Share News

మత్తు ఇంజక్షన్‌ తీసుకొని యువ డాక్టర్‌ ఆత్మహత్య

ABN , Publish Date - Jun 24 , 2026 | 04:25 AM

విశాఖపట్నానికి చెందిన యువ డాక్టర్‌ మొహమ్మద్‌ ఖాసిం(27) హైదరాబాద్‌లో ఆత్మహత్యకు పాల్పడ్డారు. మత్తు ఇంజక్షన్‌ తీసుకుని ప్రాణాలు కోల్పోయారు.

మత్తు ఇంజక్షన్‌ తీసుకొని యువ డాక్టర్‌ ఆత్మహత్య

  • విశాఖ వాసి.. హైదరాబాద్‌లో బలవన్మరణం

పహాడిషరీఫ్‌, జూన్‌ 23(ఆంధ్రజ్యోతి): విశాఖపట్నానికి చెందిన యువ డాక్టర్‌ మొహమ్మద్‌ ఖాసిం(27) హైదరాబాద్‌లో ఆత్మహత్యకు పాల్పడ్డారు. మత్తు ఇంజక్షన్‌ తీసుకుని ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన బాలాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధి మల్లాపూర్‌లో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు... డాక్టర్‌ ఖాసిం మల్లాపూర్‌ రికవరీ హాస్పిటల్‌లో పనిచేస్తున్నారు. సోమవారం రాత్రి డ్యూటీ ముగిసిన తర్వాత ఆయన రూమ్‌ నం.201లో విశ్రాంతి తీసుకున్నారు. మంగళవారం ఉదయం ఆయన నిద్ర లేవకపోవడం, ఎంత పిలిచినా తలుపు తీయకపోవడంతో సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు తలుపులు పగలగొట్టి చూడగా.. ఖాసిం విగత జీవిగా పడి ఉన్నాడు. క్లూస్‌ టీమ్‌కు ఆ రూమ్‌లో రెండు మత్తు ఇంజక్షన్లు లభించాయి. మృతుని కుటుంబ సభ్యులను విచారించగా.. తమకు ఎవరిపైనా అనుమానాలు లేవని చెప్పారని, పోస్ట్‌మార్టం రిపోర్ట్‌ వచ్చిన తర్వాత పూర్తి వివరాలు తెలుస్తాయని పోలీసులు పేర్కొన్నారు. ఖాసిం విశాఖపట్నం వాసి కాగా, ప్రస్తుతం యాఖుత్‌పురాలో అద్దె ఇంట్లో ఉంటున్నారని తెలిపారు. ఆస్పత్రి యాజమాన్యం వేధింపులు భరించలేకే ఆయన ఆత్మహత్య చేసుకున్నాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వాటిపై పోలీసులను ‘ఆంధ్రజ్యోతి’ వివరణ కోరగా.. ఎలాంటి ఆధారాలు దొరకలేదని, దర్యాప్తు తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పారు.

Updated Date - Jun 24 , 2026 | 04:27 AM