Share News

తప్పులు మీరు చేసి బురద మాపైనా.. ?

ABN , Publish Date - Nov 02 , 2026 | 11:52 PM

తప్పులు మీరు చేసి బురద మాపై వేస్తారా అంటూ పాణ్యం ఎమ్మెల్యే గౌరుచరిత వైసీపీ నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

తప్పులు మీరు చేసి   బురద మాపైనా.. ?

నోటికి ఏదొస్తే అది మాట్లాడటం తగదు..

ఎమ్మెల్యే గౌరు చరిత

పాణ్యం, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి) : తప్పులు మీరు చేసి బురద మాపై వేస్తారా అంటూ పాణ్యం ఎమ్మెల్యే గౌరుచరిత వైసీపీ నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం మండల కేంద్రంలోని టీడీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ హయాంలో చేసిన తప్పులను టీడీపీపై రుద్దడం ఎంతవరకు న్యాయమన్నారు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా కొనసాగిన కాటసాని పాణ్యానికి చేసిందేమీ లేదన్నారు. కంకర, ఇసుక వ్యాపారం చేస్తున్నామని ఏది నోటికి వస్తే అది దిగజారి మాట్లాడడం మీకే చెల్లుతుందని ఎద్దేవా చేశారు. ఉచిత ఇసుకకు ప్రభుత్వమే టెండర్లు వేస్తుందని.. ఎవరు టెండరు పాడితే వారు వ్యాపారం చేసుకుంటారని తెలియదా అని ప్రశ్నించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో పాణ్యంలో రూ.38 కోట్ల పనులను ప్రారంభించామన్నారు. ఇందులో రూ.20 కోట్ల పనులు పూర్తి చేశామన్నారు. పాణ్యం, టౌన్‌ రహదారిని రూ 2.50 కోట్లతో, కొనిదేడు వద్దెల వాగు వంతెన రూ.2 కోట్లు, పాణ్యం దుర్వేశి రోడ్డు రూ. 6. 30 కోట్లు, పాణ్యం చెరువు అభివృద్ధికి రూ.50 లక్షలు, పల్లె పండగ కింద గ్రామాల్లో రహదారులు, మురుగు కాల్వలకు రూ.10 కోట్లు ఖర్చు చేసి పూర్తి చేశామన్నారు. గగ్గటూరు వంతెనకు రూ.2.50 కోట్లు, భూపనపాడు హెల్త్‌ కేంద్రానికి రూ.50 లక్షలు, నందివర్గం, కొత్తూరు రహదారికి రూ.2.50 కోట్లు, పాణ్యం రైతు బజార్‌కు రూ.50 లక్షలు కేటాయించి నిధులు మంజూరు చేశామన్నారు. కందికాయపల్లె, రామతీర్థం రహదారికి రూ.2 కోట్లు కేటాయించామన్నారు. గోరుకల్లు రిజర్వాయర్‌ పనులకు రూ.58 కోట్లు కేటాయించి పనులు చేపట్టామని వివరించారు. మీరు చేసిన అక్రమాలతో ప్రజలు విసుగుచెంది వైసీపీ ప్రభుత్వాన్ని దించారని గుర్తుంచుకోవాలన్నారు.

నిజాలు తెలుసుకోండి

మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి గేట్లు దించినందుకే తనకు సీటు ఇచ్చారని పేర్కొనడం దిగజారుడు తనమని జడ్పీటీసీ అభ్యర్థి రవికుమార్‌ పేర్కొన్నారు. నిజాలు తెలియకుండా చేపలు పట్టుకోవడానికి రిజర్వాయర్‌ గేట్లు దించామని పేర్కొనడం తగదన్నారు. ఎవరు గేట్లు ఎత్తారో పోలీసు, రెవెన్యూ శాఖలు విచారిస్తున్నాయన్నారు. బీసీ రిజర్వేషన్‌ వచ్చింది కాబట్టే తాము ఎన్నికల్లో పోటీకి నిలిచామని తెలిపారు.

Updated Date - Nov 02 , 2026 | 11:52 PM