పందాన్ని నిరసిస్తూ ఏఐ ఇంపాక్ట్‌ సదస్సులో యూత్‌ కాంగ్రెస్‌ కార్యకర్తలు అర్ధనగ్న ప్రదర్శన చేపట్టారు. శుక్రవారం ఢిల్లీలోని ఏఐ సమ్మిట్‌ జరుగుతున్న భారత మండపంలోని హాలు నంబర్‌ 5లోకి దూసుకొచ్చిన పలువురు యూత్‌ కాంగ్రెస్‌ కార్యకర్తలు చొక్కాలు విప్పి నిరసనకు దిగారు. ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మోదీ, డొనాల్డ్‌ ట్రంప్‌ చిత్రాలు ప్రింట్‌ చేసిన టీషర్డులను ప్రదర్శించడంతో పాటు భారత్‌-అమెరికా వాణిజ్య ఒప్పందం, ఎప్‌స్టీన్‌ ఫైళ్ల విషయంలో మోదీ లొంగిపోయారంటూ ఆరోపణలు చేశారు. పోలీసులు వారిని అరెస్టు చేసి బయటకు లాక్కెళ్లారు. యూత్‌ కాంగ్రెస్‌ జాతీయ సమన్వయకర్త, జడ్చర్లకు చెందిన పి.నరసింహ యాదవ్‌ నేతృత్వంలో ఈ నిరసన జరిగింది. దేశ ప్రతిష్ఠను దెబ్బ తీసేందుకే కాంగ్రెస్‌ నేతలు ఈ విధంగా వ్యవహరించారని బీజేపీ తీవ్రంగా మండిపడింది. ప్రపంచ దేశాల ప్రతినిధుల ముందు దేశ ప్రతిష్ఠను దిగజార్చే విధంగా కాంగ్రెస్‌ ప్రవర్తించడం సిగ్గు చేటని కేంద్రమంత్రులు రాజ్‌నాథ్‌సింగ్‌, శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌, కిరణ్‌ రిజిజు, ప్రహ్లాద్‌ జోషితో పాటు పలువురు బీజేపీ అగ్ర నేతలు దుయ్యబట్టారు.

Updated Date - Feb 21 , 2026 | 06:32 AM