ఫైౖల్ కదలాలంటే పైసలివ్వాల్సిందే!
ABN , Publish Date - Jan 26 , 2026 | 12:51 AM
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో ఓ ద్వితీయ శ్రేణి కీలక అధికారి అవినీతి వ్యవహారాల్లో మునిగి తేలుతున్నాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కార్యాలయంలో ఏ ఫైలు కదపాలన్నా ఇంతరేటని నిర్ణయించి మరీ వసూళ్లకు పాల్పడుతున్నాడనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ అధికారి వద్దకు వెళ్లాలంటేనే జిల్లాలోని ఆస్పత్రుల్లో పనిచేస్తున్న వైద్యులు, వివిధ విభాగాల ఉద్యోగులు హడలి పోతున్నారు. ఏ ఫైల్‌కు ఎంత మొత్తంలో నగదు డిమాండ్ చేస్తాడోననే భయం వారిని వెంటాడుతోంది. పనితీరు మార్చుకోమని పలువురు సూచించినా నేనింతే అంటూ సదరు అధికారి తనదైన ధోరణిని ప్రదర్శిస్తున్నాడని వైద్యులు, ఉద్యోగులు ఆరోపిస్తున్నారు.
- జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ కార్యాలయంలో ఓ ద్వితీయశ్రేణి కీలక అధికారి నిర్వాకం
- వైద్యులు, ఉద్యోగుల సర్వీస్ రిజిస్టర్‌లు పరిశీలించాలంటే రూ.5వేలు!
- ప్రసూతి సెలవులు, ఇతర బిల్లుల మంజూరుకు చేయి తడపాల్సిందే!
- చివరకు కాంట్రాక్టు చిరుద్యోగులనూ వదలని వైనం
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో ఓ ద్వితీయ శ్రేణి కీలక అధికారి అవినీతి వ్యవహారాల్లో మునిగి తేలుతున్నాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కార్యాలయంలో ఏ ఫైలు కదపాలన్నా ఇంతరేటని నిర్ణయించి మరీ వసూళ్లకు పాల్పడుతున్నాడనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ అధికారి వద్దకు వెళ్లాలంటేనే జిల్లాలోని ఆస్పత్రుల్లో పనిచేస్తున్న వైద్యులు, వివిధ విభాగాల ఉద్యోగులు హడలి పోతున్నారు. ఏ ఫైల్‌కు ఎంత మొత్తంలో నగదు డిమాండ్ చేస్తాడోననే భయం వారిని వెంటాడుతోంది. పనితీరు మార్చుకోమని పలువురు సూచించినా నేనింతే అంటూ సదరు అధికారి తనదైన ధోరణిని ప్రదర్శిస్తున్నాడని వైద్యులు, ఉద్యోగులు ఆరోపిస్తున్నారు.
ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం:
జిల్లాలో 49 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 14 పట్టణ ఆరోగ్య కేంద్రాలు, ఏడు సామాజిక ఆరోగ్య కేద్రాలు, ఒక ఏరియా ఆస్పత్రి ఉన్నాయి. వాటిలో పనిచేసే వైద్యులు, సిబ్బందికి సంబంధించిన పరిపాలనా వ్యవహారాలు జిల్లా వైద్యఆరోగ్య శాఖ కార్యాలయం ద్వారానే పర్యవేక్షిస్తారు. ఈ పరిపాలనా వ్యవహారాలను చూసే అధికారి రెండేళ్ల కితం మచిలీపట్నంలోని ప్రధాన కార్యాలయానికి బదిలీపై వచ్చారు. కొంతకాలంగా ఈ అధికారి వసూళ్ల పర్వానికి తెర తీశాడనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
వసూళ్ల పర్వం ఇలా..
- వైద్యశాఖలో పనిచేసే మహిళా ఉద్యోగులకు ప్రసూతి సెలవులు మంజూరు చేయాలంటే ఒకరేటు, మళ్లీ విధుల్లోకి చేర్చుకునేందుకు అనుమతులు ఇవ్వాలంటే మరో రేటు నిర్ణయించి నగదు వసూలు చేస్తున్నాడని సిబ్బంది బాహాటంగానే చెప్పుకుంటున్నారు.
- పీహెచ్‌సీల్లో పనిచేసే వైద్యులు పీజీ కోర్సులు చదివే నిమిత్తం సెలవుపై వెళ్లాలంటే ఈ అధికారి అనుమతులు ఇస్తూ ఫైళ్లను కదపాలి. ఈ పని నిమిత్తం వైద్యులు సదరు అధికారి వద్దకు వెళితే తాను అడిగినంత ఇస్తేనే అనుమతులు ఇస్తానని, చెప్పకనే చెబుతున్నాడని పలువురు వైద్యులు వాపోతున్నారు.
-వైద్యులు, ఉద్యోగులకు సంబంధించి ఎస్‌ఆర్‌లలో,మూవ్‌మెంట్ రిజిస్టర్‌లో సర్వీస్‌కు సంబంధించిన వివరాలు నమోదు చేయాలని వైద్యులు, సిబ్బంది నుంచి ముక్కుపిండి మరీ నగదు వసూలు చేస్తున్నాడనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
- ఉద్యోగులకు సంబంధించి వివిధ బిల్లులు మంజూరు చేయడానికి, ఇతరత్రా పరిపాలనా పరమైన అంశాలకు ఇంతరేటని నిర్ణయించి మరీ నగదు వసూలు చేస్తుండటంతో బెంబేలెత్తిపోతున్నారు.
- గతంలో ఈ సీటులో పనిచేసిన అధికారులు ఇంతలా నగదు వసూలు చేయలేదని, ఈ అధికారి మాత్రం ఆయన అడిగినంత సమర్పించుకునే వరకు ఫైళ్లను పెండింగ్‌లోనే పెట్టి తమను ఇబ్బందులకు గురిచేస్తున్నాడని వైద్యులు, సిబ్బంది వాపోతున్నారు.
- కొద్దిపాటి జీతానికి పనిచేసే కాంట్రాక్టు ఉద్యోగుల జీతాల బిల్లులు చేసేందుకు కూడా నా సంగతేంటని ఈ అధికారి బేరాలు పెడుతున్నాడని కాంట్రాక్టు ఉద్యోగులు కన్నీరు పెడుతున్నారు.
టీబీ విభాగం సిబ్బంది 15శాతం నగదు ఇవ్వాలని డిమాండ్
క్షయవ్యాధి నివారణ జిల్లా విభాగంలోని ఉద్యోగులంతా కాంట్రాక్టు పద్ధతిపై పనిచేసే వారే. గ్రామాల్లో వారు పర్యటించి టీబీ రోగుల వద్దకు వెళ్లి మందులు అందజేస్తారు. వారు సక్రమంగా మందులు వాడుతున్నదీ లేనిది, వారి ఆరోగ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తారు. ఇందుకు గాను సిబ్బందికి టీఏ బిల్లులను ప్రభుత్వం ఇస్తుంది. గత పది నెలలకు సంబంధించిన బిల్లులను ఇటీవల ప్రభుత్వం విడుదల చేసింది. ఈ బిల్లులు మంజూరు చేయాలని సిబ్బంది సదరు అధికారి వద్దకు వెళ్లగా, మీకు వచ్చే బిల్లులో 15శాతం నగదును ముందస్తుగా ఇస్తేనే బిల్లులు చేస్తానని, ట్రెజరీలో, ఇతరత్రా ఖర్చులు మీరే చూసుకోవాలని చెప్పినట్లు టీబీ విభాగంలో పనిచేసే ఉద్యోగులు గత నాలుగైదురోజులుగా బాహాటంగానే చెప్పుకుంటున్నారు. పైఅధికారులకు సైతం ఈ విషయంపై కొందరు ఉద్యోగులు ఫిర్యాదు కూడా చేసినట్లు సమాచారం.
నేషనల్ హెల్త్ మిషన్ నిధులపైన కన్ను
నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా జిల్లాకు వచ్చిన నిధులను సైతం ఈ అధికారి పక్కదారి పట్టిస్తున్నాడని వైద్యశాఖ అధికారులు, ఉద్యోగులు చెప్పుకుంటున్నారు. గతంలో వైద్య, ఆరోగ్యశాఖ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో పనిచేసిన ఈ అధికారి అక్రమాలు అధికం కావడంతో జిల్లాకు బదిలీ చేశారని, ఇక్కడకు వచ్చిన ఈయన తనకు నమ్మకస్తులైన వారి ద్వారా తెరవెనుక అక్రమ వ్యవహారాలు నడుపుతున్నాడని వైద్యశాఖ ఉద్యోగులు అంటున్నారు. జిల్లా అధికారులు స్పందించి సదరు అధికారిపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. దీనిపై జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి యుగంధర్‌ను వివరణ కోరగా, కార్యాలయంలో అవినీతి వ్యవహారాలు నా దృష్టికి రాలేదన్నారు. ఎవరైనా నా దృష్టికి తీసుకు వస్తే పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామని వివరించారు.