అన్నల గొడవ.. కన్నతల్లిపై దాడి కత్తితో పొడుచుకొని తమ్ముడి ఆత్మహత్య
ABN , Publish Date - Oct 05 , 2026 | 05:24 AM
తన సోదరులిద్దరూ మద్యం సేవించి తల్లిపై దాడి చేయడం, అర్ధరాత్రి ఇద్దరూ గొడవపడటం చూడలేక మురళి(24) అనే యువకుడు కత్తితో పొడుచుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
కత్తితో పొడుచుకొని తమ్ముడి ఆత్మహత్య
గుంతకల్లులో ఘటన
గుంతకల్లు టౌన్, అక్టోబరు 4(ఆంధ్రజ్యోతి): తన సోదరులిద్దరూ మద్యం సేవించి తల్లిపై దాడి చేయడం, అర్ధరాత్రి ఇద్దరూ గొడవపడటం చూడలేక మురళి(24) అనే యువకుడు కత్తితో పొడుచుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలోని హంపయ్య కాలనీకి చెందిన నరసన్న, సుశీలమ్మ దంపతులకు నలుగురు కుమారులు. నరసన్న, పెద్ద కుమారుడు వినోద్ కొన్నేళ్ల కిందట చనిపోయారు. సుశీలమ్మ మిగిలిన ముగ్గురు కుమారులతో కలిసి జీవిస్తున్నారు. కుమారులు పెయింటింగ్ పనులు చేస్తుండగా, సుశీలమ్మ పండ్ల వ్యాపారం చేస్తుంటారు. ముగ్గురిలో పెద్దవారైన రాజు, నరేశ్ శనివారం రాత్రి మద్యం సేవించి ఇంటికి వచ్చారు. తల్లి నిలదీయడంతో నరేశ్ ఆమెపై దాడిచేశాడు. ఆమె పక్క వీధిలో ఉంటున్న బంధువుల ఇంటికి వెళ్లిపోయారు. ఆ తరువాత కూడా రాజు, నరేశ్ గొడవపడ్డారు. తమ్ముడు మురళి సర్దిచెప్పినా వినిపించుకోలేదు. అన్నల తీరుతో మనస్తాపం చెందిన మురళి, ‘మీరు మారరు. నేను చచ్చిపోతా..’ అంటూ ఇంట్లో ఉన్న కత్తితో తనను తాను పొడుచుకున్నాడు. రక్తపుమడుగులో ఉన్న మురళిని వారు 108లో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడని వైద్యులు తెలిపారు. తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.