తాను మరణిస్తూ.. ఐదుగురికి కొత్త జీవితం
ABN , Publish Date - Mar 02 , 2026 | 03:55 AM
తాను మరణిస్తూ ఐదుగురి జీవితాల్లో వెలుగులు నింపాడు ఆ యువకుడు. అవయవ దానంతో ఇతరుల రూపంలో మరోసారి జీవించాడు.
రోడ్డు ప్రమాదంతో యువకుడి బ్రెయిన్ డెడ్
అవయవదానంతో ఐదుగురి జీవితాల్లో వెలుగులు
గుంటూరు మెడికల్, మార్చి 1 (ఆంధ్రజ్యోతి): తాను మరణిస్తూ ఐదుగురి జీవితాల్లో వెలుగులు నింపాడు ఆ యువకుడు. అవయవ దానంతో ఇతరుల రూపంలో మరోసారి జీవించాడు. పల్నాడు జిల్లా చిలకలూరిపేటకు చెందిన నల్లపనేని వెంకట శివ, ఆదిలక్ష్మి దంపతులకు చైతన్య(25), మానస కుమార్ ఇద్దరు కుమారులు. చైతన్య స్థానికంగా ప్రైవేటు ఫైనాన్స్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. గత నెల 27న అతడు తాటిపూడి గ్రామం సమీపంలో రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఈ ఘటనలో తలకు తీవ్రగాయాలు కావడంతో చికిత్స కోసం గుంటూరులోని ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్‌లో చేర్పించారు. వైద్యనిపుణుల బృందం తమ వంతు ప్రయత్నం చేసినప్పటికీ ఫలించలేదు. చైతన్య బ్రెయిన్ డెడ్ అయినట్టు శనివారం వైద్యులు ప్రకటించారు. సమాచారం అందుకున్న జీవన్‌దాన్ ట్రస్ట్ ట్రాన్స్‌ప్లాంట్ కోఆర్డినేషన్ బృందం బాధిత కుటుంబ సభ్యులను కలసి కౌన్సెలింగ్ చేశారు. దీంతో తండ్రి వెంకట శివ, తల్లి ఆదిలక్ష్మి స్పందించి ఇతరుల ప్రాణాలు కాపాడేందుకు కుమారుడి అవయవాలను దానం చేసేందుకు ఆమోదం తెలిపారు. వైద్య బృందం చైతన్య పార్ధివ దేహం నుంచి కాలేయం, రెండు మూత్రపిండాలు, రెండు నేత్రాలను సేకరించారు. కాలేయం, ఒక మూత్రపిండం గుంటూరులోని ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్‌కు, మరొక మూత్రపిండాన్ని విజయవాడలోని అమెరికన్ కిడ్నీ హాస్పిటల్‌కు, రెండు కార్నియాలను ఎల్‌వీ ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్‌కు పంపినట్టు జీవన్‌దాన్ ట్రస్ట్ ప్రతినిధులు తెలిపారు. చిలకలూరిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు చైతన్య తల్లిదండ్రులు మంచి నిర్ణయం తీసుకొని ఐదుగురు జీవితాల్లో కొత్త వెలుగులు నింపేందుకు కృషి చేశారని అభినందించారు.