Share News

మండలి చైర్మన్‌పై అవిశ్వాస అస్త్రం!

ABN , Publish Date - Mar 05 , 2026 | 04:09 AM

శాసన మండలి చైర్మన్‌ మోషేన్‌ రాజుపై అవిశ్వాస అస్త్రం ప్రయోగించాలని వైసీపీకి రాజీనామా చేసిన ఎమ్మెల్సీలు ఆలోచన చేస్తున్నారు.

మండలి చైర్మన్‌పై అవిశ్వాస అస్త్రం!

  • వైసీపీకి రాజీనామా చేసిన ఎమ్మెల్సీల యోచన

అమరావతి, మార్చి 4(ఆంధ్రజ్యోతి): శాసన మండలి చైర్మన్‌ మోషేన్‌ రాజుపై అవిశ్వాస అస్త్రం ప్రయోగించాలని వైసీపీకి రాజీనామా చేసిన ఎమ్మెల్సీలు ఆలోచన చేస్తున్నారు. తమ రాజీనామాలను ఆమోదించకుం డా ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తున్న చైర్మన్‌కు తమ నిరసన తెలిపేందు కు అవిశ్వాస తీర్మానం నోటీసు ఇవ్వాలని వైసీపీకి రాజీనామా చేసిన ఐదుగురు ఎమ్మెల్సీలు భావిస్తున్నారు. బుధవారం అసెంబ్లీ లాబీలో వైసీపీకి రాజీనామా చేసిన ఎమ్మెల్సీ బల్లి కల్యాణ చక్రవర్తి మాట్లాడుతూ మండలి చైర్మన్‌గా నాడు వైసీపీ నుంచి మోషేన్‌ రాజును తానే ప్రతిపాదించానని, ఆయనపై ఇప్పుడు అవిశ్వాసం పెట్టాలని కూడా తానే ప్రతిపాదిస్తానని అన్నారు. జగన్‌ రెడ్డి వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా ఆ పార్టీకి, ఎమ్మె ల్సీ పదవికి 2024 ఆగస్టు 30న రాజీనామా చేసినా ఇప్పటివరకు ఆమోదించలేదని చక్రవర్తి అన్నారు. తనతోపాటు కర్రి పద్మశ్రీ, పోతుల సునీత, మర్రి రాజశేఖర్‌, జయమంగళం వెంకటరమణ రాజీనామాలు చేశారని, వారి రాజీనామాలు కూడా ఆమోదించడం లేదన్నారు. చైర్మన్‌ తీరు ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా.. ఎమ్మెల్సీలను అవమానించేలా ఉందన్నా రు. తమ నిరసన తెలియజేందుకు చైర్మన్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టాలని నిర్ణయించామన్నారు. చైర్మన్‌పై అవిశ్వాసం పెట్టడానికి 14 రోజుల ముందు నోటీసు ఇవ్వాలని, ఈ సెషన్‌లో కాకపోయినా.. వచ్చే సెషన్‌లోనైనా నోటీసు ఇస్తామన్నారు. తీర్మానం నెగ్గుతుందా.. లేదా? అన్నది ప్రశ్న కాదన్నారు. అవిశ్వాస తీర్మానం నోటీసుపై తాము ఐదుగురు సంతకాలు చేస్తే సరిపోతుందని, నిర్దేశిత సంఖ్యలో సభ్యులు సంతకం చేయాలని అసెంబ్లీ నిబంధనల్లో ఎక్కడా లేదన్నారు.

Updated Date - Mar 05 , 2026 | 04:09 AM