Share News

చైర్మన్‌ చాంబరు వద్ద వైసీపీ ఎమ్మెల్సీల గొడవ

ABN , Publish Date - Feb 24 , 2026 | 05:31 AM

శాసనమండలి చైర్మన్‌ మోషేన్‌రాజు చాంబరు వద్ద వైసీపీ ఎమ్మెల్సీలు సోమవారం నిరసనకు దిగారు.

చైర్మన్‌ చాంబరు వద్ద వైసీపీ ఎమ్మెల్సీల గొడవ

  • తాము చెప్పులతో శ్రీవారి ఫొటోలు పట్టుకున్న క్లిప్పింగులు బయటకు రావడంపై నిరసన

అమరావతి, ఫిబ్రవరి 23(ఆంధ్రజ్యోతి): శాసనమండలి చైర్మన్‌ మోషేన్‌రాజు చాంబరు వద్ద వైసీపీ ఎమ్మెల్సీలు సోమవారం నిరసనకు దిగారు. ఈ నెల 20న తాము చెప్పులు వేసుకుని శ్రీవేంకటేశ్వరస్వామి ఫొటోలు సభ లోపల, ప్రాంగణంలో పట్టుకున్నట్లుగా ఉన్న క్లిప్పింగును మంత్రి లోకేశ్‌ బయటపెట్టడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. తొలుత వారు ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణతో భేటీ అయ్యారు. లోకేశ్‌ విడుదల చేసిన క్లిప్పింగులు ప్రధానంగా ‘ఆంధ్రజ్యోతి’లో ఎలా ప్రచురితమయ్యాయని కొందరు అసహనం వ్యక్తం చేశారు. పాలకపక్షానికి కొమ్ముకాసేలా చైర్మన్‌ ఎలా వ్యవహరిస్తారని మరికొందరు ఆక్రోశం వెలిబుచ్చారు. ఆ క్లిప్పింగులకు విరుగుడుగా పోడియం వద్ద తాము నిరసన వ్యక్తం చేసిన ఫొటోలను విడుదల చేయాలంటూ చైర్మన్‌ను కోరదామని బొత్సను కోరారు. ఆయన అందుకు సమ్మతించడంతో.. చైర్మన్‌ చాంబరు ఎదుట బైఠాయించారు. బొత్సను చైర్మన్‌ తన చాంబరుకు పిలిపించుకున్నారు. అసెంబ్లీ సెక్రటరీ జనరల్‌ ప్రసన్నకుమార్‌తోనూ సంప్రదింపులు జరిపారు. చైర్మన్‌తో మాట్లాడి బయటకు వచ్చిన బొత్స.. నినాదాలు చేయాలని.. కానీ చాంబరు తలుపులు బాదవద్దని, ఈలలు వేయొద్దని వారికి సూచించారు. దీంతో.. అప్పటిదాకా నినాదాలు మాత్రమే చేస్తూ వచ్చిన వైసీపీ ఎమ్మెల్సీలు ఒక్కసారిగా చాంబరు తలుపులు గట్టిగా బాదుతూ చైర్మన్‌ బయటకు రావాలని డిమాండ్‌ చేశారు. దరిమిలా వారందరినీ మోషేన్‌రాజు లోపలకు పిలిచారు. శుక్రవారం మండలిలో పోడియం ఎదు ట తాము నిరసన చేసిన క్లిప్పింగులను ఇవ్వాలని వారు డిమాండ్‌చేశారు. ఇస్తానని ఆయన హామీఇవ్వడంతో నిరసన విరమించారు.

చైర్మన్‌కు పయ్యావుల ఫిర్యాదు..

సోమవారం కూడా శ్రీవారి ఫొటోలతో మండలికి రావాలని వైసీపీ ఎమ్మెల్సీలు అనుకున్నారు. ఈ సమాచారం తెలుసుకున్న మంత్రి పయ్యావుల కేశవ్‌.. చైర్మన్‌ మోషేన్‌రాజును సంప్రదించారు. దీంతో స్వామి పోస్టర్లతో ప్రాంగణం, సభలోకి రావొద్దని చైర్మన్‌ ఆదేశించారు.

Updated Date - Feb 24 , 2026 | 05:31 AM