ఏలేరుకు 950 క్యూసెక్కులు
ABN , Publish Date - Aug 20 , 2026 | 04:32 AM
ఏలేరు రిజర్వాయర్ ఆయకట్టు సాగునీటి అవసరాల కోసం 950 క్యూసెక్కుల నీటిని పంపిణీ చేస్తున్నామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు.
అసెంబ్లీలో మంత్రి నిమ్మల వెల్లడి
అమరావతి, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): ఏలేరు రిజర్వాయర్ ఆయకట్టు సాగునీటి అవసరాల కోసం 950 క్యూసెక్కుల నీటిని పంపిణీ చేస్తున్నామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. ఇప్పటి వరకూ 2.6 టీఎంసీల నీటిని పంపిణీ చేశామని తెలిపారు. బుధవారం అసెంబ్లీలో యల్లసిరి కెనాల్ పనులు, ఏలేరు జలాశయం పరిధిలోని ఆయకట్టుకు నీటి సరఫరాపై ఎమ్మెల్యేలు సునీల్‌కుమార్, జ్యోతుల నెహ్రూ, యనమల దివ్య ఆడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. ఏలేరు రిజర్వాయర్ ఆయకట్టుకు సాగు, తాగు నీటి సరఫరాపై సీఎం, డిప్యూటీ సీఎం సూచనల మేరకు ప్రత్యేక దృష్టి పెట్టామని తెలిపారు. గత ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో ఏలేరు నదీ గర్భంలో జరిగిన ఇసుక అక్రమ తవ్వకాల కారణంగా బెడ్ లెవల్ పడిపోయిందని, దీంతో గ్రావిటీ ద్వారా నీటిని అందించలేని పరిస్థితి ఏర్పడిందని అన్నారు. గత ప్రభుత్వం ఏలేరు ఆయకట్టు పరిధిలో నిర్వహణ, మరమ్మతు పనులకు ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదని విమర్శించారు. కూటమి ప్రభుత్వంలో 548 పనులకు రూ.25 కోట్లు విడుదల చేశామన్నారు. సూపర్ ఎన్‌నినో వంటి క్లిష్ట వాతావరణ పరిస్థితుల్లోనూ 53 వేల ఎకరాల ఏలేరు రిజర్వాయర్ ఆయకట్టు, 1.48 లక్షల ఎకరాల పుష్కర ఆయకట్టుకు సాగు, తాగునీరు అందిస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వం ఉత్తరాంధ్రకు సాగు, తాగునీరు అందించే పోలవరం ఎడమ కాలువ పనులను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని, కనీసం తట్టమట్టి పని కూడా చేయలేదని విమర్శించారు.
కూటమి ప్రభుత్వం వచ్చిన రెండేళ్లలోనే పోలవరం ఎడమ కాలువకు సంబంధించి రూ.1800 కోట్లతో పంపా, తాండవ, ఏలేరు నదుల క్రాసింగ్ పనులతో పాటు 11 హైవే క్రాసింగ్ వంతెనల పనులను పూర్తి చేశామని తెలిపారు. పురుషోత్తపట్నం లిఫ్ట్ స్కీమ్‌తో పాటు పోలవరం ఎడమ కాలువ పనులను ముందుకు తీసుకెళ్లడం వల్లే ఏలేరుకు సాగు, తాగు నీరు అందించే పరిస్థితి ఏర్పడిందని సృష్టం చేశారు. అలానే గూడూరు నియోజకవర్గానికి సాగునీరు అందించే కండలేరు జలాశయం- సత్యసాయి గంగా 7వ బ్రాంచ్ నుంచి 15 ప్రధాన కాలువ వరకూ యల్లసిరి కాలువ పనుల కోసం రూ.28.50 కోట్లు ప్రతిపాదనలు సిద్ధం చేశామని, ఆర్థిక శాఖ అనుమతులు రాగానే పనులు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు.