Pilli Subhash Chandrabose: వైసీపీ హయాంలో 1.23 కోట్లు స్వాహా
ABN , Publish Date - Jan 20 , 2026 | 04:41 AM
అంబేడ్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం పట్టణంలో పేదల గృహ నిర్మాణం పేరుతో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రూ.1 కోటి 22 లక్షల 93 వేలు కైంకర్యం చేశారు...
పేదలకు ఇళ్లు పేరుతో మెప్మా సొమ్ము మింగేశారు
వైసీపీ ఎంపీ పిల్లి సుభాశ్ చంద్రబోస్ సంచలన ఆరోపణలు
రామచంద్రపురం(ద్రాక్షారామ), జనవరి 19 (ఆంధ్రజ్యోతి): ‘అంబేడ్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం పట్టణంలో పేదల గృహ నిర్మాణం పేరుతో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రూ.1 కోటి 22 లక్షల 93 వేలు కైంకర్యం చేశారు’ అని ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాశ్ చంద్రబోస్ ఆరోపించారు. సోమవారం స్థానిక వైసీపీ కార్యాలయంలో విలేకరులతో ఎంపీ మాట్లాడారు. ‘రామచంద్రపురం పట్టణానికి సంబంధించి వెల్ల, వెల్లసావరం, ఉండూరు, ఏరుపల్లి హసన్‌బాద గ్రామాల్లో స్థలాలు కేటాయించారు. ఓ కాంట్రాక్టరుకు కొంత సొమ్ము చెల్లిస్తే గృహాలు నిర్మించి ఇస్తారని లబ్ధిదారులకు చెప్పారు. లబ్ధిదారులు మెప్మా ద్వారా రుణాలు తీసుకొని కాంట్రాక్టర్‌కు రూ.కోటికిపైగా చెల్లించారు. అలా వచ్చిన సొమ్ములో బీ వెంకట రమణకు రూ.86.63 లక్షలు, కె.శ్రీనివా్‌సకు రూ.14.80 లక్షలు, షియర్ వాల్ టెక్నాలజీ సంస్థకు రూ.21.50 లక్షలు చెల్లించారు. ఈ వ్యవహారమంతటికీ రింగ్‌లీడర్ అప్పటి మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్ రెడ్డి. గృహ నిర్మాణ శాఖ లబ్ధిదారులపేరుతో సిమెంటు, ఐరన్ ఇచ్చింది. అయితే గృహ నిర్మాణాలు మొదలు పెట్టలేదు. పేద ప్రజల పేరుతో మెప్మా సొమ్ములు కైంకర్యం చేసిన వారిని కోర్టు ముందు హాజరు పరచాలి. ఈ విషయం సీఎం దృష్టికి తీసుకువెళతాం. రామచంద్రపురం వంటి చిన్న పట్టణంలో రూ.1.22 కోట్లు అంటే చాలా పెద్ద విషయం. నష్టపోయిన పేదలు, కైంకర్యం చేసిన వారూ వైసీపీనే. ఎవరైతే ఏంటి? తప్పుచేసిన వారు శిక్షింపబడాల్సిందే’ అని స్పష్టం చేశారు.