ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి
ABN , Publish Date - Jul 12 , 2026 | 11:19 PM
ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ వైద్యపరీక్షలు చేయించుకుంటూ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని టీడీపీ ఆలూరు ఇన్‌చార్జి వైకుంఠం జ్యోతి సూచించారు.
ఆలూరు, జూలై 12 (ఆంధ్రజ్యోతి): ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ వైద్యపరీక్షలు చేయించుకుంటూ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని టీడీపీ ఆలూరు ఇన్‌చార్జి వైకుంఠం జ్యోతి సూచించారు. ఆదివారం స్థానిక వాసవీ కల్యాణ మండపంలో ఆదోనికి చెందిన మధు ఆసుపత్రి ఆధ్వర్యంలో నిర్వహించిన వైద్యశిబిరాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించేందుకు కార్పొరేట్ ఆసుపత్రులు ముందుకు రావడం హర్షనీయమన్నారు. ఉచిత వైద్యశిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా చిన్న పిల్లల వైద్యులు వైష్ణవిరాణి, ఈఎన్‌టీ అభిలాషి, న్యూరాలజిస్ట్ నిఖిల్ అమీర్‌శెట్టి, కార్డియాలజిస్ట్ రోజా దాదాపు 130 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి మందులను పంపిణీ చేసినట్లు ఆసుపత్రి మేనేజర్ సునీల్‌కుమార్ తెలిపారు.
బడుగు, బలహీనవర్గాల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం
చిప్పగిరి: బడుగు, బలహీనవర్గాల అభివృద్ధే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పని చేస్తోందని టీడీపీ ఆలూరు ఇన్‌చార్జి వైకుంఠం జ్యోతి అన్నారు. చిప్పగిరి మండలం గుమ్మనూరు గ్రామంలో ఆదివారం ఆమె పర్యటించారు. ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. ఆమె మాట్లాడుతూ ఇన్‌చార్జి బాధ్యతలు చేపట్టిన తర్వాత నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడిగా ముందుకు సాగిస్తున్నామన్నారు. ప్రజల సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నామన్నారు. సీసీ రోడ్లు, మురుగు కాలువలు, తాగునీరు, విద్యుత్ వంటి మౌలిక వసతుల నిర్మాణం చేపడుతున్నామన్నారు. స్థానిక ఎన్నికల్లో సర్పంచులు, ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలు అన్ని గెలిచి టీడీపీకి పూర్వ వైభవం తీసుకురావడానికి పార్టీ శ్రేణులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ మీనాక్షినాయుడు, సొసైటీ ప్రెసిడెంట్ కొండ రామాంజనేయులు, మండల కన్వీనర్ కొండ పురుషోత్తం, వెంకటేష్, తిమ్మప్ప, రవితేజ, పి.రామాంజనేయులు, దానప్ప, జనార్దన్‌గౌడ్ పాల్గొన్నారు.