నేను ఎమ్మెల్సీని.. తెలుసా?
ABN , Publish Date - May 02 , 2026 | 04:57 AM
డ్రైవర్ హత్య కేసులో సాక్షులను బెదిరించిన కేసులో ప్రస్తుతం రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో రిమాండ్‌లో ఉన్న వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు తీరు ఏమాత్రం మారడం లేదు.
నాకు ప్రత్యేక సదుపాయాలు కల్పించండి
రాజమండ్రి జైల్లో అనంతబాబు హల్‌చల్
పాత పరిచయాలతో సిబ్బందిపై రుబాబు
కోర్టుకు వెళ్లి ఆదేశాలు తెచ్చుకోవాలని
అధికారులు చెప్పినా అదే ప్రవర్తన
కాకినాడ, మే 1 (ఆంధ్రజ్యోతి): డ్రైవర్ హత్య కేసులో సాక్షులను బెదిరించిన కేసులో ప్రస్తుతం రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో రిమాండ్‌లో ఉన్న వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు తీరు ఏమాత్రం మారడం లేదు. తాను ఎమ్మెల్సీనని, తనకు ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని జైలు అధికారులతో వాగ్వాదానికి దిగుతున్నారు. తన హోదా గురించి తెలియదా అంటూ అధికారులను బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రత్యేక సదుపాయాలు కావాలంటే కోర్టుకు వెళ్లాలని, న్యాయస్థానం నుంచి ఆదేశాలు వస్తే అమలు చేస్తామని అధికారులు చెప్పినా... అనంతబాబు తన ప్రవర్తన మార్చుకోవడం లేదని సమాచారం. డ్రైవర్ హత్య కేసులో అనంతబాబు 2022లో కొన్నినెలలు రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో ఉన్నారు. ఆ సమయంలో వైసీపీ అధికారంలో ఉండడంతో ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో జైల్లో రాచమర్యాదలు జరిగాయి. ప్రభుత్వం మారినా జైల్లో చాలామంది అప్పట్లో పనిచేసిన అధికారులు, సిబ్బంది ఉన్నారు. పాత పరిచయాలతో తనకు ప్రత్యేక సదుపాయాల కోసం అనంతబాబు రుబాబు చేస్తున్నారు.
కస్టడీపై 4న కోర్టు ఆదేశాలు: సాక్షులను బెదిరించిన కేసులో అనంతబాబును కస్టడీకి ఇవ్వాలంటూ దాఖలైన పిటిషన్‌పై శుక్రవారం కాకినాడ కోర్టులో వాదనలు జరిగాయి. దీనిపై సోమవారం ఆదేశాలు ఇవ్వనున్నట్లు న్యాయాధికారి పేర్కొన్నారు. సర్పవరం పోలీ్‌సస్టేషన్‌లో అనంతబాబు సహా మరో ముగ్గురిపై కేసు నమోదుకాగా.. ఏ2, ఏ3 ఇంకా పరారీలోనే ఉన్నారు. వీరిద్దరూ వైసీపీకి చెందిన ఓ మాజీ మంత్రి అనుచరులు. ఈ కేసులో తాజాగా ఏ5గా చెక్కపల్లి శ్రీనివాసకుమార్ అనే నిందితుడిని చేర్చారు.
సాక్షులు, డ్రైవర్ కుటుంబానికి రక్షణగా..
డ్రైవర్ హత్యకేసులో తనకు వ్యతిరేకంగా న్యాయస్థానంలో సాక్ష్యం చెప్పవద్దని, కాదంటే చంపేస్తానని నలుగురు సాక్షులను ఏ1 అనంతబాబు ఇటీవల బెదిరించారు. అనంతబాబు, ఆయన అనుచరుల నుంచి ముప్పు పొంచి ఉండడంతో సాక్షులకు భద్రత కల్పించేందుకు వారి ఇళ్ల వద్ద పోలీసు నిఘా ఏర్పాటు చేశారు. అనుమానాస్పద కదలికలపై దృష్టి పెట్టారు. హత్యకు గురైన డ్రైవర్ సుబ్రహ్మణ్యం కుటుంబానికి కూడా ప్రాణాపాయం ఉండడంతో కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు చర్యలు తీసుకున్నారు. కాకినాడ జిల్లా పెదపూడిలో ఉంటున్న సుబ్రహ్మణ్యం తల్లిదండ్రుల ఇంటివద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాల ద్వారా పోలీసులు పర్యవేక్షిస్తున్నారు.