మల్లన్న నీవే.. రక్షా..!
ABN , Publish Date - Jan 28 , 2026 | 11:41 PM
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఫిబ్రవరి 8 నుంచి 18వ తేదీ వరకు శ్రీశైలంలో బ్రహ్మోత్సవాలు ఆరంభం కానున్నాయి.
ఏటా శ్రీశైల పాదయాత్రికులకు తప్పని అవస్థలు
మొక్కుబడి సదుపాయాలతో సరిపెట్టుకుంటున్న వైనం
కర్నూలు-గుంటూరు రహదారిని వీడని కష్టాలు
నేడు శ్రీశైలం ట్రస్టు బోర్డు కమిటీ సమావేశం
ఆత్మకూరు, జనవరి 28(ఆంధ్రజ్యోతి): మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఫిబ్రవరి 8 నుంచి 18వ తేదీ వరకు శ్రీశైలంలో బ్రహ్మోత్సవాలు ఆరంభం కానున్నాయి. దేశం నలుమూలల నుంచి మల్లన్న భక్తులు లక్షలాదిగా తరలివస్తారు. భక్తులకు కనీస సదుపాయాలను కల్పించడంలో ప్రతిఏటా శ్రీశైల దేవస్థానం అధికారులు, జిల్లా యంత్రాంగం విఫలమవుతున్నారన్న విమర్శలున్నాయి. బ్రహ్మోత్సవాల సందర్భంగా కేవలం శ్రీశైలంలో మాత్రమే దేవస్థానం అధికారులు సదుపాయాల కల్పనపై ఫోకస్ చేస్తున్నారే తప్ప ఇతర సమస్యలను పట్టించుకోవడం లేదన్న ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలోనే గురువారం శ్రీశైలంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు, ఇతర ఏర్పాట్లపై ట్రస్టు బోర్డు కమిటీ సమావేశం జరపనున్నారు. ఈ సమీక్షలో కాలినడకన వచ్చే పాదయాత్రికులకు కల్పించాల్సిన సౌకర్యాలపై చర్చించాల్సిన అవసరముంది.
కాలినడకన తరలివెళ్లే..
ప్రతిఏటా కాలినడకన తరలివెళ్లే భక్తులకు అటవీ మార్గంలో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల దృష్ట్యా శ్రీశైలానికి అనంతపురం, మహబూబ్‌నగర్ జిల్లాల నుంచే కాకుండా ఉమ్మడి కర్నూలు జిల్లాలోని కోడుమూరు, ఎమ్మిగనూరు, ఆదోని, నందికొట్కూరు, డోన్, కర్నూలు, నంద్యాల ప్రాంతాల నుంచి పాదయాత్రికులు పెద్దసంఖ్యలో తరలిరానున్నారు. వీరిలో కొంత మంది తమ స్వగ్రామాల నుంచే పాదయాత్రగా వస్తుండగా మరికొందరు వెంకటాపురానికి చేరుకుని అక్కడి నుంచి యాత్రను కొనసాగిస్తారు. వెంకటాపురం నుంచి పొలాల మీదుగా నాగలూటి చెంచుగూడేన్ని చేరుకుంటారు. ఏళ్ల తరబడి ఎన్నో సమస్యలున్నా వాటిని పరిష్కరించే దిశగా చర్యలు లేవు. ఏదైనా అపశ్రుతి చోటు చేసుకుంటే ఊహించని పరిణామం ఎదుర్కోవాల్సి వస్తోంది.
అధికార యంత్రాంగం నిర్లక్ష్యంగా..
భక్తులకు సదుపాయాలు కల్పించడంలో జిల్లా అధికార యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు విమర్శలున్నాయి. పెచ్చెర్వు, నాగలూటి ప్రాంతాల్లో దాతలు ఏర్పాటు చేసిన అన్నదాన శిబిరాలను మినహాయిస్తే మిగతా సౌకర్యాలేవి కనిపించవు. నాగలూటిలో వున్న చిన్నపాటి కోనేరు నీరు వేలాది మంది భక్తులకు దాహార్తి తీరుస్తోంది. వీటిలో వ్యర్థాలు చేరి కలుషితమవుతున్నాయి. అయినప్పటికీ అవే నీటిని తాగాల్సిన దుస్థితి నెలకొంది. అక్కడే వున్న మరో పెద్దకోనేరులో కూడా శివస్వాములు, పాదయాత్రికులు స్నానమాచరిస్తారు. వేలాదిగా భక్తులు తరలిరావడంతో కోనేరులోని నీరంతా రంగుమారి దుర్వాసన వెదజల్లుతూ రోగాలకు కారణమవుతోంది. భీమునికొలను, కైసలద్వారం ప్రాంతాల్లో తాగునీటి ట్యాంకులను ఏర్పాటు చేస్తామని దేవస్థానం అధికారులు చెబుతున్నా వాటిద్వారా దుర్వాసన వెదజల్లే నీరు వస్తుండటంతో ఆ నీటికి తాగలేక భక్తులు ఇబ్బందులు పడుతున్నారు
ప్రత్యేక దర్శనం కల్పించాలి
శ్రీశైలానికి కాలినడకన తరలివచ్చే భక్తులలను కంపార్టుమెంట్లలో, క్యూలైన్లలో గంటల తరబడి నిరీక్షించేలా చేస్తున్నారు. వాస్తవానికి కొన్నేళ్ల క్రితం తిరుమల తరహాలో నడిచి వచ్చే భక్తులకు పెచ్చెర్వు దాటిన తర్వాత ప్రత్యేక కంకణాలను చేతులను ధరింపజేసేవారు. ఈ కంకణాలు కలిగిన కాలినడక భక్తులకు త్వరగా దర్శనమయ్యేలా చర్యలు ఉండేది. కొన్నేళ్లుగా ఈ ప్రక్రియను దేవస్థానం అధికారులు నిలిపివేశారు. దీంతో అటవీమార్గంలో నడిచి వచ్చే ఇబ్బందుల కన్నా.. క్యూలైన్లలో భక్తులు పడే ఇక్కట్లే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. కాలినడకన వచ్చే భక్తులపై దేవస్థానం, జిల్లా అధికార యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరముంది.
నామమాత్రపు వైద్యశిబిరాలు
భక్తుల సౌకర్యార్థం జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో దారిపొడవునా అక్కడక్కడ వైద్యశిబిరాలను ఏర్పాటు చేస్తారు. వీటి నిర్వహణ నామమాత్రంగానే ఉందని, అనేక మార్లు జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లినా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. పైగా వైద్యశిబిరాల్లో జ్వరం, నొప్పులు, విరేచనాలు తదితర మందులు మినహాయిస్తే మెరుగైన వైద్యసేవలకు ఉపయోగపడే మందులేవి అందుబాటులో వుండవు. అటవీ ప్రాంతంలో కొండలను ఎక్కుతూ, దిగుతూ వెళ్లాల్సి వుంటుంది. ఈ ప్రయాణంలో భక్తులు అస్వస్థతకు గురయ్యే ప్రమాదంతో పాటు కాళ్లకు దెబ్బలు తగిలి రక్తగాయాలు వంటి సంఘటనలు జరుగుతుంటాయి.
దారిపొడవునా.. నిలువుదోపిడే :
ప్రతిఏటా ఆత్మకూరు గుండా శ్రీశైలానికి కాలినడకన వెళ్తున్న భక్తులు దారిపొడవునా నిలువు దోపిడికి గురవుతూనే ఉన్నారు. చిన్నపాటి వస్తుసామగ్రితో సహా అన్ని రకాల ధరలను రెట్టింపు చేసి ఇక్కడి వ్యాపారులు దోచుకుంటున్నారు. వీరిపై ఏ ఒక్కశాఖ అధికారులు కూడా చర్యలు తీసుకున్న పాపాన పోలేదు. వెంకటాపురం గ్రామం నుంచి ప్రారంభమై కైలాస ద్వారం వరకు భక్తులు దోపిడీకి గురవుతున్నారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు దుకాణాల్లో ధరల పట్టికలను ఏర్పాటు చేసినప్పటికీ వ్యాపారులు మాత్రం అధిక రేట్లకు విక్రయిస్తున్నారు.
వీడని సమస్యలు
బ్రహ్మోత్సవాలకు శ్రీశైలానికి లక్షలాది మంది భక్తులు కర్నూలు-గుంటూరు ప్రధాన రహదారి మీదుగా తరలివెళ్తుంటారు. రహదారి నిర్వహణ అధ్వానంగా ఉండటంతో భక్తులకు ప్రమాదం పొంచి ఉందన్న హెచ్చరికలు మోగుతున్నాయి. ప్రత్యేకించి నల్లమల అటవీ మార్గంలో వున్న కేజీ రహదారికి అక్కడక్కడ ప్రమాదకర మలుపులు వుండటంతో పాటు ప్రమాద సూచికలు లేకపోవడం భక్తుల్లో ఆందోళనకు గురిచేస్తోంది. నల్లమల అటవీ మార్గంలో చాలావరకు కేజీ రోడ్డు సింగిల్‌లైనగా వుంది. సమస్యగా మారింది. రోళ్లపెంట ఘాట్ రోడ్డుకు ట్రాఫిక్ సమస్య వెంటాడుతోంది. ప్రకాశం జిల్లా పరిధిలోని కేజీరోడ్డు పరిస్థితి మరింత దారుణం.దోర్నాల-శ్రీశైలం రహదారిలో కూడా ప్రమాదకర మలుపులున్నాయి. ఆయా మలుపుల వద్ద స్పీడ్‌బ్రేకర్లు, సూచికలను ఏర్పాటు చేయడంతో పాటు అక్కడక్కడ దెబ్బతిన్న రహదారిని బాగుచేయాలని భక్తులు కోరుతున్నారు.