కోటి మందితో యోగాంధ్ర
ABN , Publish Date - Jun 06 , 2026 | 05:26 AM
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈ నెల 7 నుంచి 21 వరకూ ప్రత్యేక యోగా కార్యక్రమాల నిర్వహణకు ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి.
పోస్టర్ ఆవిష్కరించిన మంత్రి సత్యకుమార్
అమరావతి, ధర్మవరం, జూన్ 5 (ఆంధ్రజ్యోతి): అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈ నెల 7 నుంచి 21 వరకూ ప్రత్యేక యోగా కార్యక్రమాల నిర్వహణకు ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కోటి మంది యోగాసనాల కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వీలుగా ‘యోగాంధ్ర - 2026’ పోర్టల్ ద్వారా శనివారం నుంచి రిజిస్ట్రేషన్లు జరగనున్నాయి. ఆయుష్ శాఖకు చెందిన అధికారులను జిల్లాకు ఒకరిని నోడల్ ఆఫీసర్‌గా నియమించారు. ఈ నెల 7 నుంచి 20వ తేదీ వరకూ రాష్ట్రవ్యాప్తంగా 56 కార్యక్రమాలు జరిపే విధంగా ఆరోగ్య శాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. కార్యక్రమ వివరాలతో కూడిన పోస్టర్‌ను మంత్రి సత్యకుమార్ శుక్రవారం ఆవిష్కరించారు.
బురద జల్లడం వైసీపీ నాయకులకు అలవాటు: సత్య
ఏసీ రూముల్లో కూర్చుని కూటమి ప్రభుత్వంపై బురదజల్లడం వైసీపీ నాయకులకు అలవాటైపోయిందని మంత్రి సత్యకుమార్ మండిపడ్డారు. డీఎస్సీపై చర్చకు సిద్ధమా అని ఆయన వైసీపీ నాయకులకు సవాల్ విసిరారు. శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలో పర్యావరణ పరిరక్షణ కార్యక్రమంలో శుక్రవారం పాల్గొన్న మంత్రి, డీఎస్సీ గురించి వైసీపీ చేసిన ఆరోపణలపై స్పందించారు. పచ్చకామెర్లు ఉన్నవారికి లోకమంత పచ్చగానే కనిపిస్తుందని, వైసీపీ నాయకుల తీరు కూడా అలాగే ఉందని అన్నారు.