రాష్ట్రవ్యాప్తంగా యోగాంధ్ర
ABN , Publish Date - Jun 08 , 2026 | 04:15 AM
రాష్ట్రవ్యాప్తంగా యోగాంధ్ర అవగాహనా కార్యక్రమాలు ఆదివారం ప్రారంభమయ్యాయి. జూన్ 21న జరిగే భారీ యోగా కార్యక్రమానికి సన్నాహకంగా ఈ నెల 7 నుంచి 20వ తేదీ వరకు 28 జిల్లాల్లో యోగాపై..
ఆసనాలు వేసిన మంత్రులు
21 వరకు ప్రచార కార్యక్రమాలు
థీమ్ యోగాతో ఆరోగ్యకరమైన వృద్ధాప్యం
21న అమరావతిలో ప్రధాన కార్యక్రమం
అమరావతి/విజయవాడ, జూన్ 7(ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా యోగాంధ్ర అవగాహనా కార్యక్రమాలు ఆదివారం ప్రారంభమయ్యాయి. జూన్ 21న జరిగే భారీ యోగా కార్యక్రమానికి సన్నాహకంగా ఈ నెల 7 నుంచి 20వ తేదీ వరకు 28 జిల్లాల్లో యోగాపై ప్రచార కార్యక్రమాలు ప్రారంభించారు. 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజు ప్రధాన కార్యక్రమం నిర్వహిస్తారు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ నేతృత్వంలో శ్రీసత్యసాయి జిల్లా లేపాక్షిలోని ఆలయ ప్రాంగణంలో రాష్ట్రస్థాయి యోగాసనాల కార్యక్రమం ప్రారంభమైంది. మంత్రి మాట్లాడుతూ.. ‘‘భారతీయ సంస్కృతికి, జీవన విధానానికి యోగా ప్రతీక. యోగాసనాల ద్వారా అనారోగ్యాలు, మానసిక సమస్యలకు దూరంగా ఉండొచ్చు. శాస్త్రీయంగా ఇది నిరూపితమైంది. కోటి మందిని యోగాసనాల కార్యక్రమాల్లో భాగస్వాములు చేయాలని లక్షంగా పెట్టుకున్నాం.’’ అని చెప్పారు. లేపాక్షి కార్యక్రమానికి కొనసాగింపుగా ఎంపిక చేసిన 5 జిల్లాల్లోనూ యోగాసనాల కార్యక్రమాలు కొనసాగాయి. యోగాంధ్ర పోర్టల్ ద్వారా తొలిరోజు 25,000 మంది తమ పేర్లు నమోదు చేసుకున్నారని ఆరోగ్యశాఖ కమిషనర్ వీరపాండియన్ తెలిపారు.
5,992 మందికి శిక్షణ పూర్తి
రాష్ట్రవ్యాప్తంగా శని, ఆదివారాల్లో యోగా శిక్షకుల ద్వారా 5,992 మందికి పూర్తిస్థాయిలో శిక్షణ ఇచ్చారు. రెండున్నర లక్షల మందికి శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దీనిలో భాగంగా ఆదివారం 50,752 మందికి యోగా శిక్షణ ప్రారంభించారు. 5 రోజుల పాటు శిక్షణ కార్యక్రమాలు జరుగుతాయి. శ్రీసత్యసాయి జిల్లా లేపాక్షి ఆలయంలో జరిగిన కార్యక్రమంలో 1,952 మంది, కడప జిల్లా ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయ ప్రాంగణంలో 625 మంది, కృష్ణా జిల్లా మంగినపూడి బీచ్‌లో 758 మంది, తిరుపతిలోని ఎస్వీ జూ పార్కు ఆవరణలో 2,150 మంది పాల్గొని యోగాసనాలు వేశారు. విజయవాడ, అమలాపురంలో థీమ్‌బేస్డ్ యోగా కార్యక్రమాలు జరిగాయి. విజయవాడలో 1000 మంది పోలీసులు, అమలాపురంలో జరిగిన కార్యక్రమంలో 845 మంది రైతులు హాజరయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం 253 గ్రామ/వార్డు సచివాలయాల ద్వా రా యోగా ప్రాధాన్యంపై నిర్వహించిన పోటీల్లో 1700 మంది పాల్గొన్నారు. యోగాపై రకరకాల థీమ్‌లతో 13 రోజుల పాటు ఈ పోటీలు జరగనున్నాయి. వైద్య కళాశాలల్లోనూ యోగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
గ్రామం నుంచి జిల్లా వరకు
ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా థీమ్‌తో ప్రచార ప్రణాళికను జిల్లా, మండల, గ్రామస్థాయి కమిటీలు, ఇతర శాఖల కార్యాచరణ కోసం ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. సెక్రటరీలకు ఈ బాధ్యతలు అప్పగించింది. ఈ నెల 21న అమరావతిలో జరిగే భారీ యోగా వేడుకలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వం వహిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని గ్రామాలు, వార్డులు, మండలాలు, జిల్లా కేంద్రాల్లో నిర్వహించే సామూహిక యోగా సెషన్లలో సుమారు కోటి మంది పాల్గొంటారని ప్రభుత్వం అంచనా వేసింది. అమరావతిలోని వెస్ట్ బైపాస్ బ్రిడ్జిపై 25,000 మంది ప్రతినిధులతో జూన్ 21న ప్రధాన కార్యక్రమం నిర్వహిస్తారు. మొత్తం 10 లక్షల మంది యోగా శిక్షకుల సమూహాన్ని తయారు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
భారతీయుల నరనరాల్లో యోగా: అనిత
ఐదు వేల సంవత్సరాల నుంచి భారతీయుల నరనరాల్లో యోగా ఉందని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. ఎన్టీఆర్ పోలీసు కమిషనరేట్ ఆధ్వర్యంలో విజయవాడలోని బీఆర్‌టీఎస్ రోడ్డులో ఆదివారం నిర్వహించిన పోలీసు థీమ్ యోగా కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. పోలీసు అధికారులు, సిబ్బంది, విద్యార్థులతో కలిసి యోగాసనాలు వేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ప్రధాని మోదీ యోగాను ఒక కార్యక్రమం కింద క్యాలెండర్‌లోకి ఎక్కించారని తెలిపారు. యోగాతో ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చన్నారు. యోగాను ప్రతి ఒక్కరూ జీవితంలో భాగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఒత్తిడి, గుండెపోటు, షుగర్ వంటి వ్యాధులను నియంత్రించడానికి యోగా చాలా అవసరమని పేర్కొన్నారు.